Virosh Wedding | టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవల వివాహాబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాహం డిజిటల్ వరల్డ్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. ఈ పోస్ట్‌కి లైక్స్ వర్షం కురుస్తుంది. కేవలం 24 గంటల లోపే ఈ జంట భారతీయ సెలబ్రిటీల పెళ్లిళ్ల రికార్డులన్నింటినీ తిరగరాసింది.
గతంలో కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి ఫోటోలకు వచ్చిన 16 మిలియన్ల లైక్సే ఇప్పటివరకు అత్యధికం కాగా, ‘విరోష్’ జంట ఆ మైలురాయిని కేవలం 14 గంటల్లోనే అధిగమించి 16.7 మిలియన్లకు పైగా లైక్స్‌తో సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది. ఇతర ప్రముఖ జంటలైన అలియా భట్-రణబీర్ కపూర్ (13మి+), సమంత-నాగ చైతన్య (12మి+), కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ (10మి+), మరియు దీపికా పదుకొనే-రణవీర్ సింగ్ (8మి+) రికార్డులను కూడా ఈ జంట వెనక్కి నెట్టింది. ప్రస్తుతం ఈ జంట 23.3 మిలియన్ల లైక్స్‌తో దూసుకుపోతుంది. ఇది ఇలానే కొనసాగితే.. విరాట్ కోహ్లీ అత్యధిక లైక్స్ పోస్ట్(22 – 24 మి+)ని కూడా బద్దలు కొట్టేలా కనిపిస్తుంది.
కేవలం తక్కువ సమయంలోనే ఇన్ని మిలియన్ల లైక్స్ రావడం సోషల్ మీడియాలో వీరికున్న విపరీతమైన క్రేజ్‌కు ఇది నిదర్శనంగా నిలుస్తోంది. విజయ్ తన పోస్ట్‌లో “నా బెస్ట్ ఫ్రెండ్‌ను భార్యగా చేసుకున్నాను” అని, రష్మిక “నాకు నిజమైన ప్రేమను పరిచయం చేసిన వ్యక్తి” అని పెట్టిన ఎమోషనల్ క్యాప్షన్లు నెటిజన్ల మనసు గెలుచుకున్నాయి. ఈ ఫోటోలు కేవలం టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్ మరియు సౌత్ ఇండస్ట్రీ అంతటా గ్లోబల్ లెవల్లో ట్రెండ్ అవుతున్నాయి. దాదాపు ఎనిమిదేళ్ల రహస్య ప్రేమ ప్రయాణం తర్వాత ఒక్కటైన ఈ జంటకు సినీ ప్రముఖుల నుండి, అభిమానుల నుండి భారీగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఉదయపూర్ వేడుక ముగియడంతో, మార్చి 4న హైదరాబాద్‌లో జరగనున్న వీరి గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు రాజకీయ, సినీ దిగ్గజాలు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు.