హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైఫల్యాలు, అవినీతిపై ప్రశ్నిస్తున్నందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. 22ఏ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఏ-1 ముద్దాయి అని, ఏ-2 రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అని విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. శాసనసభ నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసి, ప్రభుత్వం అబద్ధాల ప్రవాహం పారించిందని మండిపడ్డారు. తమను ఉద్దేశపూర్వకంగా సెషన్ మొత్తం సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళా ఎమ్మెల్యేలపై హత్యాయత్నం జరిగిందని, చీరలాగి అవమానించారని, ఆ విషయంలో ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని, మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వాలని అడిగితే సస్పెండ్ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన ఘటనపై విచారణకు హామీ ఇస్తే తామంతా సభలోనే కూర్చునేవాళ్లమని చెప్పారు. ఒక్క రోజుకే సస్పెండ్ చేసి, మిగతా రోజులకు సభకు రావడానికి అవకాశం కల్పించే అవకాశం ఉన్నా, అలా చేయలేదని పేర్కొన్నారు. స్పీకర్ సభను వాయిదా వేసి, ఇలాంటి సమస్యను పరిష్కరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఉదహరించారు. బీఆర్ఎస్ సభ్యులు సభలో ఉంటే అధికార పార్టీ అవినీతి, కుంభకోణాలను బయటపెడుతారనే భయంతోనే సస్పెండ్ చేశారని మండిపడ్డారు.
తన మామ ప్రభుత్వ భూములను కబ్జా చేసినట్టు అసెంబ్లీలో మంత్రి పొంగులేటి ఆరోపించడంపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా మామ హనుమంతరావు రిటైర్డ్ బ్యాంకు అధికారి. ఆయన చెక్కులు ఇచ్చి భూములను చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి ఆ భూములు కొనుగోలు చేశారు. అందులో ఒకరైన సత్యనారాయణ ఎక్స్ సర్వీస్‌మెన్. ఆయనకు 1995లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం భూమి కేటాయించింది. అప్పటికి నేను రాజకీయాల్లో లేను.
2010లో కాంగ్రెస్ ప్రభుత్వమే సత్యనారాయణకు ఎన్వోసీ ఇచ్చింది. ఆ తర్వాతే మా మామ చెక్కు ఇచ్చి, భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే భూమి కేటాయింపు, ఎన్వోసీ, రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగింది. కొండపాక నా నియోజకవర్గం కాదు. అది గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నది. ఆ విషయాన్ని కూడా పొంగులేటి తప్పుగా చెప్పారు. ఆ సమయంలో కాంగ్రెస్‌కు చెందిన నర్సారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు’ అని పేర్కొన్నారు. ఆ భూమి ఎకరం రూ.15 కోట్లు అని మంత్రి పొంగులేటి అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారని హరీశ్‌రావు మండిపడ్డారు. రూ.50 లక్షలకు ఎకరం చొప్పున ఆ భూమిని అమ్ముతామని, పొంగులేటి కొంటారా? అని సవాల్ విసిరారు. ‘మా మామకు భూములు అమ్మిన మరొక వ్యక్తి పేరు శ్రీనివాసచా రి. అతనికి 1995లోనే భూమి కేటాయించగా, 2011లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఎన్వోసీ ఇచ్చింది. వాటిని కూడా మా మామ చెక్కులు ఇచ్చి కొనుగోలు చేశారు’ అని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ హయాంలో మిషన్ భగీరథ పథకం కింద భూములు కోల్పోయినందుకు డబ్బులు చెల్లిం చారని మంత్రి పొంగులేటి చెప్పినవన్నీ అవాస్తవమని హరీశ్‌రావు పేర్కొన్నారు. 2011-2012 మధ్య గోదావరి సుజల స్రవంతి కింద ఎల్లం పల్లి నుంచి హైదరాబాద్‌కు వేసిన పైప్‌లైన్‌లో రెండు ఎకరాల భూమి కోల్పోయారని, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే పరిహారం కింద చెక్కులు ఇచ్చిందని వెల్లడించారు. ఈ మేరకు 2011లోనే మ్యుటేషన్ జరిగిందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి, ఆయన కుమారుడి బాగోతాలు బయటికి వస్తున్నాయనే కారణంతోనే తమపై బురద జల్లేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
22ఏతో సహా రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందులపై తాము అడిగిన ఏ ప్రశ్నకూ మంత్రి పొంగులేటి సమాధానం చెప్పలేదని హరీశ్‌రావు అన్నారు. చిల్లర రాజకీయ ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏదైనా ప్రధా న సమస్య ఉంటే విపక్షాలన్నీ అదే అంశంపై మాట్లాడటం కొత్తేమీ కాదన్నారు. ‘బీఆర్ఎస్ హయాంలో రూ.19,500 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించారు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చెల్లించడం లేదు?’ అని కాంగ్రెస్‌తో పొత్తులో ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అడిగారు కదా అని హరీశ్‌రావు గుర్తుచేశారు. అదే అంశాన్ని తాను ట్విట్టర్ ద్వారా ప్రశ్నించానని, మరి ఎంఐఎం, బీఆర్ఎస్ ఒకటే అంటారా? అని ప్రశ్నించారు. ఎన్ని లక్షల ఎకరాలను 22 ఏ కింద నిషేధిత జాబితాలో పెట్టారని తాము అడిగితే పొంగులేటి సమాధానం దాటవేశారని మండిపడ్డారు.
నిరుడు డిసెంబర్ 3న ఒక లిస్ట్ అప్లోడ్ చేశామని, సమయం తక్కువ ఉన్న కారణంగా అందరి భూములను ని షేధిత భూముల జాబితాలో చేర్చామని, 22 ఏ విషయంలో పొరపాటు జరిగిందని అసెంబ్లీ సాక్షిగా పొంగులేటి ఒప్పుకొన్నారని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేసినందుకు మంత్రి క్షమాపణ చెప్పి, 22ఏ జాబితాలో పెట్టిన భూములను ఎన్ని రోజుల్లో తొలగిస్తారో చెప్తారని తాము ఆశించామని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇల్లు 22ఏలో ఉంటే రాత్రికిరాత్రే ఆ జాబితా నుంచి తొలగించారని, రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజల ఇండ్లను కూడా అదే పద్ధతిలో తీస్తారని ఆశిస్తే మంత్రి పొంగులేటి నుంచి ఎలాంటి స్పష్టమైన సమాధానం రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్ని ఇండ్లు, ఆస్తులు, ఎకరాలను 22ఏ జాబితాలో చేర్చారనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
సభలో మంత్రి పొంగులేటి పచ్చి అబద్ధాలు ఆడారని హరీశ్‌రావు మండిపడ్డారు. సిద్దిపేట నియోజకవర్గంలోని మిరుదొడ్డిలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడని మంత్రి అసెంబ్లీలో చెప్పారని, కానీ మిరుదొడ్డి దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నదని గుర్తుచేశారు. తన మామకు సంబంధించిన అంశంలో వెలికట్ట గ్రామం సిద్దిపేట నియోజకవర్గంలో ఉందని చెప్పారని, అది గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నదని పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల భూములు రెగ్యులరైజ్ చేసేందుకు తెచ్చిన జీవో 76 వైఎస్ఆర్ హయాంలో ఇచ్చారని పొంగులేటి చెప్పారని, వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఈ జీవో తెచ్చినట్టు వెల్లడించారు. 2019 జూలై 17న జీవో నంబర్ 76ను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తుచేశారు.
20-25వేల ఇండ్లు నిషేధిత జాబితాలో పడ్డాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడి యా ఎదుట మాట్లాడిన విషయంలోనూ పొంగులేటి బుకాయించే ప్రయత్నం చేశారని చెప్పారు. మంత్రి తెలియక మాట్లాడుతున్నారని పొంగులేటి చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. తాత ముత్తాతలు సంపాందించిన 42వేల ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టినట్టు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తనతో చెప్పి బాధ పడ్డారని, ఇదే విషయాన్ని తాను సీఎం రేవంత్ రెడ్డికి నాలుగు నెలల కిందటే చెప్పానని మంత్రి కోమటిరెడ్డి యాదగిరిగుట్టలో మీడియా ముఖంగా వెల్లడించారని తెలిపారు. ఆయన మాట్లాడిన వీడియోను హరీశ్‌రావు ప్రదర్శించారు.
గత ప్రభుత్వంలోనే నిషేధిత జాబితాలో భూములు ఉన్నాయని పొంగులేటి బుకాయిస్తున్నారని, మరి ఇప్పుడెందుకు సమస్య వచ్చిందని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇప్పుడే రిజిస్ట్రేషన్లు ఎందుకు ఆగాయని, ప్రజలు ఎందుకు రోడ్లమీదకు వచ్చారని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడూ రిజిస్ట్రేషన్లు ఆగలేదని, శుక్రవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన పీపీటీ కార్యక్రమంలో 9 జిల్లాల బాధితులు పాల్గొని ఈ విషయం చెప్పారని తెలిపారు.
ఒకవేళ గతంలోనే జరిగితే పొంగులేటి ఇప్పుడెందుకు సారీ చెప్పారని, అధికారుల తప్పిదం అని ఎందుకు బుకాయిస్తున్నారని హరీశ్‌రావు నిలదీశారు. అవినీతి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం 22 ఏ లో భూములు పెట్టిందని మండిపడ్డారు. నాదర్గుల్ భూములు, ముఖ్యమంత్రి అన్న తిరుపతిరెడ్డి అంశం, వట్టినాగులపల్లిలో వృద్ధ జంటపై దాడి చేస్తే మంత్రి పొంగులేటి కుమారుడు, ఆయన కంపెనీపై ఎఫ్ఐఆర్ నమోదు అయిన అంశాలపై పొంగులేటి ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. ఖాజాగూడ భూ వ్యవహారం, ఫీనిక్స్ కంపెనీతో అగ్రిమెంట్లపై ఎందుకు స్పందించలేదు అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ఒక్కటైనా మంచి పని చేసిందా? అని మంత్రి పొంగులేటి అసెంబ్లీలో ప్రశ్నించడంపై హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. 11లక్షల మంది రైతులకు సాదాబైనామా కింద ఒక్క రూపాయి లేకుండా పట్టాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాదాబైనామాలు చేస్తామని చెప్పి అన్నీ రిజెక్ట్ చేశారని మండిపడ్డారు. గిరిజన రైతులకు 6లక్షల ఎకరాల పోడు పట్టాలు, సింగరేణిలో వేల మంది కార్మికులను జీవో 76 తెచ్చి ఇంటి వాళ్లను చేసిన ఘనత బీఆర్ఎస్దే అన్నారు.
జీవో 58, 59 ద్వారా 2లక్షల మంది పేదలకు పట్టాలిచ్చింది తమ ప్రభుత్వమని చెప్పారు. ఎల్బీనగర్లో 118 జీవో తెచ్చి వేలాది మందికి భూములు రిజిస్ట్రేషన్ చేసిచ్చింది బీఆర్ఎస్ కాదా? అని ప్రశ్నించారు. 22ఏలో జరుగుతున్న స్కామ్‌లు బయటపెట్టగానే భూతద్దంలో పెట్టి వెతికి తనపై, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు నో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్ అని చెప్పి.. అధికారంలోకి రాగానే ప్రజల ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నది మీరు కాదా? అని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పొంగులేటి రెండు గంటలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. 22ఏ విషయంలో జరిగిన తప్పిదాల ను సవరించి, నిషేధిత జాబితాలో తప్పుగా చేర్చిన భూములను తొలగించాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. 22ఏ సమస్య ఎప్పటి లోగా పరిష్కరిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాంటి భూమిని నిషేధిత జాబితాలో చేర్చారని, దానికి పరిష్కారం చూపమంటే తమపై ఎదురుదాడికి దిగడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రమంతా ‘30 శాతం కమీషన్ల ప్రభుత్వం’ అని అంటున్నారని, ఇంకా ప్రజలను మభ్యపెట్టడం అంటే అది భమ్రే అవుతుందన్నారు. ఇప్పటికైనా అవినీతి బాగోతానికి తెరదించి, ప్రజల భూములను నిషేధిత జాబితాలోంచి ఎప్పటిలోగా తొలగిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. భూములను నిషేధిత జాబితాలోంచి తీసేదాక బాధితుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని హరీశ్ రావు తేల్చిచెప్పారు.
సీనియర్ శాసనసభ్యుడికి మర్యాద ఇవ్వాలనే విచక్షణ మరచి తనను ‘అగ్గిపెట్టె రావు’ అని మంత్రి పొంగులేటి సంబోధించడంపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి, మంత్రి పొంగులేటికి తెలంగాణ ఉద్యమం, ఆ ఉద్యమ విలువలు తెలియవని చురకలంటించారు. 2001లో ఉద్యమంలోకి వచ్చిననాడు తాము ఎమ్మెల్యేలు, మంత్రులం అవుతామనో, ప్రభుత్వం వస్తుందనో పోరాటాలు చేయలేదని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యలు తీరాలని నిస్వార్థంగా పోరాటాలు చేశామని పేర్కొన్నారు.
రాజీనామా ఇవ్వమంటే జిరాక్స్ కాగితం ఇచ్చి పారిపోయిన చరిత్ర మీ నాయకుడిది అని పరోక్షంగా రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి చురకలంటించారు. మంత్రి పొంగులేటి ఎన్నడూ ‘జై తెలంగాణ’ అనలేదని, ఉద్యమాలు చేయలేదన్నారు. తనను అగ్గిపెట్టె రావు అని పదేపదే సంబోధిస్తే అది తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులను అవమానించినట్టుగా భావిస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ పట్టుబట్టి, చావునోట్లో తలపెట్టి రాష్ర్టాన్ని సాధిస్తే, ఇప్పుడు ఆయనను అవమానించే రీతిలో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.