తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా మంత్రి పొంగులేటి ఆరోపణలు చేయడం సరికాదు. నాపై చేసిన ఆరోపణలకు పొంగులేటి వెంటనే సమాధానమివ్వాలి, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి.
-ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో తనకు ఉన్న 1.10 ఎకరాల భూమిని అమ్మనందుకే, దానిని నిషేధిత జాబితాలో చేర్చి వేధిస్తున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. వట్టినాగులపల్లిలో తనకు 29 ఎకరాల భూమి ఉన్నదని నిరూపిస్తే ఇప్పుడే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు. ఒకవేళ నిరూపించకపోతే మంత్రి పదవికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. వట్టినాగులపల్లి సర్వే నంబర్ 188/1/2లోని 1.10 ఎకరాల భూమికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకొని, లీగల్ ఒపీనియన్ తీసుకొని, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే 2012లో అగ్రిమెంట్ చేసుకున్నానని, 2014లో రిజిస్ట్రేషన్ చేసుకున్నానని తెలిపారు.
అది భూదాన్ పరిధిలోకి రాదని 2008లోనే సంబంధిత వ్యవస్థ నుంచి స్పష్టత వచ్చిందని చెప్పారు. అదే అంశాన్ని న్యాయస్థానం కూడా పరిగణనలోకి తీసుకున్నదని తెలిపారు. ఆ భూమి విజయరాజు పేరుతో ఉన్న రికార్డులకు సంబంధించి కూడా కోర్టు ఆదేశాలు ఉన్నట్టు పేర్కొన్నారు. అందులోకి రెవెన్యూ అధికారులు ప్రవేశించరాదనేలా ఉత్తర్వులు ఉన్నాయని వెల్లడించారు. భూమి వివరాలను 2015, 2021, 2023 ఎన్నికల అఫిడవిట్లలోనూ పొందుపరిచానని తెలిపారు. ఇందుకు సంబంధించిన పత్రాలను మీడియాకు విడుదల చేశారు. ఎవరైనా రికార్డులను పరిశీలించుకోవచ్చని, తనను అడిగినా పూర్తి వివరాలు ఇస్తానని పల్లా స్పష్టం చేశారు. అకడ తనకు కేవలం ఎకరం 10 గుంటల భూమి మాత్రమే ఉన్నదని మరోసారి స్పష్టం చేశారు. దానికి విక్రయించాలని కోరితే తాను ఒప్పుకోలేదని చెప్పారు. దీంతో ఆ భూమిని నిషేధిత జాబితాలో పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన 29 ఎకరాల భూముల్లో ఇది భాగం కాదని తేల్చి చెప్పారు.
వట్టినాగులపల్లిలో తాను చెప్తున్న ప్రాంతంలో మొత్తం సుమారు 33 ఎకరాల భూమి ఉన్నదని పల్లా తెలిపారు. అందులోని మిగిలిన భూమిని మైనంపల్లి సోదరులతోపాటు మరికొందరు కొనుగోలు చేశారని చెప్పారు. ఈ లావాదేవీలపై సమగ్ర విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. మంత్రి ఆరోపిస్తున్నట్టు ఒకవేళ ఆ 29 ఎకరాల భూమి తనదని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. ఆ భూమి విలువ రూ.3 వేల కోట్లు అని మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలపైనా తీవ్రంగా స్పందించారు.
భూమి నిజంగా అంత విలువైనదే అయితే ఇప్పుడే తీసుకోవచ్చని సవాల్ చేశారు. ‘రూ.3 వేల కోట్లు కాదు, మీరు ఎంత విలువ చెప్తే అంతకే తీసుకోండి. ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడుతా’ అని స్పష్టం చేశారు. తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు. భూమి వ్యవహారంలో నిజానిజాలు న్యాయపరమైన ప్రక్రియ ద్వారానే తేలాలని పేర్కొన్నారు. తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి వెంటనే సమాధానం ఇవ్వాలని, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.