జూరాల ప్రాజెక్టు నుంచి రైతులకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ చేపట్టిన ధర్నా నేపథ్యంలో ఆ పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులతో తమ గొంతును అణచలేరని బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇంచార్జి హనుమంతు నాయుడు, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు, జోగులాంబ గద్వాల జిల్లా కో ఆర్డినేటర్ కురువ పల్లయ్య స్పష్టం చేశారు. రైతులకు జూరాల నీటిని విడుదల చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాస్ హనుమంతు నాయుడును పోలీసులు అర్ధరాత్రి నుంచి హౌస్ అరెస్టు చేశారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు, జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్యను గద్వాల టౌన్ పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జూరాల వద్ద రైతులకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలోనే ఈ ముందస్తు అరెస్టులు జరిగాయని వారు ఆరోపించారు. ఎన్ని అరెస్టులు చేసినా రైతుల కోసం తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
జూరాల కుడి, ఎడమ కాలువల గేట్లను ఎందుకు మూసివేశారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. రైతులకు తక్షణమే జూరాల నీటిని విడుదల చేయాలని కోరారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను పక్కనపెట్టి నీటిని ఆంధ్రా ప్రాంతాలకు తరలిస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర రైతుల నోట్లో మట్టి కొట్టి.. నీటిని ఆంధ్రాకు ధారాదత్తం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూరాల నుంచి నీళ్లు ఎందుకు ఇస్తలేవని వారు ప్రశ్నించారు. మీ గురువు చంద్రబాబు నాయుడు కళ్ళలో ఆనందం చూడడం కోసమా అని నిలదీశారు. పాలమూరును పండబెడుతున్న పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి అని అన్నారు. మన నీటిని వాడుకోవడానికి నిర్బంధాలా? ఎవరి కోసం మీరు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించేది అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కోసమా లేక చంద్రబాబు నాయుడు కోసమా అని నిలదీశారు. తక్షణమే జూరాల గేట్లను ఎత్తి రైతులకు నీళ్లు ఇవ్వాలన్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున రైతులు ఉద్యమిస్తారని.. అప్పుడు రేవంత్ సర్కార్ మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు.