చుంచుపల్లి, జూలై 27 : రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు సమయంలో క్వింటాకు 8 కిలోల చొప్పున తరుగు పేరుతో సుమారు రూ.71 లక్షల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్రీయ లోకల్ (టీఆర్ఎల్) ఆధ్వర్యంలో చుంచుపల్లి మండలంలోని హౌసింగ్ బోర్డ్ వద్ద గల కొత్తగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు కట్టా సతీష్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ నాయకత్వం వహించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, రైతులకు జరిగిన నష్టాన్ని వెంటనే భర్తీ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎల్ రాష్ట్ర, జిల్లా నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.