ఏథెన్స్: గ్రీస్‌లోని ఏథెన్స్కు పశ్చిమాన ఉన్న పసాథా ప్రాంతంలో కార్చిచ్చును ఆర్పేందుకు శ్రమిస్తున్న రెండు అగ్నిమాపక హెలికాప్టర్లు గాల్లోనే పరస్పరం ఢీకొన్నాయి. వెంటనే ఒక హెలికాప్టర్ పేలిపోయి నేలకూలింది. గ్రీస్‌లో గత కొన్ని రోజులుగా కార్చిచ్చులు రగులుతున్నాయి. ఈ భీకర మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగిన రెండు బెల్ హెలికాప్టర్లు ఆదివారం ప్రమాదానికి గురయ్యాయి. వెంటనే సహాయక బలగాలు రంగంలోకి దిగాయి. జాతీయ ప్రసార సంస్థ ఈఆర్టీ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో సిబ్బంది ఒకరు ప్రమాదం నుంచి బయటపడగా, మరొకరు గల్లంతయ్యారు. ఏథెన్స్కు వాయవ్యంగా ఉన్న పోర్టో జెర్మెనో తీర ప్రాంతం చుట్టూ దాదాపు 500 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు.