విద్యార్థుల ఉద్యమంతో మోదీ కుర్చీ కిందికే మంటస్తుందని భయపడినట్టు కనవడ్తాంది. నీట్ పేపర్ లీక్ మీద గొంతెత్తి రోడ్లెక్కిన విద్యార్థుల మీద ఢిల్లీ పోలీసులు చేసిన లాఠీచార్జ్ చూస్తే.. పగపట్టినట్టు పడ్డారు పాపం ఆ బొద్దింకల మీద అనిపిస్తుంది. దీనికి తోడు ఈ గ్యాప్‌ల బీజేపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా ఐటీ సెల్ పోరగాళ్లు ఆవు వ్యాసాలు మొదలుపెట్టిండ్రు చూడు. మోదీని కుర్చీ దింపడానికే కాక్రోచ్లు ప్లాన్ చేసినయని లెక్చర్లు దంచికొట్టిండ్రు. జనాలు బాగా తిరగబడేసరికి, కోపం నరనరాల్లోకి ఎక్కి రగిలిపోయేసరికి పరిస్థితి అర్థమైంది. అందుకే కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించిండ్రు. మంచి పనిచేసిండ్రు లేకపోతే ముచ్చట ఇంకోలా ఉండేది.
పోరగాళ్లు, నిరుద్యోగులు గనుక ఇంకాస్త కోపమొచ్చి ఊరురా రణరంగం చేసి ఉంటే.. కథ కేవలం విద్యాశాఖ మంత్రితో ఆగకపోయేది. ముచ్చట మరింత నాన్చితే, డిమాండ్ ’ప్రధాన్’ దాటి నేరుగా ’ప్రధాని’ రాజీనామా దాకా పోయేది! ఆ సెగ ఎంతవరకు వస్తుందో ముందే పసిగట్టి, ప్రధాన్‌ను పక్కకు జరిపి కుర్చీ కాపాడుకున్నారన్నమాట! ఏదేమైనా, బొద్దింకలను తక్కువ అంచనా వేయకండి సాబ్.. న్యాయమైన ఆందోళనలను అణచివేయాలని చూస్తే కాక్రోచ్లు కూడా లయన్లలా మారుతాయని ఇప్పటికైనా అర్థమైతే చాలు.

విద్యార్థుల ఉద్యమాన్ని హైజాక్ చేయడానికి కాంగ్రెస్ చేసిన ప్రయత్నంపై చర్చ జరుగుతున్నది. ఉద్యమం మొదలై వారాలు గడిచినా పెద్దగా సీరియస్‌గా తీసుకోని కాంగ్రెస్ పెద్దలు, ఆలస్యంగా నిద్రలేచిండ్రు. రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ రోడ్డు మీద ధర్నా చేసిండ్రు. వారి అరెస్ట్‌కు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు ధర్నాకు దిగిండ్రు. కొందరు లీడర్లు ఢిల్లీకి పయనమైండ్రు. ఇక అయిందానికి కానిదానికి కూడా స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఢిల్లీకి చక్కర్లు కొట్టే మన సీఎం రేవంత్‌రెడ్డి, ఢిల్లీకి పోకుండా కొడంగల్ దిక్కు హెలికాఫ్టర్ తిప్పిండు. సరే, అక్కడైనా కేంద్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురించి గానీ, నీట్ లీకేజీల ఘనకార్యం చేసిన బీజేపీ పెద్దల గురించి గానీ నలుగురి ముందర నాలుగు మాటలు అంటాడేమో అని చూస్తే… అక్కడా ఎప్పటిలెక్కనే కేసీఆర్, కేటీఆర్ జపం చేస్తూ పేపర్ లీకులకు వాళ్లూ బాధ్యులే! అంటూ అడ్డదిడ్డంగా ఆవు వ్యాసం దంచిపారేసిండు. అక్కడ ఢిల్లీల కోడి కూస్తే… ఇక్కడ కొడంగల్‌ల గుడ్డు పడ్డట్టు ఉన్నదని జనం నవ్వుకుంటుండ్రు. ఢిల్లీ బీజేపీకి ఎదురు తిరిగి మాట్లాడటం చేతగాక, ఇక్కడ ప్రత్యర్థుల మీద పడి ఏడుస్తుంటే నవ్వుకోరా మరి!

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడు మరో కొత్త తలనొప్పి మొదలైంది. అదేందంటే.. వాళ్ల జీతాలకెళ్లి ప్రతి నెలా 1.5% పైసలు కట్ చేసుకొని, దానికి ఈహెచ్ఎస్ అని పేరు పెట్టి, ఉద్యోగులకు ఉచిత వైద్యం ఇస్తామని సర్కారోళ్లు పెద్ద బిల్డప్ ఇసుండ్రు. కానీ తీరా లోపలికి పోయి చూస్తే అసలు సంగతి బయటపడ్డది. జబ్బు చేసి దవాఖానకు పోతే ఇచ్చే చికిత్స లిమిట్ కేవలం రూ.2 లక్షలు మాత్రమే! ఈ రోజుల్లో ఒక చిన్న ఆపరేషన్ చేయించుకోవాలన్నా రెండు లక్షలు సాల్తలేవు. ఇగ ఇప్పుడు ముచ్చట మార్చి.. ఐదు లక్షలకు పెంచుతాం అని లీకులు ఇస్తుండ్రు. ఉద్యోగులు ఏమంటున్నారంటే.. అయ్యా సీఎం సారు! మా దగ్గర కట్ చేసే 1.5%, దానికి తోడు ప్రభుత్వం కలిపే వాటా.. గివన్నీ కలిపితే బయట ప్రైవేట్ కంపెనీలళ్ల బ్రహ్మాండమైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు వస్తయి. కొర్రీల ఈహెచ్ఎస్ స్కీమ్ బదులు.. ఈ 1.5% పైసలను హెచ్ఆర్ఏ, డీఏ లాగా మా జీతంలోనే కలిపి ఈహెచ్ఎస్ అలవెన్స్ కింద తమకే ఇచ్చేస్తే.. బయట మంచి పాలసీలు తీసుకుంటాం గదా అని అడుగుతుండ్రు. కానీ ఇంత అన్యాయం జరుగుతున్నా ఉద్యోగ సంఘాల పెద్దమనుషులు మాత్రం నోట్లో బెల్లం ముక్క పెట్టుకొన్నట్టు గమ్మున కూర్చున్నారు.

కేసీఆర్ హయాంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఫ్రీగా దక్కినయి. అయితే కాంగ్రెస్ సర్కార్ ఏదో కొత్త స్కీమ్ తీసుకొస్తదట. దాని పేరు ’ఇందిరా టవర్స్’ అట! గ్రాఫిక్స్ బొమ్మలు చూపిస్తున్నరు. ఇది పేదల పాలిట ఇండ్ల పథకం కాదట, అసలైన ’కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్’ అని జనాలు మండిపడుతుండ్రు! సర్కార్ చెప్తున్న లెక్క.. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.11 లక్షలు ఖర్చవుతుందట. దాంట్ల ప్రభుత్వం రూ. 5 లక్షలు సబ్సిడీ ఇస్తుందట. ’అబ్బో! ఎంత మంచి మనసు’ అని మురిసిపోయే లోపే.. మిగతా రూ. 6 లక్షలు లబ్ధిదారుడే చెల్లించాలె అని మెలిక పెట్టిడ్రు! ’ఇంతకుముందు కేసీఆర్ ఏకంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రూపాయి తీసుకోకుండా ఉచితంగా చేతిల పెట్టిండు. ఇప్పుడు పదంతస్తులోని యాభై గజాల డబ్బా కోసం ఆరు లక్షలు కట్టుమంటే ఎక్కడికెళ్లి తెచ్చేది?’ అని గరీబోళ్లు అడుగుతున్నరు. కేసీఆర్ కట్టించిన లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో, దాదాపు 30 వేల ఇండ్లు ఇంకా పంచకుండా అట్లనే ఉన్నయి. దీంతో జనాలకి పెద్ద డౌట్ వచ్చిపడింది. కొంపదీసి ఆ పాత డబుల్ బెడ్రూమ్ ఇండ్లకే రంగులేసి ’ఇందిరమ్మ టవర్స్’ అని బోర్డు తగిలించి, మా దగ్గర రూ. 6 లక్షలు గుంజడానికి ప్లాన్ చేసిండ్రా ఏంది?’ అని చర్చలు నడుస్తున్నయ్! నిబంధనల పేరుతో గొంతు పిసికే కన్నా.. పాత పద్ధతిలోనే ఉచితంగా ఇండ్లు ఇవ్వాలని జనం కోరుతున్నరు.