మేడ్చల్, పూడూరు-కిష్టాపూర్ డివిజన్ల పరిధిలో నీటి సమస్యను పరిష్కరించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఖాళీ కుండలు, బిందెలతో బీఆర్ఎస్ నేతలు పట్టణ ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం జీహెచ్ఎంసీ మేడ్చల్ సర్కిల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ..ఖాళీ కుండలు పగులగొట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత భాస్కర్ యాదవ్ డిప్యూటీ కమిషనర్ యాదవ్ సుధాంశు కాళ్లు మొక్కి మేడ్చల్‌లో నీటి సమస్యను పరిష్కరించి.. అక్కా చెల్లెళ్ల బాధలు తీర్చాలని వేడుకున్నారు. మిషన్ భగీరథ ద్వారా నీళ్లు వచ్చే విధంగా చూడాలని, పేదలు నివసించే వాడలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని కోరారు. అనంతరం నాయకులతో కలిసి డిప్యూటీ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు.
మేడ్చల్, మార్చి 9 : మేడ్చల్‌లో నీటి సమస్యను నాలుగు రోజుల్లో పరిష్కరించకుంటే మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి నేతృత్వంలో జల మండలిని ముట్టడిస్తామని బీఆర్ఎస్ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ హెచ్చరించారు. మేడ్చల్, పూడూరు-కిష్టాపూర్ డివిజన్ల పరిధిలో నీటి సమస్యను పరిష్కరించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన నిర్వహించారు. ఖాళీ కుండలు, బిందెలతో బీఆర్ఎస్ నేతలు పట్టణ ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించి, జీహెచ్ఎంసీ మేడ్చల్ సర్కిల్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో పదేండ్ల పాటు నీటి ఇబ్బందులు లేవన్నారు. ఇంటింటికీ నీళ్లు వచ్చాయన్నారు. కాంగ్రెస్ అధికారంలో రాగానే నీటి సమస్య ప్రారంభమైందన్నారు. కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ద్వారా మేడ్చల్‌లో ఇంటింటికీ నీళ్లు ఇచ్చారని, ఆ పథకాన్ని కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. కాళేశ్వరం నుంచి మేడ్చల్‌లోని ఘణపూర్ గుట్ట వరకు నీళ్లు వస్తాయెట్లా? అక్కడి నుంచి మేడ్చల్‌కు నీళ్లు రావెట్లా అని ఆయన ప్రశ్నించారు.
పట్టణంలోని అక్కాచెల్లెలు పడుతున్న గోస ఈ ప్రభుత్వానికి పట్టదా అని మండిపడ్డారు. జీహెచ్ఎంసీలో మేడ్చల్‌ను కలిపిన తర్వాత మరిన్ని ఇబ్బందులు తలెత్తాయన్నారు. నీళ్లు రావడం లేదని, డ్రైనేజీ పేరుకుపోయిన బాగు చేయడం లేదని, వీధి దీపాలు లేవని, పారిశుధ్యం అస్తవ్యవస్తంగా మారిందన్నారు. జీహెచ్ఎంసీలో కలిపిన పాపం, అక్కా చెల్లెళ్ల ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. మార్చిలో పరిస్థితి ఇలా ఉంటూ మే, జూన్ నెలల పరిస్థితి ఏమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

డీసీ కాళ్లు మొక్కిన భాస్కర్ యాదవ్..
డిప్యూటీ కమిషనర్ సుధాంశు ఆందోళనకారుల వద్దకు రావడంతో భాస్కర్ యాదవ్ కాళ్లు మొక్కి నీటి సమస్యను పరిష్కరించాలని, అక్కా చెల్లెల బాధలు తీర్చాలని వేడుకున్నారు. మిషన్ భగీరథ ద్వారా నీళ్లు వచ్చే చూడాలని, పేదలు నివసించే వాడలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని కోరారు. అనంతరం నాయకులతో కలిసి డిప్యూటీ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. బీఆర్ఎస్ నేతలు నవీన్ రెడ్డి, విష్ణుచారి, నిశితా రెడ్డి, మల్లికార్జున్ స్వామి, నడికొప్పు ఉమాగనారాజు, శంకర్, గడ్డం రాజు, తుడుం గణేశ్, నీలిమ, వరలక్ష్మి, రఘుపతి రెడ్డి, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
సమస్య పరిష్కారానికి చర్యలు..
నీటితో పాటు పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ సుధాంశు తెలిపారు. ఆయన మాట్లాడుతూ గత నెల 6న హెచ్ఎండబ్ల్యూఎస్కు మేడ్చల్ నీటి సరఫరా, డ్రైనేజీ బదిలీ అయిందన్నారు. వ్యవస్థను కూడా బదిలీ చేస్తున్నామన్నారు. హెచ్ఎండబ్ల్యూఎస్ ద్వారా పనులు జరుగుతాయన్నారు. మిషన్ భగీరథ సంప్‌లకు 10, 15 రోజుల నుంచి నీరు సరిపడా రావడం లేదన్నారు.