నారాయణపేట జిల్లా కేంద్రం సమీపంలోని పేరపళ్లలో జాయమ్మ చెరువు చుట్టుపక్కల భూసేకరణ పరిహారాన్ని మేసేందుకు.. నోటిఫికేషన్లకు ముందే రైతుల ముసుగులో కాంగ్రెస్ నాయకులు చదును చేయించిన గుట్టలు
మహబూబ్‌నగర్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నారాయణపేట జిల్లా కేంద్రం సమీపంలోని పేరపళ్ల గ్రామంలో భూ మాయాజాలం యథేచ్ఛగా కొనసాగుతున్నది. ఈ జిల్లాలో చేపడుతున్న కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా ముంపు గ్రామాల్లో బినామీ రైతుల పేరుతో పరిహారం స్వాహా చేసేందుకు ప్రయత్నిస్తున్న వైనంపై ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన ‘కొడంగల్ ఎత్తిపోతల.. కోట్లు మేత’ అనే కథనం ఉమ్మడి జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ కథనంపై కాంగ్రెస్ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. అక్రమాలు బయటపడటంతో హడావిడిగా తమకు సంబంధం లేదని బుకాయించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాగా కౌలు రైతుల పేరుతో బినామీలను సృష్టించిన కాంగ్రెస్ నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పేరపళ్ల గ్రామంలో జాయమ్మ చెరువు కట్ట పెంచుతున్నట్టు.. మరో 100 ఎకరాల భూమి ముంపులోకి వస్తుందని నమ్మబలుకుతున్నారు. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి దీనికి అనుగుణంగా పావులు కదుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.
మరో 100 ఎకరాల వరకు ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నదంటూ భూసేకరణకు నోటిఫికేషన్లు రెడీ చేస్తున్నట్టు తెలుస్తున్నది. మరోవారం పది రోజుల్లో ఈ నోటిఫికేషన్ విడుదల అవుతున్నదని అధికార యంత్రాంగం చెబుతున్నది. ఇదిలావుండగా పేరపళ్ల జాయమ్మ చెరువు చుట్టుపక్కల వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఉండటం.. ఆ భూముల్లో చాలావరకు గుట్టలు.. వాలు ప్రాంతాలు కావడంతో వ్యవసాయానికి అనువుగా లేవు. అయితే కమీషన్ కొడితే అప్పనంగా పరిహారం వస్తుందని కాంగ్రెస్ నేతలు కౌలు రైతుల అవతారం ఎత్తుతున్నారు. కొంతమంది ఈ మధ్య హడావిడిగా గుట్టల ప్రాంతంలో జేసీబీలను తీసుకెళ్లి చదును చేయడం ఈ అనుమానాలకు బలం చేకూరుతున్నది. మరోవైపు పార్టీ మారిన నేతలను కూడా కౌలు రైతులుగా సృష్టించి పరిహారం జాబితాలోకి ఎక్కించారు. ఇప్పటికే రెండు, మూడు జాబితాలు తారుమారయ్యాయని రైతులు అంటుండటం.. పరిహారం పక్కదారి పడుతుందనే ఆరోపణలకు బలం చేకూరుస్తున్నది. ఎకరాకు రూ.20 లక్షలు ఇస్తుండటంతో పేరపళ్ల దామరగిద్ద తండాలోని అసైన్డ్ లావణి పట్టాల్లో అక్రమంగా కౌలు రైతులను సృష్టించి పరిహారం కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు బాహాటంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ భూములే టార్గెట్‌గా..
నారాయణపేట జిల్లా పేరపళ్ల గ్రామంలో 998 ఎకరాల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి. సర్వే నంబర్ 87లో 394 ఎకరాలు, సర్వే నంబర్ 92లో 226 ఎకరాలు, సర్వే నంబర్ 111లో 378 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నది. ఇదంతా పనులు జరిగే ప్రాంతానికి ఆనుకొని ఉంటాయి. ఇందులో వ్యవసాయ యోగ్యమున్న చోట అదే గ్రామానికి చెందిన దళితులు, బీసీలు సాగు చేసుకుంటున్నారు. ఈ భూములే ప్రస్తుతం కాంగ్రెస్ నేతలకు కాసులు కురిపించే బంగారు భూములుగా మారాయి. నారాయణపేట మండలంలో పంప్‌హౌస్, చెరువు కట్టను పెంచి నీటిని నిలువ చేయడం వంటి పనులు ప్రధానంగా ఉన్నాయి. అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. గుట్టలు, ఎగుడు దిగుడు ప్రదేశం ఎక్కువగా ఉండటంతో ఈ భూముల్లో కూడా కౌలు రైతుల పేర్లతో రికార్డుల్లోకి వచ్చేశారు.
కౌలు రైతులకు రికార్డులు సృష్టించి..
ప్రాజెక్టుల్లో భూములు కోల్పోతున్న రైతులకు పట్టా కాగితాలతోపాటు పాసు పుస్తకాలు కూడా ఉంటాయి. ఈ పాసు పుస్తకాలను ఆధారంగా చేసుకొని ఎంత భూమి ముంపునకు గురైందో వాటికి మాత్రం పరిహారం ఇచ్చి ఆ భూమి మొత్తాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది. అయితే ఇక్కడ కొంతమంది రైతులకు ప్రభుత్వ భూముల్లో పట్టాలు ఉన్నాయి. కాంగ్రెస్ నేతలు సృష్టించిన రైతులకు మాత్రం ఎలాంటి రికార్డులు లేకపోవడంతో ఈ రైతుల పేరు మీద ఉన్న పట్టాలపై కౌలు రైతులు అంటూ సృష్టించారు. కౌలు రైతులకు ఎలాంటి రికార్డులు అవసరం లేదు. సంబంధిత పట్టాదారు ఒప్పుకొంటే చాలు.. ఇక్కడే అక్రమాలకు బీజం వేశారు.
తెరమీదికి మరో 100 ఎకరాలు
కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఎక్కడెక్కడ ఎంత భూమి ముంపునకు గురవుతున్నదో గుర్తించి నీటి పారుదల శాఖ అధికారులు రెవెన్యూ అధికారులకు ఇదివరకే నివేదికలు ఇచ్చారు. ఈ నివేదికలను అనుసరించి భూసేకరణ అధికారులు రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకొని ముంపునకు గురయ్యే భూమిని గుర్తించి నోటిఫికేషన్లు కూడా ఇచ్చారు. పనులు జరిగే చోట రైతులకు పరిహారం కూడా ఇచ్చేశారు. ఏమైందో ఏమో కానీ పేరపళ్ల గ్రామంలో ఇదివరకు సేకరించిన 371.10 ఎకరాల భూమి కాకుండా మరో 100 ఎకరాల వరకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తుండటం.. ఇప్పటికే విడుదల చేసిన మూడు నోటిఫికేషన్లలో కౌలు రైతులు భారీగా ఉండటం అనుమానాలకు తావిస్తున్నది. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా కొత్తగా మరికొంత ముంపు ప్రాంతాలను గుర్తించినట్టు నివేదికలు ఇచ్చారా? లేకపోతే రెవెన్యూ అధికారులే సృష్టించారా? అనేది తేలాల్సి ఉన్నది.
‘నమస్తే తెలంగాణ’పై కాంగ్రెస్ నేతల చిందులు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం నియోజకవర్గానికి సాగు, తాగునీరు కోసం ఉద్దేశించిన ప్రతిష్ఠాత్మకమైన కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకంలో కాంగ్రెస్ నేతలే అక్రమాలకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా నారాయణపేట జిల్లాలో ఓ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముంపునకు గురవుతున్న భూముల సర్వే నంబ ర్లు.. రైతుల జాబితాలపై బినామీ రైతులను సృష్టించడంలో తల మునకలైంది. ఇదిలాఉండగా అదే గ్రామానికి చెందిన కొంతమంది కాంగ్రెస్ నేతలు ఈ వ్యవహారంపై ఆందోళనకు దిగడంతో అందరూ సైలెంట్ అయిపోయారు. ఇటుకల వ్యాపారం చేసే ఓ మాజీ ప్రజాప్రతినిధి, పార్టీ మారిన ఓ కల్లు వ్యాపారిని కూడా ముంపు జాబితా లో చేర్చడంపై పలువురు నేతలు అలిగా రు. ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనంపై అదే గ్రామానికి చెందిన సర్పంచ్, మాజీ ఎంపీటీసీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు చిందులు తొక్కారు. కోర్టు నోటీసులు ఇస్తామని.. పరువునష్టం దావా వేస్తామని బెదిరింపులకు దిగారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం పేరపళ్లలో విచారణ జరిపి అర్హులైన రైతులకు పరిహారం అందించాలని కోరుతున్నారు.