హైదరాబాద్, జూలై 31(నమస్తే తెలంగాణ): మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. దవాఖానలో చికిత్స పొందుతున్న సమయంలో తిరిగి ప్రజాజీవితంలోకి వస్తారని ఎంతో ఆశగా ఎదురు చూశామని, కానీ ఆయన కానరానిలోకాలకు తరలివెళ్లడం కలచివేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీ నిబద్ధత కలిగిన గులాబీ సైనికుడికి కోల్పోయిందని శుక్రవారం విడుదల చేసిన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఉద్యమ ఆశయాలను జీవితాంతం నమ్మి, ప్రజల పక్షాన నిలబడి, పార్టీ పటిష్టానికి అంకితభావంతో పనిచేసిన నేతగా సుదర్శన్‌రెడ్డి చిరకాలం గుర్తుండిపోతారని చెప్పారు. ఆయన మరణం పార్టీకే కాదు.. యావత్ తెలంగాణ సమాజానికి తీరనిలోటని అభివర్ణించారు. పెద్ది చూపిన నిబద్ధత, సేవాతత్పరత, పోరాడే తీరు పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని స్పష్టంచేశారు. పెద్ది సుదర్శన్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. పెద్ది భార్యాపిల్లలు, కుటుంబసభ్యులు, అభిమానులు, ఆయనను నమ్ముకున్న కార్యకర్తలకు ఈ విషాదాన్ని తట్టుకొనే మనోనిబ్బరాన్ని ఇవ్వాలని భగవంతుడిని వేడుకున్నారు.