Lok Sabha Elections | సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ): ఓటర్లలో చైతన్యం నింపేందుకు వేదికగా సోషల్ మీడియా మారింది. పోలింగ్ ప్రారంభమైన కొన్ని నిమిషాల నుంచే ఓటు వేసిన వారంతా సెల్ఫీలు తీసుకొని పోస్టులతో హోరెత్తించారు. ‘నేను ఓటు వేశారు.. మీరు వేశారా’? అంటూ వాట్సాప్‌లో డీపీలు, పలు గ్రూపుల్లో సిరా చుక్క అంటించిన చూపుడు వేలును చూపిస్తూ.. పోస్టులు పెట్టారు. కేవలం ఫొటోలు మాత్రమే కాదు.. తాము ఓటింగ్‌పై చెప్పాలనుకున్న విషయాన్ని షార్ట్ వీడియోల రూపంలో వ్యక్తం చేశారు. ఓటు వేసిన కొందరు తమ ఫ్రెండ్స్, కాలనీకి చెందిన సోషల్ మీడియా గ్రూపుల్లో ఓటింగ్‌పైనే ఎక్కువగా చర్చించారు.
పోలింగ్ రోజు మంచి సందేశాన్ని ఇచ్చేలా.. సోషల్ మీడియాను ఓటర్లు వినియోగించున్నారనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు. ఓటు వేయాలన్న ఆలోచన లేని వారిని సైతం కదిలించేలా.. పోస్టులు సోషల్ మీడియాలో చాలా కనిపించాయని, ఇది మంచి పరిణామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఓటు వేసేలా.. ఎన్నికల కమిషన్ సైతం ప్రత్యేకంగా ప్రచారం చేపట్టింది. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలతో వివిధ మాద్యమాల్లోనూ ప్రచారం చేయించారు.
ఓటు ఔనత్యాన్ని తెలిపేలా.. సందేశాలు, ఫోన్ కాల్స్‌తో పాటు సోషల్ మీడియా మాధ్యమం ద్వారా వినిపించేలా ప్రయత్నం చేశారు. ప్రధానంగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం జరిగేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాల బయట ప్రత్యేకంగా సెల్ఫీబూత్లను ‘దేశ్ కా గర్వ్’ పేరుతో ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల లోపలికి వెళ్లే వారు స్మార్ట్ఫోన్లు తీసుకెళ్లకుండా పర్యవేక్షణ చేపట్టి, బయటకు వచ్చిన తర్వాత సెల్ఫీ పాయింట్ వద్ద ఫొటోలు తీసుకునేలా చర్యలు తీసుకున్నారు.