Diabetes | మండే ఎండకు.. జలాశయాలే అడుగంటుతున్నాయి, మన శరీరంలోని తేమ ఇగిరిపోవడం ఓ లెక్కా? ఆరోగ్యవంతులనూ అతలాకుతలం చేసే భానుడి ప్రతాపానికి వ్యాధిపీడితులు కకావికలం అవుతుంటారు. ముఖ్యంగా ఒంట్లో చక్కెర నిల్వలున్న మధుమేహ బాధితులకు వేసవి అనేక సమస్యలను చవిచూపిస్తుంది. నీరసాన్ని ఆవహింపజేసి శరీరాన్ని ప్రమాదపుటంచులకు చేరుస్తుంది. ఉష్ణోగ్రతలు పైపైకి వెళ్తున్న తరుణంలో డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
ఎండాకాలం… ఎంతటి ఆరోగ్యవంతులైనా సూర్యుడి తాపానికి భయపడాల్సిందే. ఇక దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇతర కాలాలతో పోలిస్తే వేసవిలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు పలు ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎండల్లో శరీరం త్వరగా నీరసించి పోవడం వల్ల రోగి మరింత బలహీనమవుతాడు. దీంతో రోగనిరోధక శక్తి తగ్గిపోయి, అప్పటికే ఉన్న వ్యాధుల ప్రభావం పెరిగిపోవడమే కాకుండా, దానివల్ల కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందంటున్నారు వైద్యులు. ముఖ్యంగా మధుమేహ బాధితులు, గుండె, అలర్జీ, కిడ్నీ, క్యాన్సర్ తదితర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వారిపై వేసవి ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
వేసవిలో ప్రధానంగా మధుమేహ రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్ రోగులకు కిడ్నీ, గుండె, కంటి సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. సాధారణంగా ఈ వ్యాధిగ్రస్తులకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో వీరికి ఎలాంటి వైరస్లైనా లేదా బ్యాక్టీరియానైనా త్వరగా సోకే అవకాశం ఉంటుంది. దీనివల్ల మధుమేహ బాధితులు త్వరగా అనారోగ్యానికి గురవుతుంటారు. ఇక ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలోని నీరు చెమట రూపంలో బయటికి వచ్చేస్తుంది. దీంతో ఒంట్లో నీటి శాతం తగ్గిపోయి రోగి డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. సాధారణ వ్యక్తులతో పోలిస్తే డయాబెటిస్ రోగులు డీహైడ్రేషన్ బారినపడే ఆస్కారం ఎక్కువ. అంతేకాకుండా వీరిలో అలసట కూడా ఎక్కువగానే ఉంటుంది. ఫలితంగా రోగి పూర్తిగా నీరసించిపోయి కిడ్నీలు, కండ్లు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంటుంది. గుండె పనితీరుపై కూడా ప్రభావం చూపవచ్చు.
సాధారణంగా రక్తంలో 3 రకాల పదార్థాలు పెరగడం వల్ల డయాబెటిస్ వస్తుంది. అవి… గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్. వీటినే సాధారణంగా చక్కెరలుగా పిలుస్తారు. ఈ పదార్థాలు మనం తినే ఆహారానికి తియ్యదనం అందిస్తాయి. మన శరీరం కొన్నిరకాల సంక్లిష్ట పిండిపదార్థాలను గ్లూకోజ్‌గా మారుస్తుంది. దీంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగడంతో ‘పాంక్రియాటిక్ బీటా’ కణాలు ఇన్సులిన్‌ను విడుదల చేస్తాయి. ఈ ఇన్సులిన్ సమక్షంలో బీటా కణాలు శక్తిని ఉత్పన్నం చేయడానికి గ్లూకోజ్‌ను వినియోగించుకుంటాయి. ఇక ఫ్రక్టోజ్ విషయానికి వస్తే ఇది పండ్లలో, తియ్యటి పానీయాలు, శీతల పానీయాల్లో లభిస్తుంది. ఫ్రక్టోజ్ వల్ల ఊబకాయం, కాలేయంలో కొవ్వు, ఇన్సులిన్ నిల్వలు పెరుగుతాయి. సుక్రోజ్ అంటే మనం వినియోగించే సాధారణ చక్కెర. ఇది చెరుకు నుంచి తయారవుతుంది. ఇందులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ రెండూ ఉంటాయి. ఈ మూడు పదార్థ్ధాలు ఒక గ్రాముకు సమాన మోతాదులో క్యాలరీలను… అంటే శక్తిని విడుదల చేస్తాయి. శరీరంలో అధికంగా శక్తి విడుదలవడంతో అది కొవ్వుగా మారి రక్తంలో పేరుకుపోతుంది. ఫలితంగా శరీరంలోని ప్రధాన భాగాలైన గుండె, కిడ్నీలతోపాటు కండరాలకు రక్తం సరఫరా సన్నగిల్లుతుంది. అంతేకాకుండా కొవ్వు పెరిగిపోవడంతో ఊబకాయం సమస్య తలెత్తుతుంది. శరీరంలో తియ్యటి పదార్థాల వల్ల అధిక శక్తి విడుదలవుతున్నందు వల్ల ఈ వ్యాధిని మధుమేహ వ్యాధిగా పరిగణిస్తారు. ఇక ఆరోగ్యవంతుడైన వ్యక్తికి చక్కెర స్థాయులు అల్పాహారానికి ముందు 110కంటే తక్కువగాను, భోజనం చేసిన రెండు గంటల్లోపు 140గా ఉండాలి.
కాబట్టి, ఎండాకాలంలో మధుమేహ రోగులు డీహైడ్రేషన్ బారినపడకుండా జాగ్రత్తపడాలి. చక్కెర పానీయాల జోలికి వెళ్లకుండా శరీరంలో తగినంత హైడ్రేషన్ ఉండేలా చూసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయులను తరచుగా పరీక్షించుకోవాలి. ఎండల్లో ఉత్తి కాళ్లతో నడవకూడదు. పాదాలకు గాయాలు కాకుండా జాగ్రత్తపడాలి. తగినన్ని డయాబెటిస్ మందులు, పరికరాలను వెంట ఉంచుకుని యాత్రలకు వెళ్లాలి. తగిన జాగ్రత్తలు తీసుకుని వ్యాయామం చేయాలి. ఈ విధమైన
రక్షణలతో డయాబెటిస్ రోగులు మండే ఎండల నుంచి రక్షణ పొందవచ్చు.