న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం జరిగిన బ్రిక్స్ సదస్సులో సభ్య దేశాల నేతలు న్యూఢిల్లీ ప్రకటనను ఆమోదించారు. కూటమి సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏకాభిప్రాయ పత్రాన్ని ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ)లో ‘నిర్మాణాత్మక మార్పు’ సహా బహు పాక్షిక సంస్థల్లో సంస్కరణలు చేపట్టాలని ప్రకటన పిలుపునిచ్చింది. ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించింది. ‘ఏకపక్ష యుద్ధ చర్యలను’ ఖండిస్తూ, పశ్చిమాసియాలో కొనసాగుతున్న సైనిక దాడుల నేపథ్యంలో సముద్రయాన సిబ్బంది, వాణిజ్య నౌకాయానానికి భద్రత కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.
సదస్సుకు హాజరైన భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాలైన చైనా, రష్యాలు.. ఐక్యరాజ్య సమితిలో, ముఖ్యంగా భద్రతా మండలిలో మరింత కీలకపాత్ర పోషించాలన్న బ్రెజిల్, భారత్ ఆకాంక్షలకు తమ మద్దతును పునరుద్ఘాటించాయి. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం ఇకపై అమెరికా డాలర్‌కు బదులుగా స్థానిక కరెన్సీల్లో మరింతగా నిర్వహించాల్సి ఉందని ప్రకటన పేర్కొంది. ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతాలకు చెందిన అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించేలా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలని ప్రత్యేకంగా పిలుపునిచ్చింది.
‘మారుతున్న ప్రపంచాన్ని పాతబడిపోయిన సంస్థల ద్వారా నడిపించలేమన్నది నేటి చర్చ స్పష్టం చేసింది. ప్రాతినిధ్యం, స్పందన, నియమాల రూపకల్పనలో సంస్కరణలు అత్యవసరం’ అని ప్రధాని మోదీ అన్నారు. ‘భవిష్యత్తు సాంకేతికతల అభివృద్ధిలో, వాటిని నియంత్రించే నిబంధనల రూపకల్పనలో గ్లోబల్ సౌత్‌కు సమాన భాగస్వామ్యం ఉండాలని కూడా మేము స్పష్టం చేశాం’ అని తెలిపారు. ‘ఈరోజు ఆమోదించిన న్యూఢిల్లీ ప్రకటన మన ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశాన్ని అందిస్తుంది. ఈ తీర్మానాలను ఆచరణాత్మక ఫలితాలుగా మార్చడం ఇప్పుడు మన బాధ్యత’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థ చాలాకాలంగా కీలక మలుపులో ఉందని మేము గుర్తిస్తున్నాం. డబ్ల్యూటీవో నిబంధనలకు అనుగుణంగా లేని వాణిజ్య పరిమితి చర్యలు పెరుగుతున్నాయి. విచక్షణా రహితంగా సుంకాలు, ఇతర పన్నులు పెంచడం ద్వారా లేదా పర్యావరణ లక్ష్యాల పేరుతో రక్షణాత్మక విధానాలను అనుసరించడం వంటి చర్యలు ప్రపంచ వాణిజ్యాన్ని మరింత తగ్గించే, ప్రపంచ సరఫరా గొలుసులకు అంతరాయం కలిగించే, అంతర్జాతీయ ఆర్థిక వాణిజ్య కార్యకలాపాల్లో అనిశ్చితిని సృష్టించే ప్రమాదం ఉంది. ఇవి ఇప్పటికే ఉన్న ఆర్థిక అసమానతలను మరింత తీవ్రతరం చేసి, ప్రపంచ ఆర్థిక అభివృద్ధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు’ అని ప్రకటన పేర్కొంది.
‘ఏ ఉద్దేశంతో ఎక్కడ ఎప్పుడు ఎవరి ద్వారా జరిగినా ఉగ్రవాద చర్యలన్నింటినీ నేరపూరితమైనవి, సమర్థించలేనివిగా మేము ఖండిస్తున్నాం. 2025 జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని అత్యంత తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడిలో 25 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఉగ్రవాదులు సరిహద్దు దాటి రాకపోకలు సాగించడం, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఉగ్రవాదులకు సురక్షిత ఆశ్రయాలు కల్పించడం సహా అన్ని రూపాలు, వ్యక్తీకరణల్లో ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం.
ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నవారితో పాటు వారికి మద్దతు ఇచ్చిన వారందరినీ బాధ్యులుగా చేసి, సంబంధిత జాతీయ, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా న్యాయస్థానం ముందు నిలబెట్టాలి’ అని ప్రకటన పేర్కొంది. అయితే ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులపై ఇలాంటి సంయుక్త ప్రకటన పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని నిపుణులు అంటున్నారు. అయితే పాశ్చాత్య దేశాల ఆంక్షల వంటి ఆర్థికంగా నష్టపరిచే విధానాలకు వ్యతిరేకంగా అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి ఐక్యతను ప్రదర్శించేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.
‘బ్రిక్స్’లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ఉన్నాయి. అమెరికా, దాని పాశ్చాత్య మిత్ర దేశాల ఆధిపత్యంలో ఉన్న ప్రపంచ వ్యవస్థను సవాల్ చేయాలనే ఉద్దేశంతో 2009లో బ్రిక్స్ ఏర్పాటైంది.
వర్ధమాన మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారానికి ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వేదిక బ్రిక్స్ కూటమి అని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పేర్కొన్నారు. బ్రిక్స్ సదస్సులో శనివారం ఆయన ప్రసంగిస్తూ పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడానికి ఈ కూటమి సముచిత పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతంలో శాంతి, ప్రశాంతత కోసం బ్రిక్స్ సభ్య దేశాలతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు మారుతున్న కొద్దీ అక్కడ జరుగుతున్న యుద్ధం ఆ ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగించిందని, అలాగే ఇది అంతర్జాతీయ సమాజం ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా లేదని అన్నారు. సంభాషణలు, చర్చల ద్వారా పరస్పర అవగాహనను పెంపొందించుకోవాలని, విభేదాలను సముచితంగా పరిష్కరించుకోవాలని, బ్రిక్స్ సహకారం స్థిరంగా ముందుకు సాగేలా చూడాలని ఆయన సభ్య దేశాలను కోరారు.
అభివృద్ధి చెందుతున్న దేశాలు నియమాలు పాటించే స్థితి నుంచి నియమాలు రూపొందించే స్థితికి చేరుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందిన, ఆర్థికంగా బలహీనంగా ఉన్న దేశాల కలయికతో ఉన్న గ్లోబల్ 18వ బ్రిక్స్ సమావేశానికి అధ్యక్షత వహించిన మోదీ చేసిన ప్రారంభ ప్రసంగంలో ఆర్థికంగా వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాలతో కూడిన గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న దేశాలు)కు మరింత ప్రాధాన్యత కల్పించడం ప్రధాన అంశంగా నిలిచింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ తదితరులు హాజరైన ఈ సమావేశంలో మోదీ ప్రపంచ పాలనలో ఉన్న తీవ్రమైన అసమతుల్యతలను ఎత్తిచూపారు.
సవాళ్లు ఎదుర్కోవడంలో గ్లోబల్ సౌత్ దేశాలు ముందు వరుసలో ఉన్నప్పటికీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం అవి వెనుక వరుసలోనే ఉండిపోతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని అభివృద్ధి చెందుతున్న దేశాలు నియమాలు పాటించే స్థితి నుంచి నియమాలు రూపొందించే స్థితికి మార్పు చెందాలని పిలుపునిచ్చారు. ప్రాతినిధ్యం, స్పందించే గుణం, నియమ నిబంధనల రూపకల్పన అనే మూడు ప్రధాన అంశాలపై దృష్టి సారించే 10 అంశాల రోడ్‌మ్యాప్‌ను మోదీ సూచించారు.