సంగీత సాహిత్య సవ్యసాచి ఆయన హరికథా గానం చేసి అందరినీ మెప్పించాడు. ఆశువుగా అందమైన పద్యాలల్లి సభికుల్ని పరవశింపజేశాడు. శ్రావ్యమైన కంఠస్వరంతో కావ్యగానం చేసి సభను రంజింపజేశాడు. ప్రత్యేకమైన బోధనాపటిమతో పాఠాలు చెప్పి విద్యార్థుల్ని అలరించాడు. కవిగా, రచయితగా, గాయకుడిగా, హరికథకుడిగా, నటుడిగా విశేషమైన సేవలందించి అశేష ప్రజానీకం హృదయంలో చోటు సంపాదించుకున్న ఆ మహానుభావుడే డి.వి. మురళీమోహనాచార్యులు.
ఆయన పూర్తి పేరు దప్పూరి వేంకట మురళీ మోహనాచార్యులు. జగిత్యాల జిల్లా పొలాస గ్రామంలో వెంకటాచార్యులు, వెంకటలక్ష్మి దంపతులకు 1941 జూలై 3న జన్మించారు. తండ్రి కర్ణాటక సంగీతంలో గొప్ప విద్వాంసులు. సంగీత, సాహిత్యాలను తండ్రి నుంచి వారసత్వంగా స్వీకరించారు మురళీమోహనాచార్యులు. రామాయణ,భారత, భాగవతాలను, కావ్య, వ్యాకరణ,అలంకార శాస్ర్తాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఆయనది మధుర గంభీరమైన కంఠస్వరం. ఆయన హరికథా గానం చేస్తుంటే అందరూ మంత్రముగ్ధులయ్యేవారు. పద్యాలు, గేయాలు, పాటలు, కీర్తనలు, దండకాలు, మంగళహారతులు, హరికథలు, నాటకాలు, నాటికలు, ప్రహసనాలు, ఏకపాత్రలు రాసి తెలుగు సరస్వతిని అలంకరించారు. శ్రీకృష్ణుడు, అర్జునుడు, హరిశ్చంద్రుడు వంటి పాత్రలను ధరించి అద్భుతమైన నటనతో రంగస్థలాన్ని ఉర్రూతలూగించారు.ఎన్నో సంగీత కచేరీలు కూడా చేశారు మురళీమోహనాచార్యులు.
జలగలు, అయ్యప్ప పూజా విధానం, కవన కల్హారం, శ్రీ వినాయక మహాత్మ్యం, ధర్మపురి నరసింహ శతకం, విద్వన్నుతి, చిరుజల్లులు, సంక్షేమం, మురళీ రవళులు, సరిగమలు, ద్రౌపదీ స్వయంవరం, సీతారామ కళ్యాణం, సత్యానందీయం, శ్యమంతక మణి, విష్ణు మాయావిలాసం, ఉత్తరుడు, కోయదొర మొదలైన 40కి పైగా పుస్తకాలు రచించారు.
వేదనలను బో ద్రోచెడి
నీ దయ వర్ణింపతరమె నిర్జర నాథా!
నాదిక్కు నీవటంచును
మోదమునన్ దలతు
ధర్మపురి నరసింహా!’
వంటి అద్భుతమైన ఎన్నో పద్యాలు నరసింహ శతకం ద్వారా ఆయన మనకందించారు. తేటతేట మాటలతో రాయబడిన ఈ పద్యాలు ఇప్పటికీ ప్రజల నాలుకలపై నాట్యమాడుతూనే ఉన్నాయి. తెలుగులో బీ.ఓ.ఎల్., ఎం.ఏ. పట్టభద్రులైన వీరు తెలుగు భాషోపాధ్యాయులుగా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు. అంతేకాకుండా మరెంతో మంది విద్యార్థుల్ని కవులుగా, గాయకులుగా తయారు చేశారు. పుట్టి పెరిగింది పొలాస గ్రామం అయినప్పటికీ ఉద్యోగరీత్యా అనేక చోట్ల పనిచేస్తూ చివరకు మెట్పల్లిలో స్థిరపడ్డారు. మెట్పల్లిలో జాతీయ సాహిత్య పరిషత్ అనే సాహిత్య సంస్థను ఏర్పాటు చేసి, దానికి అధ్యక్షులుగా ఉండి అనేక సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఎంతోమంది కవులకు, కళాకారులకు మార్గదర్శకులయ్యారు. లలిత కళా సమితి కార్యదర్శిగా, కరీంనగర్ జిల్లా అధికార భాషా సంఘం సభ్యులుగా కూడా పదవీ బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వర్తించారు.
‘శ్రీమన్మహా సిద్ధి విఘ్నేశ్వరా!
దేవ దేవేశ్వరా! లోక రక్షాకరా!
భక్త మందార! లంబోదరా!
దేవ! దేవాది దేవా! మహాదేవ!
దివ్య ప్రభావా! భవ్య స్వరూప!
ప్రకాశోజ్వలానంద రూపా! విరూపా!
హే పార్వతీ పుత్ర! లోకత్రయ స్తోత్ర!
శ్రీ సచ్చరిత్రా!
నమస్తే! నమస్తే!
నమస్తే! నమః‘
అంటూ వినాయకునిపై ఆయన రాసిన దండకం మహాకవులు రాసిన దండకాల సరసన నిలుస్తుందనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. డా.సి.నారాయణరెడ్డి, దివాకర్ల వేంకటవధాని, దేవులపల్లి రామానుజరావు, జీ.వీ.సుబ్రహ్మణ్యం వంటి మహానుభావులతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. వారితో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా ఎన్నో సుదీర్ఘమైన సాహిత్య చర్చలు కూడా చేసేవారు మురళీమోహనాచార్యులు.
‘నీ నామమె భవతరణము
నీ నామమె ఔషధమ్ము నిఖిల రుజలకున్…’
‘రాజ్యాధికారులకు నిల
భోజ్యంబై పోవ పుడమి బ్రోవగలేవా…’
‘నాడు గజేంద్రుని గాచిన
వాడవు గద భక్తతతికి వరమిడలేవా…’
‘మండూక వనమునందున
దండిగ కోపంబు
బూని దనుజుండంతన్…’
ఇలాంటి కమ్మని పద్యాలెన్నో ఆయన కలం నుండి జాలువారాయి.
మురళీ మోహనాచార్యులు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుంచి అనేక సాహిత్య ప్రసంగాలు చేశారు. ఢిల్లీ సాంస్కృతికోత్సవాలలో హరికథా గానం చేసి పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. భద్రాచలం, వేములవాడ వంటి పుణ్యక్షేత్రాలలోనే కాకుండా పోచంపాడు, బొంబాయి, భివండీ, పూనా వంటి ప్రాంతాల్లో కూడా తరచుగా హరికథా గానం చేసి అక్కడి ప్రజల మన్ననలు పొందారు.
నటసమ్రాట్, నటశ్రీ, కవికోకిల, గాన కోకిల, అభినవ గంధర్వ, గాన కళా కోవిద, హరికథా కేసరి వంటి బిరుదులు, రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, కళాలహరి పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వ్యవహారాల శాఖ సంయుక్తంగా ఇచ్చిన ఉత్తమ నట పురస్కారం, స్రవంతి పురస్కారం, ఘంటసాల పురస్కారం, మనోరంజని విశిష్ట పురస్కారం, రోటరీ ఇంటర్నేషనల్ పురస్కారం వంటి పురస్కారాలు, బిరుదులు ఇంకా ఎన్నో సాహిత్య సంస్థలతో గౌరవ సత్కారాలు అందుకున్న డి.వి.మురళీమోహనాచార్యులు 2003 ఫిబ్రవరి 16న పరమపదించారు.
– తిరునగరి శ్రీనివాసస్వామి 9440369939