నిజామాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాజీవ్ యువ వికాసం పేరుతో యువతకు చేదోడు వాదోడుగా నిలిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని రూపొందించింది. ఉపాధి అవకాశాలు కల్పించడం, సొంతంగా వ్యాపారాలు చేసుకునే వారికి ప్రోత్సాహం అందించడం ఈ పథకం ముఖ్యోద్దేశం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇందులో జనాభా ఆధారంగా యూనిట్లు సైతం కేటాయించేందుకు నిర్ణయించారు. పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. నిరుద్యోగులను ఆదుకుంటామంటూ భారీ ప్రకటనలు చేయడంతో లక్షల మంది దరఖాస్తులు సమర్పించారు.
ఈ ప్రక్రియ మొదలై దాదాపుగా ఏడాది దాటి పోయింది. రాజీవ్ యువ వికాసం పథకం అమలుపై ఎలాంటి ముందడుగు లేకపోవడంతో రాజీవ్ యువ విలాపం అన్నట్లుగా పరిస్థితి దాపురించింది. ఓ వైపు నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయడం లేదు. కనీసం ఉపాధి అవకాశాల నిమిత్తం తీర్చిదిద్దిన పథకాన్ని అమలు చేయడం లేదు. ఇచ్చిన మాటను నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగ యువత దుమ్మెత్తి పోస్తున్నారు. రాజీవ్ యువ వికాసం పథకం అమలవుతుందా? లేదా? అని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం సమాధానం చెప్పడం లేదు.
నిరుద్యోగులకు నయవంచన…
నిరుద్యోగులను రేవంత్ రెడ్డి రోజుకో విధంగా మోసం చేస్తున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వంలో వచ్చిన వెంటనే 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మాట తప్పారని మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైనప్పటికీ ఉద్యోగాల భర్తీ చేపట్టడం లేదు. పుస్తకాలతో కుస్తీ పడుతున్న నిరుద్యోగ యువతలో నిరాశ, నిస్పృహ పెరిగి పోతోంది. కోచింగ్ సెంటర్లలో ప్రిపరేషన్‌కు రూ.వేలు ఖర్చు పెట్టలేక ఇంటిముఖం పట్టి కూలీనాలీ చేసుకుంటూ బతుకుతున్నారు.
రాజీవ్ యువ వికాసం లాంటి పథకంతో స్వయం ఉపాధినైనా దక్కించుకోవాలని ఆశపడిన యువతీ, యువకులకు రేవంత్ రెడ్డి వంచిస్తుండటంపై ఆగ్రహావేశాలు పెరిగి పోతున్నాయి. రాయితీ రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలంటూ యువతను ఎగదోసి మోనంగా ఉండటం ఏమిటంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఉద్యోగాల భర్తీ చేయక, నిరుద్యోగ భృతి ఇవ్వక, నిరుద్యోగులకు స్వయం ఉపాధి పథకాన్ని అమలు చేయక కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోంది. రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక, ఆర్థిక సాయం, రుణాలు ఇప్పించడం, రాయితీల కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ ఛైర్మన్‌గా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కన్వీనర్‌గా ఆయా శాఖల అధికారులు, బ్యాంక్ అధికారులు సభ్యులుగా ఒక కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ సుప్తావస్థలోకి జారుకుంది. ఈ పథకం పరిధిలో స్వీకరించిన దరఖాస్తుల్లో ఒక్కటంటే ఒక్కటీ పరిశీలన చేయలేదు. యూనిట్లు మంజూరు కాలేదు.

బలహీన వర్గాల ఆశలపై నీళ్లు…
రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు సమర్పించిన వారిలో నూటికి నూరు శాతం బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారే ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను ఆదుకునేందుకు ఈ పథకాన్ని డిజైన్ చేసినట్లుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పుకుంది. సీన్ కట్ చేస్తే ఏడాది దాటుతున్నప్పటికీ అతీగతీ లేకుండా పోయింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 35వేల 732 యూనిట్లు మంజూరు అయ్యాయి. ఇందుకోసం 1,03,558 మంది దరఖాస్తులు సమర్పించారు. ప్రతి యూనిట్‌కు సగటున ఐదుగురు పోటీ పడుతున్నట్లుగా అధికారులు లెక్కలు తీశారు.
జిల్లాల్లో జనాభాకు అనుగుణంగా ఆయా వర్గాలకు యూనిట్లను కేటాయించారు. మండల్లాలో సామాజిక వర్గాల వారీగా జనాభాను విభజించి తద్వారా యూనిట్లను విభజించారు. రాయితీతో కూడిన రుణాలు ఇస్తామని చెప్పడంతో యువతలో రేవంత్ రెడ్డి సర్కారు ఆశలు పెంచింది. వ్యయప్రాయాసాలకోర్చి అప్లికేషన్లు ఇచ్చిన తర్వాత పథకం అమలు అన్నదే పత్తా లేకుండా పోయింది. రాజీవ్ యువ వికాసం పథకంపై కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులంతా భారీ ఎత్తున ప్రచారం చేశారు. నిరుద్యోగ యువతకు ఆదుకునే పథకమంటూ చెప్పుకొచ్చారు. రాయితీ రుణాలు ఏవి? అని అడిగితే పాలకులు బిత్తర మొఖం వేస్తున్నారు. తమకేమీ తెలియదంటూ తప్పించుకుంటున్నారు.