హనుమకొండ, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులు మార్కుల కోసం లక్షల రూపాయలను ప్రొఫెసర్లకు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొన్నది. వైద్య కళాశాలలో ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ డిపార్ట్మెంట్లో పైసలు ఇస్తేనే మార్కులు వేస్తామన్న దానిపై విద్యార్థులు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ ఆదేశాలతో ఈ అంశంపై ఇప్పుడు త్రిసభ్య కమిటీ విచారణ నిర్వహిస్తున్నది.
మెడికల్ పీజీ కోర్సు పరీక్షల వాల్యూయేషన్‌లోనూ మార్కుల కోసం లక్షల రూపాయలు డిమాండ్ చేయడంతో రాష్ట్రంలోని వైద్య విద్య నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాకతీయ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ విభాగంలోని ఇటీవల నిర్వహించిన పరీక్షల వ్యాల్యూయేషన్ ప్రక్రియలో ఓ ప్రొఫెసర్ మార్కుల దందాను మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. విద్యార్థులు రూ.2 లక్షల చొప్పున ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని పీజీ విద్యార్థులపై ప్రొఫెసర్ ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై విద్యార్థులు ఈ నెల మొదటి వారంలోనే మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.
థీసెస్ రికార్డులపై సంతకాలు చేసేందుకు ఒక్కో విద్యార్థి రూ.30 వేల చొప్పున చెల్లించాలని ప్రొఫెసర్ ఆదేశించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. సెప్టెంబర్ 11, 12న జరుగాల్సిన ప్రాక్టికల్స్‌ను వరంగల్‌లో నిర్వహించేందుకు ఒక్కో విద్యార్థి మరో రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రాక్టికల్స్‌లో పాస్ కావాలంటే ప్రతి విద్యార్థి రూ.2 లక్షల చొప్పున ఇవ్వాలని తేల్చినట్టు పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై కాలేజీ ప్రిన్సిపల్ మోహన్‌దాస్ విచారణకు ఆదేశించారు. ఎంజీఎం సూపరింటెండెంట్, పీడియాట్రిక్ హెడ్, హనుమకొండ ప్రభుత్వ మెటర్నిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్‌తో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించినట్టు తెలిసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని డిపార్ట్మెంట్ హెడ్‌పై చర్యలు తీసుకునే అధికారం వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శికి మాత్రమే ఉంటుందని సమాచారం.
కాకతీయ మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ ప్రొఫెసర్‌పై అందిన ఫిర్యాదుపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశాం. విచారణ కమిటీ అందజేసిన నివేదికను ప్రభుత్వ ఉన్నతాధికారులకు అందజేశాం. ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
– డాక్టర్ దివ్వెల మోహన్‌దాస్, కేఎంసీ ప్రిన్సిపల్