హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ సామెత చందంగా ఉంది రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీరు. 22ఏ నిషేధిత వివాదంలో అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు అడ్డదిడ్డంగా వాదిస్తున్నారు. నరంలేని నాలుక ఎన్ని మాటలైనా మాట్లాడుతదన్నట్టు ఓవైపు తప్పు జరిగింది క్షమించండి అంటూ మరోవైపు నిస్సిగ్గుగా తమ తప్పేమీ లేదంటూ వితండవాదం చేశారు. 22ఏపై చర్చలో భాగంగా శనివారం అసెంబ్లీ సాక్షిగా మంత్రి పొంగులేటి పలాయనవాదం లంఘించుకున్నారు. ప్రజలు, ప్రతిపక్షం సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పడం చేతగాక నాలుక మడతేశారు. నిజాలు చెప్పలేక అబద్ధాలతో ఎదురుదాడికి ప్రయత్నించారు. గురువింద గింజ మాదిరిగా కాంగ్రెస్ సర్కార్ చేసిన ఘోర తప్పిదాలను పక్కనపెట్టి ప్రతిపక్ష బీఆర్ఎస్, ధరణిపై నిందలేస్తూ చిందులు తొక్కారు. 22ఏ నిషేదిత జాబితాలో తాము కొత్తగా భూమి చేర్చలేదని చెప్పిన మంత్రి.. మరి ఇప్పుడు ఉత్పన్నమైన సమస్యకు కారణమేందో చెప్పలేకపోయారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కారణమేంటో సెలవివ్వలేదు. అంతా సవ్యంగా ఉంటే.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు పొంగులేటి అంటూ డిమాండ్ చేస్తున్నారు.
22ఏ నిషేధిత భూముల వివాదంపై ఆగస్టు 17న సచివాలయం సాక్షిగా విలేకరుల సమావేశం నిర్వహించిన మీరు.. తప్పు జరిగిందని అంగీకరించింది నిజమా? కాదా?. బహిరంగంగా మీడియా సమక్షంలో ‘తప్పు జరిగింది.. క్షమించండి.’ అంటూ ప్రజలను క్షమాపణ కోరింది నిజం కాదా? ప్రైవేట్ భూములను నిషేధిత జాబితాలో చేర్చామని చెప్పింది మీరు కాదా? సమస్యను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది మీరు కాదా? ఆగస్టు 13న కూకట్‌పల్లిలో జరిగిన బహిరంగ సభలో మీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం నిషేధిత జాబితాలో తప్పులు జరిగినట్టు అంగీకరించారు కదా. మీ భూములను జాబితా నుంచి తీయించే పూచీ నాదంటూ ప్రజలకు హామీ ఇచ్చారు కదా. మీ భూములు, ఇండ్లకు మళ్లీ రిజిస్ట్రేషన్ అయ్యేలా చేస్తానని చెప్పారు కదా. మరి ఇప్పుడు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు?
హైకోర్టుకు నిషేధిత జాబితా భూముల వివరాలు సమర్పించే క్రమంలో తమ అధికారులు తప్పు చేసినట్టు మీరే స్వయంగా అంగీకరించారు కదా. హైకోర్టు ఆదేశాల మేరకు నిరుడు డిసెంబర్ 3న జాబితాను అప్లోడ్ చేశామని, అధికారులు చూసుకోకుండా పాత జాబితాలను యథావిధిగా అప్లోడ్ చేశారని చెప్పింది మీరే కదా. పట్టా భూములు, ప్రైవేట్ భూములు, గతంలో ప్రభుత్వాలు క్లియరెన్స్ ఇచ్చిన యూఎల్సీ, ఇతర భూములను సైతం నిషేధిత జాబితాలో పెట్టారని, అందువల్లే ఈ సమస్య ఎదురైందని మీరు చెప్పారు కదా. గత జీవోలను, ఉత్తర్వులను పట్టించుకోకపోవడమే ఇందుకు కారణమని అంగీకరించారు కదా. మరి తప్పు ఒప్పుకొని ఇప్పుడు ఎందుకు మాట మార్చుతున్నారు?
22ఏ నిషేధిత జాబితా తమ ప్రభుత్వం తెచ్చింది కాదని, ఈ జాబితాలో తమ ప్రభుత్వం అదనంగా ఒక్క ఎకరం సైతం చేర్చలేదని మంత్రి పొంగులేటి చెబుతున్నారు. అంతా శాకాహారులే కానీ గంపకింద కోడి మాయమైనట్టు కాంగ్రెస్ సర్కార్ 22ఏ నిషేధిత జాబితాలో భూములు చేర్చకపోతే ఈ సమస్య ఎందుకొచ్చినట్టు. ఇన్నేండ్లుగా లేని ఇబ్బందులు ఇప్పుడే ఎందుకు వచ్చినట్టు. ఇప్పటిదాకా సాఫీగా జరుగుతున్న భూములు, ఇండ్ల్ల రిజిస్ట్రేషన్లు అకస్మాత్తుగా ఎందుకు ఆగిపోయినట్టు. మీరే ప్రత్యేకంగా సబ్ రిజిస్ట్రార్లను, కలెక్టర్లను పిలిపించుకొని గతంలో క్లియర్ ఉన్న వాటిని పరిశీలించి రిజిస్ట్రేషన్లు చేయాలని ఎందుకు ఆదేశించారు. 757 దరఖాస్తులు వచ్చాయని, వీటిని క్లియర్ చేస్తున్నట్టు మీరు చెప్పారు కదా.
‘హైకోర్టు ఆదేశాలతో 22ఏ జాబితాను అప్లోడ్ చేసే సమయంలో పొరపాటు జరిగింది. తమ అధికారుల తప్పిదం వల్లే ఇది జరిగింది. వీటిని సరిచేస్తున్నాం’ అని గతంలో, శనివారం అసెంబ్లీలోనూ మీరు స్వయంగా అంగీకరించారు కదా. అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోల్చితే తమ ప్రభుత్వం హయాంలో 22ఏ నిషేధిత జాబితాలోని భూమి తగ్గిందని చెప్పారు. అధికారులు కొత్తగా ప్రైవే ట్ భూములను చేర్చితే నిషేధిత జాబితాలో భూమి ఎలా తగ్గుతుందో చెప్పగలరా? 2023 డిసెంబర్ 7 న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి నిషేధిత జా బితాలో 1,02,52,690 ఎకరాల భూమి ఉన్నదని చెప్పిన మీరు ఆ తర్వాత నుంచి ఈ ఏడాది ఆగస్టు 31వరకు 1,02,05,250 ఎకరాల భూమి ఉన్నట్టు తెలిపారు.
అసలు 22ఏ సమస్యనే లేదని చెబుతున్న మీరు కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లతో మీటింగ్‌లపై మీటింగ్‌లు ఎందుకు పెట్టారు. నిషేధిత జాబితా అందించాలని వారికి ఎందుకు ఆదేశాలిచ్చారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్లతో దాదాపు డజనుకు పైగా మీటింగ్‌లు పెట్టింది నిజం కాదా. కలెక్టర్లు, సబ్ రిజిస్ట్రార్లపై చిందులు తొక్కింది వాస్తవం కాదా. అంతెందుకు మీ సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఈ వివాదంపై మీతో, మీ అధికారులతో సమావేశం ఎందుకు నిర్వహించారు.
22ఏ జాబితాలో పట్టా భూములు, ప్రైవేట్ భూములను సైతం పెట్టినట్టు అంగీకరించారు. అలాంటప్పుడు సమస్యను సృష్టించిన మీపైనే ఆ తప్పును పరిష్కరించే బాధ్యత కూడా ఉంటుంది కదా. ప్రతిపక్ష బీఆర్ఎస్పై ఆడిపోసుకోవడమే తప్ప ప్రజలకు భరోసా ఇచ్చే నాలుగు మాటలు ఎందుకు చెప్పలేకపోయారు. సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారో ఎందుకు హామీ ఇవ్వలేదు.
22ఏ నిషేధిత జాబితాలో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని ఇంటిని చేర్చారు. ఆ ఇల్లు సీఎంది కాబట్టి హడావిడిగా జాబితా నుంచి తొలగించారు. మరి సామాన్య ప్రజల ఇండ్లను అంతే వేగంగా ఎందుకు తొలగించడం లేదు. అంటే ముఖ్యమంత్రికి ఓ రూల్.. సామాన్యులకు ఇంకో రూలా? ప్రజలు ఏమైనా, ఎన్ని ఇబ్బందులు పడుతున్నా మీకు పట్టదా.?
22ఏ నిషేధిత జాబితాపై తప్పు జరిగినట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మరోసారి అంగీకరించారు. తప్పు జరిగిందని, క్షమించండని ఇప్పటికే ఆగస్టు 17న సచివాలయం సాక్షిగా విలేకరుల సమావేశంలో ప్రజలను కోరారు. తాజాగా అసెంబ్లీలో చర్చ సందర్భంగా మరోసారి ఒప్పుకొన్నారు. హైకోర్టు ఆదేశాలతో తమ అధికారులు నిరుడు డిసెంబర్ 3న ఆన్లైన్లో అప్లోడ్ చేసే సమయంలో పొరపాటు జరిగిందని స్పష్టంచేశారు. దీన్ని సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

నమస్తే తెలంగాణ పత్రికపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అక్కసు వెళ్లగక్కారు. 22ఏ నిషేధిత జాబితాపై సంచలనాత్మక కథనాలు ప్రచురించినందుకు విషం కక్కారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రజల పక్షాన పోరాడటంపై ఆయన అసహనం పతాకస్థాయికి చేరినట్టున్నది. అందుకే అసెంబ్లీ సాక్షిగా పత్రికపై ప్రేలాపనలు చేశారు. గుమస్తా తెలంగాణ అంటూ సంబోధిస్తూ తన అక్కసు వెళ్లగక్కారు. 22ఏతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వారి సమస్యలను ఏకరువు పెట్టింది. ఏడాది కిందటే నిషేధిత జాబితాలోకి కోటి ఎకరాలు శీర్షికన కథనాన్ని ప్రచురించింది. ఆ తర్వాత 22ఏ జాబితా ముసుగులో ప్రభుత్వ పెద్దలు చేస్తున్న భూదోపిడీని ఎండగట్టే ప్రయత్నం చేసింది.
ఇందులో భాగంగానే ప్రతిరోజు బాధితుల పక్షాన నిలిచి వారి సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. నమస్తే కథనాలతో ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక ఏర్పడింది. దీంతో మంత్రి పొంగులేటి కస్సుబుస్సులాడారు. ప్రజలకు, ప్రతిపక్షానికి నిజాలు చెప్పలేక, ‘నిషేధిత’ సమస్యకు పరిష్కారం చూపలేక అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు, వితండవాదం చేస్తూ ఎదురుదాడికి దిగారు. రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గిపోయిందంటూ గుమస్తా తెలంగాణ కథనాలు రాస్తుందంటూ అసహనం వ్యక్తం చేశారు. మా నమస్తే తెలంగాణను గుమస్తా తెలంగాణగా సంబోధించించి మీరే ఏదో చులకన చేశారని అనుకుంటున్నారేమో.. మేం తెలంగాణ ప్రజలకు గుమస్తాలమేనని ఎప్పుడు చాటి చెప్పాం. ఇప్పుడు మీరు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు.