పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు సుస్తీ చేసింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తున్నది. దవాఖానాల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉండడంతో పేదలకు మెరుగైన వైద్యం అందని ద్రాక్షగానే మారుతున్నది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని గ్రామీణ ప్రాంత ప్రజానీకం కోరుతున్నది.
పెద్దపల్లి, జూలై 25(నమస్తే తెలంగాణ) : పెద్దపల్లి జిల్లా పరిధిలోని 13 రూరల్, ఒక అర్బన్ మండలంలో కలిపి మొత్తం 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇందులో కమాన్‌పూర్, ధర్మారం, మేడారం, కొలనూర్, ముత్తారం, శ్రీరాంపూర్ దవాఖానలు మాత్రమే 24 గంటల పాటు నడుస్తాయి. అయితే, ఈ దవాఖానల్లో వైద్యాధికారులు, సిబ్బంది కొరత ఉన్నది. గర్రెపల్లి, రామగుండం దవాఖానల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండగా.. బసంత్‌నగర్ డాక్టర్‌ను గర్రెపల్లికి ఇన్‌చార్జ్జిగా నియమించారు. రామగుండం పీహెచ్సీలో డాక్టర్ పోస్టు ఖాళీగానే ఉన్నది. జిల్లాలో మొత్తం 43 మంది స్టాఫ్‌నర్స్‌లకు గానూ 23 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తుండగా. ఇంకా 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాదాపు రెండేళ్ల నుంచి ఎన్హెచ్ఎం పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఇబ్బందికరంగా మారింది. జిల్లాలో మొత్తం 104 మొదటి ఏఎన్ఎంలకు 36,
104 రెండో ఏఎన్ఎం పోస్టులకు 40 వరకు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో మూడు చోట్ల ఫార్మసిస్ట్ పోస్టులు భర్తీ చేయడం లేదు. ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్టులు సైతం చాలా చోట్ల ఖాళీగానే ఉన్నాయి. 24గ ంటల పాటు వైద్య సేవలందించే ఐదు దవాఖానాల్లో ఎంఎన్‌వో, ఎఫ్ఎన్వో పోస్టుల కొరత వేధిస్తున్నది.
ప్రభుత్వానికి నివేదించాం
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని ఖాళీల భర్తీ గురించి ప్రభుత్వానికి నివేదించాం. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో కమాన్‌పూర్ పీహెచ్సీ నుంచి పలువురు సిబ్బంది రామగుండం మెడికల్ కళాశాలకు వెళ్లారు. వారిని డిప్యూటేషన్‌పై తీసుకొస్తాం. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా సేవలందిస్తున్నాం. త్వరలోనే పోస్టులన్నీ భర్తీ చేస్తాం. ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తమకు తెలియజేయాలి.
– డాక్టర్ వై పవిత్ర, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి (పెద్దపల్లి)