సిటీబ్యూరో: నగరంలో విద్యుత్ చౌర్యం ఎస్పీడీసీఎల్కు తలనొప్పిగా మారింది. అధికారుల నిర్లక్ష్యం, క్షేత్రస్థాయి సిబ్బంది చేతివాటం వెరసి దక్షిణ డిస్కం కోట్లరూపాయల నష్టాన్ని చవిచూస్తోంది. డిస్కంలు కొనుగోలు చేస్తున్న కరెంట్‌లో సుమారు 6-7శాతం ఎటుపోతుందో తెలియని పరిస్థితి ఉండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో మొత్తం 88,186 కనెక్షన్లలో చౌర్యం కారణంగా రూ.105.39 కోట్ల నష్టం జరిగిందని అధికారులు తెలిపారు.
ఈ ఆర్థిక సంవత్సరం 2025-26లో మొదటి అర్ధభాగంలో అంటే గత ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 46,566 కనెక్షన్లలో చోరీ జరుగగా రూ.45.34 కోట్ల నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత అర్ధ్ద సంవత్సరంలోనూ అంతకంటే ఎక్కువగానే అంటే దాదాపుగా 47,500 కనెక్షన్లలో చోరీ జరిగి రూ.48 కోట్ల నష్టం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని దీనిపై సమగ్ర నివేదిక రూపొందిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
సిటీలోనే అధికం!
హబ్సిగూడలో ఎక్కువగా 16,539 విద్యుత్ చౌర్యం కేసులు, మేడ్చల్ సర్కిల్లో 15,709, బంజారాహిల్స్‌లో 10,473, సైబర్సిటీలో 9,966 కరెంట్ చౌర్యం కేసులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. 2024-25లో మొత్తం డిస్కం పరిధిలోని అన్ని సర్కిళ్లలో 15,003 డైరెక్ట్ ట్యాపింగ్ కేసులు నమోదు కాగా.. 2025-26 లో 14వేల కేసులు నమోదైనట్లు సమాచారం. విద్యుత్ చౌర్యానికి పాల్పడటంలో బస్తీవాసుల కంటే బడాబాబులే మోజార్టీ సంఖ్యలో ఉండటం కూడా ఆశ్చర్యకరంగా ఉందని ఎస్పీడీసీఎల్కు చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పారు.