రాజన్న సిరిసిల్ల, జూలై 25 (నమస్తే తెలంగాణ): నీట్ ప్రశ్నాపత్రం లీకులకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నామని, యువత, నీట్ విద్యార్థుల పోరాటానికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గిందని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొద్ది రోజులుగా యువత, నీట్ విద్యార్థుల ఆందోళనతో పాటు జంతర్‌మంతర్‌లో జరిగిన దాడులను యావత్ దేశం తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందేనన్నారు. యువతకు మద్దతుగా కేటీఆర్ మాట్లాడడం, ధర్నా చేయడం గిట్టని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆయనపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.
కులం, మతం పేరు చెప్పి ఓట్లు దండుకున్న బీజేపీకి యువత తమ పోరాట రుచిని చూపించారన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన సొంత నియోజకవర్గమైన కరీంనగర్లో వరుసగా భారీ చోరీలు, కొడుకు కేసుతో ఏం చేయాలో తోచక కేటీఆర్‌పై అనుచిత వాఖ్యలు, విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రి తన కొడుకు కేసుతోపాటు కరీంనగర్లో జరిగిన వరుస చోరీలకు నైతిక బాధ్యత వహించి, తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు, యువత తిరగబడడం ఖాయమన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, నాయకులు న్యాలకొండ రాఘవరెడ్డి, గుండ్లపల్లి పూర్ణచందర్, కుంబాల మల్లారెడ్డి, గెంట్యాల శ్రీనివాస్, మ్యాన రవి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.