బెంగళూరు, ఆగస్టు 2: కుర్కురే ప్యాకెట్లోని బొమ్మ బంతి గొంతులో ఇరుక్కోవడంతో కర్ణాటకకు చెందిన 5 ఏండ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కుర్కురే ప్యాకెట్తోపాటు కాంప్లిమెంటరీగా వచ్చిన ఆ ప్లాస్టిక్ బంతిని బాలుడు ప్రమాదవశాత్తు మింగేశాడని, దాంతో ఊపిరాడక బాలుడు మృతి చెందినట్టు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ ఘటన కర్ణాటకలోని మైసూర్ జిల్లా గౌరీపుర గ్రామంలో చోటుచేసుకుంది. సదరు బాలుడు ఆడుకుంటుండగా, ప్యాకెట్లో ఉచితంగా వచ్చిన ప్లాస్టిక్ బంతిని పొరపాటుగా మింగి ఉంటాడని భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఆ బాలుడిని అత్యవసరంగా దవాఖానకు తరలించినప్పటికీ, అతడి ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటన బాధిత కుటుంబాన్ని, గ్రామస్థులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. అయితే ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి ఫిర్యాదూ అందలేదని పోలీసులు చెప్పారు.