– భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్‌కు సీపీఎం వినతి
బూర్గంపహాడ్, జూలై 27 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని టేకులచెరువు గ్రామంలో 40 కుటుంబాల లబ్దిదారులకు ఇప్పటికే నిర్మించి ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను అప్పగించాలని సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు సోమవారం కలెక్టర్ అంకిత్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించారని, ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇంతవరకు లబ్దిదారులకు వాటిని అప్పగించక పోవడంతో తక్షణమే వాటిని 40 కుటుంబాల లబ్దిదారులకు అప్పగించాలని ఆ వినతిలో కోరాడు. డబుల్ బెడ్రూం ఇళ్లలో ప్రస్తుతం కరెంటు, మంచినీటి, మరుగుదొడ్ల సమస్య ఉందని ఆ సమస్యలను నెలరోజుల్లో పరిష్కరించి అలాట్ చేసిన వారికే ఇండ్లు కేటాయించాలని కోరారు. దీనికి స్పందించిన కలెక్టర్ హౌసింగ్ అధికారులతో మాట్లాడి నెల రోజుల్లో మరమ్మతు పనులు చేపట్టి 40 కుటుంబాలకు ఇండ్లను అప్పగించాలని ఆదేశించడంతో లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు పాండవుల రామనాధం, శాఖా కార్యదర్శి బోళ్ల శ్రీశైలం, జక్కుల రాంబాబు, సంపత్ పాల్గొన్నారు.