‘ఈ కథ విన్నప్పుడే ఇందులోని నా పాత్ర తాలూకు లోతేంటో అర్థమైంది. దర్శకుడిగా మహేశ్‌చంద్ర ఏంటో ఈ సినిమా చెబుతుంది. ప్రతి ఒక్కరికీ కనెక్టయ్యే కంటెంట్ ఇది. ఇది అందరి ఇండ్లలో జరిగే కథ. ఎమోషన్స్‌తో పాటు ఈ జనరేషన్‌కి కావాల్సిన మసాలాలు కూడా ఈ సినిమాలో ఉంటాయి’ అని డా.రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆయన ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’. పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, శ్రీలు, ప్రత్యూష, రెహానా కీలక పాత్రధారులు. మహేశ్‌చంద్ర దర్శకుడు. దుండిగళ్ల బాలకృష్ణ, ఆకుల సురేశ్ పటేల్, ఎఫ్ఎం మురళి నిర్మాతలు.
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ నెల 18న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. మనసుతోపాటు ప్రాణం పెట్టి చేసిన సినిమా ఇదని, సినిమా అద్భుతంగా వచ్చిందని, నటీనటులంతా తమ పాత్రల్లో జీవించారని, తాను చేసిన సినిమాలన్నింటిలో ‘పిఠాపురంలో.. అలామొదలైంది’ సినిమా ప్రత్యేకంగా ఉంటుందని దర్శకుడు మహేశ్‌చంద్ర చెప్పారు. ఇంకా చిత్రబృందంతోపాటు సుమన్, చదలవాడ శ్రీనివాసరావు, టి.ప్రసన్నకుమార్, అనంతగిరి, దర్శకులు సముద్ర, వీరశంకర్, ప్రైమ్ షో చైతన్యరెడ్డి, బీవీఎస్ రవి కూడా మాట్లాడారు.