హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ ఆధ్వర్యంలో ఈనెల 8,9 తేదీల్లో మెగా మహిళా రైతు మేళా నిర్వహించనున్నట్టు వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ, కోరమాండల్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ కార్యక్రమ నిర్వహణకు సహకారాన్ని అందిస్తున్నట్టు వెల్లడించారు. సోమవారం మెగా మహిళా మేళా నిర్వహణ ఏర్పాట్లపై వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జానయ్య మాట్లాడుతూ.. వ్యవసాయంలో మహిళల కీలక పాత్రపై తొలిసారిగా మహిళా రైతు మేళాని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మహిళా రైతుల సాధికారతే లక్ష్యంగా జరుగనున్న ఈ మేళాకు సుమారు 8 నుంచి 10వేల మంది మహిళా రైతులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ మేళాకు సీఎం రేవంత్రెడ్డి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కమిషనర్ గోపి, ఉద్యానశాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా, సెర్ప్ అధికారి రజిత, వర్సిటీ పరిశోధన సంచాలకులు డాక్టర్ మరాఠి బలరాం పాల్గొన్నారు.