హైదరాబాద్, మార్చి 2(నమస్తే తెలంగాణ) : స్పీకర్ వ్యవస్థకే వన్నె తెచ్చిన విలువల శిఖరం శ్రీపాదరావు అని కర్ణాటక స్పీకర్ యూటీ ఖాదర్ ఫరీద్ కొనియాడారు. రాజకీయాల్లో పదవి అంటే కిరీటం కాదని, బాధ్యతని చాటి చెప్పిన దార్శనికుడని శ్లాఘించారు. హైటెక్‌సిటీలోని శిల్పాకళా వేదికలో తెలంగాణ భాషా, సాంసృతిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. సర్పంచ్ నుంచి స్పీకర్ వరకు ఎదిగిన శ్రీపాదరావు రాజకీయ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
తన తండ్రి ఆశయసాధనకు చిత్తశుద్ధితో కృషిచేస్తూ ప్రజాసేవలో ముందుకు సాగుతానని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్, ఎమ్మెల్యేలు విజయరమణారావు, రాజ్‌ఠాకూర్ మకాన్సింగ్, ఆది శ్రీనివాస్, ప్రేమ్‌సాగర్‌రావు, గండ్ర సత్యనారాయణ, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, బల్మూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.