తెలుగు సాహిత్యంలో కొన్ని పుస్తకాలు కాలంతో పాటు పాతబడిపోతాయి. మరికొన్ని కాలాన్ని దాటి సమాజాన్ని ప్రశ్నిస్తాయి. ‘వెంటాడే కలాలు వెనుకబడిన కులాలు’ రెండో కోవకు చెందిన సంకలనం. అది కేవలం కవితల పుస్తకం కాదు. ఒక సమాజం తన గురించి తానే ప్రశ్నిస్తూ మాట్లాడుకోవడం ప్రారంభించిన చారిత్రక దశకు ప్రతిరూపం. 2001లో జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువడిన ‘వెంటాడే కలాలువెనుకబడిన కులాలు’ ఈ సంకలనాన్ని బీసీ అస్తిత్వ సాహిత్య చర్చలో ఒక మైలురాయిగా గుర్తించారు. ఈ సంకలనం బీసీ వాద కవిత్వానికి ముఖ్యమైన మలుపుగా సాహిత్య పరిశోధకులు పేర్కొన్నారు.
ఇతరుల దృష్టి నుంచి స్వీయ అనుభవం వరకు అస్తిత్వ సాహిత్య ఉద్యమాల ముఖ్యమైన ప్రశ్న ‘మా గురించి మేం ఎందుకు రాయకూడదు?’. బీసీ సమాజం గురించి బయటి దృష్టితో రాసిన రచనల్లో వారి వృత్తులు, పేదరికం, గ్రామీణ జీవితం కనిపించవచ్చు. కానీ ఒక సమాజపు శ్రమను, అవమానాన్ని, ఆకాంక్షను, ఆత్మగౌరవాన్ని తన స్వీయ అనుభవం నుంచి పలికించినప్పుడు ఆ స్వరానికి వేరే రాజకీయ అర్థం వస్తుంది. ‘వెంటాడే కలాలు’ ఆ స్వీయ అనుభవానికి వేదికగా మారింది.
1990లో తెలుగు సాహిత్యంలో అస్తిత్వ ఉద్యమాలు బలపడుతున్న సమయంలో ‘చిక్కనవుతున్న పాట’ (1995), ‘బహువచనం’ (1996) వంటి సంకలనాలు వెలువడ్డాయి. ఆ సాహిత్య స్ఫూర్తితోనే 2001లో ‘వెంటాడే కలాలువెనుకబడిన కులాలు’ బీసీ అస్తిత్వాన్ని మరింత ప్రత్యేకమైన సామాజికసాహిత్య దృక్పథంతో అడుగులు ముందుకు వేసింది. అందుకే దీనిని బీసీ అస్తిత్వ సాహిత్యానికి ఒక కీలక మలుపుగా గుర్తించటం సముచితం.
శ్రమ కనిపిస్తుంది. శ్రామికుడు ఎందుకు కనిపించడు? భారతీయ సమాజ నిర్మాణంలో ఉత్పత్తి శ్రమకు బీసీ వృత్తి సమూహాల పాత్ర విశిష్టమైనది. మట్టిని మలిచిన కుమ్మరి నుంచి ఇనుమును కరిగించిన కమ్మరి వరకు, మగ్గంపై వస్ర్తాన్ని నేసిన నేతన్న నుంచి పశుపోషణతో జీవన వ్యవస్థను నడిపిన గొల్లకురుమల వరకు, తాటిచెట్టుతో జీవనాన్ని ముడిపెట్టుకున్న గౌడ నుంచి చెరువుసముద్రాలపై ఆధారపడి బతికిన మత్స్యకారుడి వరకు, చౌడు సున్నాల తెలుపు నుంచి యవ్వనప్రాయపు సొగసులను అందంగా తీర్చిదిద్దే రజక, క్షురకర్మలు.
శ్రామిక శ్రమ భారతీయ సమాజంతో ముడిపడి ఉంటుంది. కానీ చరిత్ర రాసినప్పుడు శ్రమ కనిపించినంతగా శ్రామికుడు కనిపించలేదు. అదే ‘వెంటాడే కలాలు’లోని అంతర్లీన ప్రశ్న. ఉత్పత్తి చేసిన చేతులకు గౌరవం ఎందుకు తక్కువ? ఉత్పత్తిపై ఆధారపడిన సమాజంలో ఉత్పత్తిదారుడికి అధికారంలో వాటా ఎందుకు తక్కువ? వృత్తి సమూహాలు నిర్మించిన సంస్కృతికి చరిత్రలో సముచిత స్థానం ఎందుకు లేదు? ఇవి కేవలం కవితలోని ప్రశ్నలు కావు. సామాజిక నిర్మాణాన్ని ప్రశ్నించే ధిక్కార స్వరాలు. ఈ సంకలనంలో వెనుకబడిన కులాల జీవిత అనుభవాలు అనేక స్వరాలుగా పలికాయి. 23 మంది కవులు-73 కవితలతో వచ్చిన సంకలనంగా తెలుగు సాహిత్యంలో చరిత్ర సృష్టించింది.
ఇందులోని కవులు; అంబటి వెంకన్న-‘వల ఏరియ్యక ముందే’. అనిశెట్టి రజిత-‘దొర్సానీ ఓ దొర్సానీ’, ఏ.దుర్గాప్రసాద్ -‘దేవదాసీ’, బెల్లి యాదయ్య-‘నేను గొర్రెలు కాస్తుంటాను’, బాణాల శ్రీనివాస్ రావు-‘కుంపటి’, దెంచనాల శ్రీనివాస్-‘పురుషుని గుండె లేదా మగ మాదిగ, జి.విజయలక్ష్మి-‘పొదిలో కత్తి’, జుగాష్ విలి-‘కొన్ని వాక్యాలు’, జూలూరు గౌరీశంకర్-‘కొలిమి’, జూపల్లి ప్రేమ్చంద్-‘నిచ్చెన మెట్ల లోలకం’, కో.ప్ర.-‘ఊరు మా ఉనికి మింగేసింది’, ఎం.వెంకట్-‘వెనుకబడ్డ కల’, మందారపు హైమావతి-‘జ్యూయలరీ షాప్’, డాక్టర్ ఎన్.గోపి-‘రాజయ్య కథ’, ‘బొంత’, నాళేశ్వరం శంకరం-‘శవం ముందు శంఖం’, డాక్టర్ ననుమాస స్వామి-‘నీలిబాల్యం’, పులిపాటి గురుస్వామి-‘అయ్యా మల్లెప్పుడొస్తవే’, ప్రసాదమూర్తి-‘తాతకో నూలుపోగు’, ప్రసేన్-‘కన్నీటి నది దోచుకెళ్లిన నావ నా పద్యం’, సీతారాం- ‘రెజ్యూమ్’, ఓట్లు ఓట్లో నాయీ బ్రాహ్మ ఓట్లోయ్’, డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ-‘మొద్దు మీద కత్తి’, సిద్దార్థ బొమ్మగాని-‘సంగెం’, ‘జిల్లెడుపొద’.
‘వెంటాడే కలాలు’ వృత్తి అంటే వెనుకబాటుతనం కాదు. శతాబ్దాలుగా చేతివృత్తులను తక్కువగా చూసే
సామాజిక దృష్టి ఒక పెద్ద చారిత్రక వైరుధ్యాన్ని సృష్టించింది. శ్రమ అవసరం. శ్రామికుడు అవసరం. అతని ఉత్పత్తి అవసరం.
కానీ అతని సామాజిక గౌరవం మాత్రం అనవసరమన్నట్టుగా వ్యవస్థ వ్యవహరించింది. ‘వెంటాడే కలాలు’ ఈ వైరుధ్యాన్ని కవిత్వ ధిక్కారంతో ఎదురేగింది. వృత్తిని అవమానంగా చూసే దృష్టికి ఎదురు నిలిచి, వృత్తిని జీవన జ్ఞానంగా ప్రతిష్టించింది.
ఇది బీసీ అస్తిత్వ సాహిత్యంలో సమాలోచనలో మార్పు. అస్తిత్వం అంటే విభజన కాదు బీసీ అస్తిత్వాన్ని కులాల మధ్య గోడలు కట్టే భావజాలంగా అర్థం చేసుకోవడం సరికాదు. అస్తిత్వం అంటే-తన ఉనికిని గుర్తించడం, తన చరిత్రను తిరిగి రాసుకోవడం, తన శ్రమకు విలువ కోరడం, తన సంస్కృతికి గౌరవం పెంపొందించుకోవడం. తన జనాభాకు తగిన ప్రాతినిధ్యాన్ని ప్రశ్నించుకోవడం. తన ఉనికిని గుర్తించుకోవడం విభజన కాదు; అసమానతను గుర్తించే తొలి అడుగు. వేర్వేరు వృత్తి, కులాలుగా ఉన్న బీసీ సమాజంలో ఉమ్మడి సమస్యలను గుర్తించి సామాజిక న్యాయ దృక్పథంతో సంఘటిత చైతన్యాన్ని నిర్మించడంలో ఈ సాహిత్యం తన పాత్ర పోషించింది.
‘వెంటాడే కలాలు’ గురించి మాట్లాడేటప్పుడు జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వాన్ని ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కవితలను ఏరి పుస్తకం చేయడం మాత్రమే కాదు. విడివిడిగా ఉన్న అనుభవాల మధ్య ఒక అంతర్లీన సంబంధ రేఖల్ని గుర్తించి వాటిని ఒక ఆలోచనల మెలికలతో వేదికపైకి తీసుకురావడం కూడా సంపాదకత్వమే. ఆ పని జూలూరు గౌరీశంశర్ చేశారు.
తానే స్వయంగా తానే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో 2001లో ‘వెంటాడే కలాలువెనుకబడిన కులాలు’ కవితా సంకలనం ఒక చారిత్రక నేపథ్యంలో వచ్చింది. కవుల వ్యక్తిగత అనుభూతుల సమాహారం కాదు. విభిన్న వృత్తి సమూహాల అనుభవాలను ఒక సామూహిక, సామాజిక ప్రశ్నగా మలిచే ప్రయత్నం. చెమట మట్టి కలగలిసిన ఈ కవిత్వానికి మరో బలం పురుడుపోసుకున్న భాష. జీవితం మాట్లాడిన అనుభవాల తలపోత. గ్రామీణ యాస, వృత్తి పదజాలం, పనిముట్ల పేర్లు, స్థానిక జీవన అనుభవాలు, నిత్య శ్రమజీవుల భాషలో కవిత్వమై కలగలిసిపోయాయి.
మగ్గం సవ్వడి, కుంపటి మంట, కొలిమి పొగ, చెరువు అలలు కవితలయ్యాయి. వృత్తి పనిముట్లు అస్తిత్వ చిహ్నాలుగా మారాయి. ఇది పుస్తక భాష కాదు-జీవన బతుకు భాష. అందుకే ఆ కవిత్వం చదివినప్పుడు
ఒక వృత్తిని మాత్రమే కాదు, ఒక జీవన లోకాన్ని చూడగలుగుతాం. పాతికేండ్ల తర్వాత కూడా ఎందుకు వెంటాడుతున్నది?
కాలంతోపాటు ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, గ్రామీణ జీవితంతో పెనవేసుకున్నది. కానీ సంప్రదాయ వృత్తులపై ఆధారపడిన సమూహాల సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ‘వెంటాడే కలాలు’ నేడు కేవలం జ్ఞాపక గ్రంథం కాదు. పాతికేండ్ల క్రితం రాసిన సమూహ అక్షరాలు నేటి సమాజాన్ని తిరిగి ప్రశ్నిస్తున్నాయి. రజతోత్సవం అంటే పాత పుస్తకాన్ని స్మరించుకోవడం మాత్రమే కాదు.
ఆ పుస్తకం పుట్టడానికి కారణమైన సామాజిక పరిస్థితులను పరిశీలించాలి. నాటి ప్రశ్నల్లో ఏవి పరిష్కారమయ్యాయి? ఏవి మరింత తీవ్రమయ్యాయి? ఏ కొత్త సమస్యలు బీసీ సమాజం ముందుకొచ్చాయన్న విషయాలపై విస్తృత చర్చ జరుగాలి. బీసీ సాహిత్యం కేవలం బాధను నమోదు చేసే సాహిత్యంగా మిగిలిపోకూడదు. కొత్త తరాల అ నుభవాలు సాహిత్యంలోకి రా వాలి. ‘వెంటాడే కలాలు’ వేసిన బాటలో మరిన్ని కలాలు పదునెక్కాలి. బీసీ అస్తిత్వం అక్షరాల్లోనే కాదు-అవకాశాల్లో, అధికారంలో, సంస్కృతిలో, చరిత్రలో తన సముచిత స్థానాన్ని సాధించే వరకు ఈ సాహిత్య ప్రయాణం కొనసాగాలి.
– వనపట్ల సుబ్బయ్య 9492765358