బాల గణపతి
అరుణవర్ణంతో వెలుగొందుతుంటాడు. బుద్ధి, వివేకం, జ్ఞానం ప్రసాదిస్తాడు. బాలగణపతి ఉపాసనతో పిల్లలకు ఉత్సాహం, చదువుపై ఆసక్తి పెరుగుతాయి.

తరుణ గణపతి
మధ్యాహ్నపు సూర్యుడి వర్ణం కలిగి ఉంటాడు. భక్తులకు కార్యోన్ముఖులు కాగల పట్టుదలను, దీక్షను ప్రసాదిస్తాడు.

భక్త గణపతి
శరత్కాల చంద్రునిలా తెల్లని రూపంతో, చల్లని వెన్నెలతో ప్రకాశిస్తుంటాడు. తనను కొలిచినవారి హృదయంలో భక్తి ప్రపత్తులను ద్విగుణీకృతం చేస్తాడు. మానసిక ప్రశాంతతను కలుగజేస్తాడు.

వీర గణపతి
కుంకుమ వర్ణంతో ప్రకాశిస్తుంటాడు. భక్తులకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. శత్రువులను ఎదిరించే శక్తినిస్తాడు.

శక్తి గణపతి
సాయం సంధ్యలో సూర్యుడు ఉండే రంగులో కనిపిస్తాడు. తన భక్తులను సర్వశక్తి సంపన్నులుగా తీర్చిదిద్దుతాడు.

ధ్వజ గణపతి
పున్నమి చంద్రునిలా తెల్లని వర్ణం కలిగి ఉంటాడు. మేధస్సును పెంచి విద్యాబుద్ధులు ప్రసాదిస్తాడు. విద్యార్థులు ఈ గణపతిని పూజిస్తే తెలివితేటలు వృద్ధి చెందుతాయి.

సిద్ధి గణపతి
బంగారు వర్ణంలో దర్శనమిస్తాడు. సకల కార్యాల్లోనూ విజయాన్ని అనుగ్రహిస్తాడు.

ఉచ్చిష్ట గణపతి
ఇది సర్వోన్నతమైన గణపతి స్వరూపంగా చెబుతారు. ఈ వినాయకుడు నలుపు రంగులో ఉంటాడు. ఉచ్చిష్ట గణపతిని అర్చించడం వల్ల ధనధాన్యవృద్ధి, ఆరోగ్యం, సుఖశాంతులు లభిస్తాయి.

విఘ్న గణపతి
ఎనిమిది భుజాలతో దర్శనమిస్తాడు. త్రిమూర్తి స్వరూపుడీయన. విఘ్నాలను దాటిస్తాడు. భయంకరమైన ప్రమాదాలు, ఆటంకాలు ఎదురవకుండా విజయాలు ప్రసాదిస్తాడు.

క్షిప్ర గణపతి
ఈయన బోళా వినాయకుడు. అతి శీఘ్రంగా స్పందించి భక్త కోటిని కరుణిస్తాడు క్షిప్ర గణపతి. చాలాకాలంగా తీరని కోరికలను తీర్చి సంతోషం కలిగిస్తాడు.

హేరంబ గణపతి
విలక్షణమైన మంత్రమూర్తి, పంచముఖుడై, నాలుగు తలలు నాలుగు దిక్కులను చూస్తుండగా.. వాటిపైన ఐదో తల కలిగి ఉంటాడు. తనను నమ్మిన వారిని కాపాడుతూ ఉంటాడు.

లక్ష్మీ గణపతి
లక్ష్మీగణపతికి రెండు తొడలపైనా శ్రీదేవి, భూదేవి కూర్చొని ఉంటారు. ఈ గణపతి భక్తులకు ధనసంపద కలిగిస్తాడు.

వర గణపతి
ఈయన సులభ ప్రసన్నుడు. కోరిన వరాలన్నీ తక్షణమే ప్రసాదిస్తాడు.

హరిద్రా గణపతి
పసుపు రంగులో దర్శనమిస్తాడు. వివాహాది శుభకార్యాలలో తొలుత హరిద్రా గణపతిని పూజిస్తారు. ఈ దైవం విఘ్న నివారకుడు.

శ్రీమహాగణపతి
ఈయన సమగ్రమూర్తి. ఇప్పుడు మనం చూసే రూపం మహాగణపతిదే! ఈ వినాయకుడిని ప్రార్థిస్తే కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.

విజయ గణపతి
కుంకుమ వర్ణంలో ప్రకాశిస్తుంటాడు. సర్వకార్యాల్లోనూ సఫలతనిస్తాడు.

నృత్య గణపతి
ఈ గణపతిని తాండవ గణపతి అని కూడా అంటారు. పసిబాలుడి రూపంలో…
ఆనంద తాండవం చేస్తుంటాడు. ఈయన మోక్ష స్వరూపుడు కొలిచిన వారికి సంతృప్తిని, మనశ్శాంతిని ఇస్తాడు.

ఊర్ధ్వ గణపతి
పసుపు పచ్చని శరీర ఛాయ కలిగి ఉంటాడు. ఎడమ తొడపై లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది. తనను నమ్ముకున్న భక్తులకు పాప విమోచనం చేస్తాడు.

ఏకాక్షర గణపతి
ఏకాక్షర గణపతి భక్తుల చింత, శోకం, అజ్ఞానం పోగొడతాడు. ప్రశాంతతను, సంతోషాన్ని కలిగిస్తాడు.

త్రయక్షర గణపతి
విఘ్నాలు తొలగించి, సర్వసిద్ధిత్వం కలిగించి అజ్ఞాన విముక్తులను చేస్తాడు త్రయక్షర గణపతి.

సృష్టి గణపతి
దైనందిన కార్యక్రమాలు, సృష్టి కార్యాలు నిరాటంకంగా జరిగేలా అనుగ్రహించే దేవుడు సృష్టి గణపతి.

ఏకదంత గణపతి
ఆసురీ ప్రవృత్తులను, భయాల్ని తొలగించే ఈ గణపతి ఏకదంతుడు. భక్తులకు సమయజ్ఞతను ఇస్తాడు. వ్యాసుడు భారతం చెబుతుండగా.. ఘంటం విరిగిపోతే, తన దంతాన్ని పెకలించి, దానితో రాతను కొనసాగించాడట గణపతి. అలా ఏకదంతుడయ్యాడని పురాణ కథనం.

ఉద్దండ గణపతి
దుష్ట శక్తులను, శత్రువులను ఎదుర్కొనే సాహస సామర్థ్యాలను అనుగ్రహిస్తాడు ఉద్దండ గణపతి.

రుణ విమోచన గణపతి
సకల రుణాల నుంచి విముక్తిని ప్రసాదిస్తాడీ స్వామి.

ద్విముఖ గణపతి
రెండు ముఖాలు కుడి ఎడమలకు తిరిగి ఉన్న ఈ గణపతి విశేషమైన సంపదలను ప్రసాదిస్తాడు.

డుండి గణపతి
కాశీ విశ్వనాథుడి సన్నిధిలో ఉండే ఈ ప్రమథ గణనాథుడు భక్తులకు శుభాలను, సౌఖ్యాలను అనుగ్రహిస్తాడు.

క్షిప్ర ప్రసాద గణపతి
ఈ గణపతి కీర్తి ప్రతిష్ఠలు, పదవులు, సత్కారాలు అందజేస్తాడు.

సింహ గణపతి
భక్తులను ధైర్యవంతులుగా చేసి, ఆత్మవిశ్వాసంతో వారిని ముందుకు నడిపిస్తాడు సింహ గణపతి.

దుర్గ గణపతి
సకల పాపాలను దూరం చేసి, ఉపాసకులను ఈ దుర్గ గణపతి కంటికి రెప్పలా కాపాడతాడు.

యోగ గణపతి
ఈ గణపతి యోగమూర్తి. మూలాధార స్థితుడైన జప, తప, ధ్యాన తత్పరుడు. బ్రహ్మజ్ఞానానికి యోగ గణపతి ప్రతీక. ఆయురారోగ్య ప్రదాత.

సంకటహర గణపతి
భక్తుల సంకటాలన్నీ హరించే కరుణమూర్తి ఈయన. సంతోషం, ఆనందంతో జీవితాలలో వెలుగులు నింపే వాత్సల్యమూర్తి సంకటహర గణపతి.

త్రిముఖ గణపతి
అకార, ఉకార, మకారాల స్వరూపంగా కుడి ఎడమలకు రెండు ముఖాలు. మధ్యన ముఖ్య శిరస్సుతో త్రిముఖ గణపతి కనిపిస్తాడు. కరుణ, జాలితో దీనులను, నిస్సహాయులను కరుణిస్తూ ఉంటాడు.