ఫేస్బుక్లో తెలంగాణ సీఎంవో అనే పేజీ ఉన్నది. దానిని సుమారు 93 వేల మంది అనుసరిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొనే సభలు, ప్రసంగాల వివరాలు అందులో పోస్టు చేస్తుంటారు. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నట్టుగా అందులో వార్తలు కనిపిస్తాయి. ఆ పోస్టులపై ప్రజా స్పందన మాత్రం భిన్నంగా ఉంటున్నది. కామెంట్స్ మొత్తం ముఖ్యమంత్రిని నిలదీస్తూ, తప్పులను ప్రస్తావిస్తూ ఉంటాయి. రేవంత్‌రెడ్డిని సమర్థించే కామెంట్స్ అరుదుగా కనిపిస్తుంటాయి. ముఖ్యమంత్రి కార్యాలయం నిర్వహించే ఈ పేజీలోని జన స్పందనను అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్తారో లేదో కానీ, ఆయన వాటిని చూసైనా వాస్తవాలు తెలుసుకోవాలి.
ఈ ఏడాది వర్షాలు లేక రాష్ట్రంలో ఏర్పడే దుర్భిక్ష పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడే బాధ్యత ముఖ్యమంత్రిపై ఉన్నది. అయితే మహారాష్ట్ర నుంచి వస్తున్న వరద నీటిని ఒడిసి పట్టకుండా సముద్రంపాలు చేయడాన్ని జనం పూర్తిగా వ్యతిరేకిస్తున్న తీరు సీఎంవో పేజీలో స్పష్టంగా కనిపిస్తున్నది. మేడిగడ్డ బరాజ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎండీఎస్ఏ చెప్పేదేమీ లేదని, రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రి తేల్చిచెప్పారు. కేంద్రం నుంచి వచ్చిన ఇంజినీర్లు ప్రాజెక్టుల్లో నీళ్లు నిల్వచేయవద్దని అంటున్నారని సీఎం చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం బరాజ్లల్లో గణనీయ పరిమాణంలో నీటిని నిల్వ చేయడం, ఎత్తిపోయడం సాధ్యంకాదని ముఖ్యమంత్రి అన్నట్టుగా సీఎంవో పేజీలో ఓ పోస్టు ఉన్నది. తమకేం సంబంధం లేదని కేంద్రం చెప్పడం, సీఎం మొండితనం గురించి జనం పెద్దఎత్తున కామెంట్లతో విరుచుకుపడ్డారు. కేంద్ర పరిశీలన పేరిట బీఆర్ఎస్ను బదనాం చేయడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు.
మీరు అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటింది కదా, మేడిగడ్డ బరాజ్‌లో రెండు పిల్లర్లు మరమ్మతు ఎందుకు చేయించలేదు? ఇసుక దందా ఆగిపోతుందా?’ అని కొందరు నిలదీస్తున్నారు. మాది మేడిగడ్డనే, ఇక్కడ నీళ్లు నిండుగా ఉన్నాయి. కన్నెపెల్లి నుంచి వాటర్ లిఫ్ట్ చేయవచ్చు కదా సార్ అని ఒకరు, పార్టీలకు అతీతంగా పిల్లర్లు రిపేర్ చేయ్. అట్లయినా నీ పేరు నిలబడుతుంది.
సరే.. నువ్వు చెప్పేది నిజమే అనుకుందాం, రిపేర్ చేసి మళ్లీ ఓపెనింగ్ చేయ్ అన్నారొకరు. కేసీఆర్ మూడున్నరేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే, మీరు వచ్చి మూడేండ్లు అవుతున్నా మూడు పిల్లర్లు రిపేర్ కూడా చేయకపోతిరి. ఇది మీ చేతకానితనానికి నిదర్శనం. నీళ్లు నిల్వ చేయడం, ఎత్తిపోయడం సంగతి పక్కన పెడితే.. కనీసం రిపేర్ చేయొచ్చు కదా, రిపేర్ చేయొద్దని ఎవరు చెప్పారు? ఈ చిన్న విషయం ఎందుకు మర్చిపోతున్నారు అని అడుగుతున్నారు.
అరె బాబూ.. మీ వల్ల కాదు.. మీకు శాతగాదు.. నీళ్లు ఎత్తిపోయుండ్రి అంటే, ఈ సోది ఎందుకు? 92 మీటర్లు ఉంటే పంపులు ఆన్ చేయొచ్చు.. 97 మీటర్ల ఫ్లో ఉన్నది.. మీ డ్రామాలు అన్నీ రైతులకు తెలుసు అనే ఆగ్రహం ఒకరిది. వరద జలాల గురించి పక్కనున్న మంత్రులకు అవగాహన లేదు, నీకు అవగాహన లేదు. మాటలు మాట్లాడడం ఒకటి నేర్చుకున్నావ్. రైతులకు నీటి కొరత సమస్య ఉన్నది. దాని గురించి ఏం చేస్తావో చెయ్యి అని ఒక కామెంట్. బీఆర్ఎస్ వాళ్లకు వారం రోజులు అవకాశమిస్తే నీళ్లు ఎలా వాడాలో చెప్తారు, వాళ్లకు అవకాశం ఇవ్వండి అని ఒకరి అభ్యర్థన. తెలంగాణలో వర్షాలు లేవు, మహారాష్ట్ర, కర్నాటకలో వర్షాలు కురుస్తున్నాయి. గోదావరిలో వరద వస్తున్నది. వరదను ఒడిసిపట్టి, ఎత్తిపోసి తెలంగాణ ప్రజలకు అందించితే అయిపాయే. ఇన్ని మాటలు ఎందుకు, ఒక్కసారి మోటర్లు ఆన్ చేసి చూడండి. మీకే తెలుస్తది. అవి నడుస్తయా లేదో అంటూ ఓ యువకుడి సూచన. కేసీఆర్ మీద కోపంతో నువ్వు తెలంగాణను ఎండబెడుతున్నావు. ఇది పైశాచిక ఆనందమే అని తెలంగాణ ప్రజలకు ఎప్పుడో అర్థం అయిపోయింది అని మరికొందరి ఆవేదన.
మేడిగడ్డ రిపేర్ చేయించొచ్చు.. మనసుంటే మార్గం ఉంటది… అంతేకానీ ఊర్లకూర్లు కొట్టుకపోతయని జనాలను భయపెట్టుడు, పంచాయితీ పెట్టుడు ఎందుకు? ఇంజినీర్లను చర్లపల్లి జైళ్ల ఏసేడిదుండే… అని గిప్పుడంటున్నవ్ గిన్నేండ్లలో గివేవీ వీలుకాలేదా మీకు? కరువును ఎల్ నినో మీదకు నూకుతున్నవ్, నీ రాజకీయ కక్షలతో రైతులను పొడుస్తున్నవ్ అని ఒకరి ఆవేదన. ఈ ఒక్కో కామెంట్ ఒక గుండె చప్పుడు. వారి మాటల్లో వేదనలు, రోదనలు ఉన్నాయి. తమకు తెలిసిన విధంగా నీళ్లను కాపాడే, ఎల్ నినోను ఎదుర్కొనే మార్గాలు చెప్తున్నారు. తెలంగాణ సీఎంవో పేజీ వేదికగా తెలంగాణ బిడ్డలు చెప్తున్న సూచనలు ప్రభుత్వం స్వీకరించాలి. లేకపోతే ప్రజలు పోరుబాట పట్టకతప్పదు, ఇప్పటికైనా ప్రభుత్వానికి వరద నీళ్లను వాడుకోవాలనే ఆలోచన వస్తే మంచిది.
– బద్రి నర్సన్