హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ):‘నన్ను కోసినా అదనంగా ఒక్క రూపాయి కూడా రాదు’.. రాష్ట్ర ప్రజల అవసరాల కోసం నిధులు అడిగితే సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన సమాధానం. కానీ.. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల సొమ్ము రూ.6 కోట్లతో కేరళ రాష్ట్రంలో పత్రికా ప్రకటనలు ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త రాజకీయాలకు తెలంగాణ రాష్ట్ర ఖజానా ఏటీఎంలా మారిందని, అధికారికంగా కొంత, అనధికారికంగా మరింత సొమ్మును మళ్లిస్తున్నారనే విమర్శలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా రాష్ట్ర ప్రజల డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మొత్తంగా తెలంగాణ సొమ్ముతో కాంగ్రెస్ సోకులు పడుతున్నదంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇందుకు తాజా కేరళ ఎన్నికలనే ఉదాహరణగా చూపుతున్నారు.
కేరళలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం హడావుడి చేస్తున్నది. ప్రముఖ మలయాళ పత్రికల్లో ఫిబ్రవరి 28న ఒకసారి, మార్చి 3వ తేదీన మరోసారి తెలంగాణ ప్రభుత్వ ప్రగతి పేరుతో ప్రకటనలు ఇచ్చింది. రాష్ట్ర ఐ అండ్ పీఆర్ శాఖ ఈ ప్రకటనలను జారీ చేసింది. ఇందుకు రూ.6 కోట్ల ప్రజాధనం ఖర్చు చేసినట్టు తేలింది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఇతర సంక్షేమ కార్యక్రమాల వంటి పథకాలను ఈ ప్రకటనల్లో హైలైట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ రంగులు, బ్రాండింగ్‌తో, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు సంబంధిత శాఖ మంత్రుల ఫొటోలను ప్రముఖంగా ప్రచురించారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలతోగానీ, ఇక్కడి రాజకీయ పరిస్థితులతోగానీ కేరళ ప్రజలకు ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, మలయాళ ప్రతికల్లో రెండు పర్యాయాలు ఖరీదైన ప్రకటనలు జారీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో బఫర్ జోన్, భూదాన్ భూములు అంటూ పేదలు, మధ్య తరగతి ప్రజల ఇండ్ల మీదికి బుల్డోజర్లు పంపి కొంపలు కూల్చుతున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం, కేరళంలో మాత్రం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి నిరుపేదలను ఆదుకున్నట్టుగా పంచ రంగుల ప్రకటనలు గుప్పిస్తున్నారంటూ విశ్లేషకులు మండిపడుతున్నారు.
రాష్ట్ర ఖజానా భారంగా ఉందని చెప్తూనే, ప్రభుత్వం ఇతర రాష్ర్టాల్లో కాంగ్రెస్ ప్రచారం కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నదని బీఆర్ఎస్ ఉప నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేరళలో కాంగ్రెస్‌కు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకే తెలంగాణ ప్రజల సొమ్మును ఖర్చు చేసి కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తున్నదని అక్కడి అధికార ఎల్డీఎఫ్ నేతలు విమర్శించారు.
కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ నెల 7న ఐదు గ్యారెంటీలను ప్రకటించారు. అయితే.. రాహుల్ గాంధీ ప్రకటనకు హైప్ క్రియేట్ చేయడానికి అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ నెల 3న మలయాళ పత్రికల్లో ‘ఆరు గ్యారెంటీల’ మీద ఖరీదైన యాడ్స్ ఇచ్చిందని చెప్తున్నారు.
తెలంగాణలో ప్రతి కుటుంబానికీ ఏడాదికి రూ.70 వేల విలువైన పథకాలు అందిస్తున్నట్టు పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం గురించి, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం గురించి డబ్బా కొట్టుకున్నారు. ఆ తర్వాత ఈ నెల 7న రాహుల్‌గాంధీ కేరళలో పర్యటించారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, కాలేజీ అమ్మాయిలకు ప్రతి నెలా రూ.వెయ్యి, పెన్షన్ రూ.3 వేలకు పెంపు, ప్రతి కుటుంబానికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా, వ్యాపారం చేసుకునే యువతకు రూ.5 లక్షల వడ్డీ లేని రుణాలు అందిస్తామంటూ 5 గ్యారెంటీలను ప్రకటించారు. వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కావొస్తున్నా ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయని సంగతి తెలిసిందే.
యువతులకు స్కూటీలు, మహిళలకు ప్రతినెల రూ.2,500 వంటివి గాలిలో కలువగా, ఇప్పటివరకు ఒక్క మహిళను కూడా కోటీశ్వరురాలిని చేయలేదనే విమర్శలు ఉన్నాయి. కానీ కేరళలో ఇచ్చిన ప్రకటనల్లో మాత్రం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చే లక్ష్యం పెట్టుకున్నట్టు, మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించినట్టు పేర్కొన్నారు. తెలంగాణలో పెన్షన్ పెంపు ఊసే లేకపోయినా, కేరళంలో మాత్రం పెంచుతామని హామీ ఇచ్చారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న హడావుడిపై కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణలో ఎన్నికల హామీగా ఇచ్చిన ‘ఆరు హామీల’తో పాటు అనేక ప్రధాన వాగ్దానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. తెలంగాణ ప్రజల అవసరాలను గుర్తించడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏటీఎంగా మార్చారని ఆరోపించారు.
తెలంగాణలో వెలుగుమట్లలో పేదల ఇండ్లను కూల్చుకుంటూ, కేరళ వచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బుల్డోజర్ తరహా పాలన నడుస్తున్నదని తీవ్రంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బును కేరళలో కాంగ్రెస్ పార్టీ రాజకీయల కోసం ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. ప్రకటనల కోసం ఖర్చు చేసిన ప్రజాధనాన్ని కాంగ్రెస్ పార్టీ తిరిగి తెలంగాణ ప్రజలకు చెల్లించాలని డిమాండ్ చేశారు.