న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి మూడు నెలల గడువును నిర్దేశించిన ఉత్తర్వుల గురించి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్‌కు పూర్తి అవగాహన ఉందని భావిస్తున్నామని సుప్రీంకోర్టు సోమవారం పేర్కొంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) వర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే సోహన్దేబ్ ఛటోపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, వీ మోహనలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించారన్న కారణంతో తిరుగుబాటు వర్గానికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటును కోరుతూ ఛటోపాధ్యాయ జూలై 7న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ రథిన్ బోస్‌ను ఆశ్రయించారు.
ఈ న్యాయస్థానం నిర్ణయంపై స్పీకర్‌కు పూర్తి అవగాహన ఉందని, నిర్ణీత గడువులోగా తగిన నిర్ణయం తీసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తారని నమ్మడానికి మాకు బలమైన కారణాలు ఉన్నాయి అని ధర్మాసనం పేర్కొంది. అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడానికి అప్పటి మణిపూర్ అసెంబ్లీ స్పీకర్‌కు మూడు నెలల గడువు విధిస్తూ 2020 జనవరిలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల గురించి ధర్మాసనం ప్రస్తావించింది. ఈ కేసులో మూడు నెలల గడువు అక్టోబర్ 10న ముగుస్తుంది అని పిటిషన్‌ను ముగించేముందు ధర్మాసనం పేర్కొంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని వర్గం దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కోరుతూ తిరుగుబాటు టీఎంసీ వర్గానికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలకు బెంగాల్ అసెంబ్లీ సచివాలయం నోటీసులు జారీచేసిన కొన్ని రోజులకే సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లోని రెండు ప్రత్యర్థి వర్గాల మధ్య పార్టీ పేరు, దాని ‘పువ్వులు, గడ్డి’ గుర్తు మధ్య నెలకొన్న వివాదాన్ని వాదనలు విన్న తర్వాత మూడు నెలల్లోగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు సోమవారం భారత ఎన్నికల సంఘాన్ని(ఈసీ) ఆదేశించింది. నాలుగు వారాల్లోగా ఎన్నికల సంఘం ముందు తమ వాదనలను వినిపించడం పూర్తి చేయాలని రెండు ప్రత్యర్థి వర్గాలను సీజేఐతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
వైద్యులపై జరిగే దాడులను సహంచబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని థాణె జిల్లాలోని మున్సిపల్ దవాఖానలో వైద్యులపై దాడి కేసులో శివసేన కార్పొరేటర్ రమేశ్ మాత్రేకు బాంబే హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సుప్రీంకోర్టు సోమవారం రద్దు చేసింది. మూడు రోజుల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. ప్రజలకు సేవ చేసే వైద్యులపై దాడులు చేయడం సరికాదు అని కోర్టు వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై విచారించిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. జూలై 6న శాస్త్రినగర్ దవాఖానలో ఈ ఘటన జరిగింది. ఒక గర్భిణికి చికిత్స ఆలస్యమైందంటూ కుటుంబ సభ్యులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అనంతరం వారు వైద్యులపై దాడి చేశారు.