హనుమకొండ, మార్చి 9 : ఎన్పీడీసీ ఎల్లో విధులు నిర్వర్తిస్తున్న ఆర్టిజన్ కార్మికులు పోరుబాట పట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడం లేదని సర్కారుపై సమరానికి సన్నద్ధమయ్యారు. దీనిలో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ వద్ద ఉన్న ఎన్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట మహా ధర్నా నిర్వహించనున్నారు. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసిన తమను గత బీఆర్ఎస్ ప్ర భుత్వం ఆర్టిజన్ కార్మికులుగా గౌరవించి ప్రభు త్వ ఉద్యోగులతో సమానంగా అన్ని బెనిఫిట్స్ కల్పించిందని కార్మికులు తెలిపారు.
అయితే ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్‌కు వచ్చినపుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టిజన్ వ్యవస్థను రద్దు చేసి రెగ్యులర్ చేస్తామని, సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలు రెండున్నరేళ్లుగా పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఇప్పటికే అనేకసార్లు ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు, యాజమాన్యానికి వినతి పత్రా లు ఇచ్చినప్పటికీ స్పందించడం లేదని, ఈ నేపథ్యంలో మహాధర్నాకు నిర్ణయించినట్లు విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీవీఏఈ జేఏసీ) నాయకులు పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
గౌరవం కల్పించిన బీఆర్ఎస్..
స్వరాష్ట్ర సాధన అనంతరం అప్పటి సీఎం కేసీఆర్ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికుల సేవలను, వారి పరిస్థితిని గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 23,667 మంది కార్మికులకు ఆర్టిజన్లుగా గౌరవం కల్పించారు. అప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని బెనిఫిట్స్ పొందుతున్నారు. వారి కేటగిరీల వారీగా రూ. 17 వేల నుంచి రూ. 30 వేల వరకు వేతనాలు పొందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పదోన్నతులు కల్పించలేదని, ప్రతి సబ్ స్టేషన్లో నలుగురు చేయాల్సిన పనిని ఒకరిద్దరితో చేయిస్తున్నారని, ఆపరేటర్లు లేక సబ్ స్టేషన్లు మూత పడుతున్నాయని జేఏసీ నాయకులు అంటున్నారు. అలాగే ఎన్పీడీసీఎల్ పరిధిలో సుమారు 1600 మంది అన్మ్యాన్డ్ కార్మికులు పదిహేనేళ్లుగా పనిచేస్తున్నారని, వారికి ప్రమాదం జరిగినా పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డిమాండ్లు పరిష్కరించాలి
రాష్ట్రంలో పనిచేస్తున్న సుమారు 23 వేల మంది ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్సీబీ రూల్స్ వర్తింపజేయాలి. విద్యార్హతల ఆధారంగా కన్వర్షన్ చేయాలి. కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలి. 2019 బ్యాచ్ జేఎల్ఎంలకు ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తింపజేస్తూ ఎలాంటి జీవో లేకుండా ప్రమోషన్లు ఇస్తున్నారు. ఆర్టిజన్లకు మాత్రం ప్రత్యేక రూల్స్ పెట్టి వెట్టి చాకిరి చేయిస్తున్నారే తప్ప ఎలాంటి బెనిఫిట్స్ అందించడం లేదు. సంస్థలో పనిచేస్తున్న కార్మికులందరినీ రెగ్యులర్ చేసి ఒకే రూలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మా న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని వినతులు, నోటీసులిచ్చినా యాజమాన్యం, ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో 15వేల మందితో మహాధర్నా నిర్వహిస్తున్నాం. అయినప్పటికీ స్పందించని పక్షంలో సమ్మె నోటీసు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.
-ధరావత్ సికిందర్, టీవీఏఈ జేఏసీ చైర్మన్