మేడ్చల్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): భూ దోపిడీ దాహంతో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు నిర్ణయంతో ప్రజల ఆస్తుల విలువలు తగ్గుతున్నట్లు బాధితులు ఆందోళన చెందుతున్నారు. 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన క్రమంలో అమ్ముకుందామనుకుంటే కొనుగోలు దారులు ముందుకు రావడం లేదని బాధితులు తలలు పట్టుకుంటున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ నియోజకవర్గాల ప్రజల ఆస్తులు నిషేధిత జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ బాధితుల తరపున పోరుబాట చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తేగా ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలగించే పక్రియ కొనసాగుతుంది.

ఉప్పల్, మల్కాజిగిరి, మేడ్చల్, కూకట్‌పల్లిలోని వివిధ ప్రాంతాల్లో కొన్ని సర్వే నంబర్లు నిషేధిత జాబితాలో కొనసాగుతున్నాయి. మేడ్చల్ నియోజకవర్గంలోని బోడుప్పల్, మేడిపల్లి, మేడ్చల్‌లో ఉండగా మల్కాజిగిరినియోజకవర్గంలో సుమారు 30 వేల ఇళ్లు నిషేధిత జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉప్పల్ నియోజకవర్గంలోని చిలుకానగర్, కల్యాణిపురి, చర్లపల్లి, కూకట్పల్లి నియోజకవర్గంలోని కూకట్పల్లి మండలం 145, 163 సర్వే నంబర్లలో 50 ఏండ్ల క్రితం అనేక కాలనీలు ఏర్పడి 45 సంవత్సరాలు పూర్తయిన ఇండ్లు ఇప్పటికింకా నిషేధిత జాబితాలోనే కొనసాగుతున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. బ్యాంకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో కొనుగోలు దారులు ముందుకు రావడం లేదు.

గ్రేటర్ పరిధిలో ప్రజల నెత్తిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షల పిడుగు కురిపించింది. శాసనసభ వేదికగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రంగారెడ్డి, మేడ్చల్-మలాజిగిరి, సంగారెడ్డి జిల్లాలకు చెందిన జాబితాను వెల్లడించి కంటిమీద కునుకు లేకుండా చేశారు. దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన ఇళ్లు, ప్లాట్లు, అపార్ట్ మెంట్లపై ఒకసారిగా ప్రభుత్వం వివాదాస్పద, నిషేధిత భూములని ముద్ర వేయడంతో వేలాది కుటుంబాలు దికుతోచని స్థితిలోకి నెట్టబడ్డాయని నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేక దాటవేస్తూ, నిషేధిత భూముల జాబితా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మొదలైందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు, రుణాలు, రెవెన్యూ లావాదేవీలను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రాతిపదికన అడ్డుకుంటుందో సమాధానం చెప్పాలని ప్రజలు నిలదీస్తున్నారు. ప్రభుత్వ అనాలోచిత వ్యాఖ్యలు, అర్ధరాత్రి హడావుడిగా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ రంగం మరింత దిగజారిపోగా, సామాన్యుడి ఆస్తి విలువ క్షణాల్లో ఆవిరైపోతోంది.
-సిటీబ్యూరో, (నమస్తే తెలంగాణ)

కేపీహెచ్‌బీ కాలనీ, సెప్టెంబర్ 12 : కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 22ఏ భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. శనివారం కూకట్పల్లి క్యాంప్ ఆఫీస్‌లో బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, సామాన్యుల భూములు, నగరంలోని పలు ప్రాంతాల్లో యాభై ఏండ్లుగా నివాసం ఉంటున్న కాలనీల్లో ప్రైవేట్ భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ కాలనీల్లో ఇంటి స్థలాలను అమ్ముకోవాలన్నా, బ్యాంక్ రుణాలు తీసుకోవాలన్నా వీలు కావడం లేదని, కనీసం ఇంటి నిర్మాణం కోసం పర్మిషన్లు కూడా ఇవ్వడం లేదన్నారు. భూముల విషయంలో ఎక్కడైనా అక్రమాలు జరిగితే విజిలెన్స్ విచారణ జరపాలని కోరారు. రైతుల భూములను ఎవరైనా బలవంతంగా స్వాధీనం చేసుకున్నా, ప్రైవేట్ భూములను ప్రభుత్వ ఆస్తులుగా చూపించే ప్రయత్నాలు జరిగాయా అన్న అంశాన్ని పరిశీలించాలన్నారు. ఈ వ్యవహారాల్లో ఎవరెవరి పాత్ర ఉంది, ఏ పత్రాల ఆధారంగా ఎవరి ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకున్నారో తేల్చాలని కోరారు.

రంగారెడ్డి, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : నగర శివారులో 22ఏ నిషేధిత జాబితా భూ బాధితులు పెరిగిపోతున్నారు. మున్సిపాలిటీలు, మండలాల్లో ఉన్న అసైన్డ్, వక్ఫ్‌బోర్డు, భూదాన్ భూములను ప్రభుత్వం జల్లెడపట్టి మరీ నిషేధిత జాబితాలో చేర్చింది. సుమారు 20 వేల ఎకరాల వరకు ఉన్నట్టు బాధితులు చెబుతున్నారు. బాలాపూర్, సరూర్‌నగర్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, శంషాబాద్, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో వక్ఫ్ బోర్డు, భూదాన్ భూములు ఎక్కువగా ఉన్నాయి. ఈ భూములను గ తంలో రియల్ఎస్టేట్ వ్యా పారులు త ప్పుడు డ్యాకుమెంట్లను సృష్టించి వెం చర్లు చేసి ప్లాట్లుగా మార్చి ప్రజలకు విక్రయించారు.
ఈ భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. దీంతో వాటిని అమ్ముకోలేక..బ్యాంకులకెళ్తే రుణాలు రాక పలువురు బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుర్కయాంజాల్, అబ్దుల్లాపూర్‌మెట్, పెద్దఅంబర్‌పేట్, ఇబ్రహీంపట్నం, బొంగుళూరు, ఆదిబట్ల, తుక్కుగూడ, శంషాబాద్, రాజేంద్రనగర్, శంకర్పల్లి, మొయినాబాద్ వంటి ప్రాంతాల్లో తమ పిల్లల వివాహాలు, ఇతరత్రా అవసరాల కోసం అనేక మంది అక్కడ ప్లాట్లను కొని రిజిస్ట్రేషన్లు కూడా చేసుకున్నారు.
తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎంఎంకుంటలోని భూములన్నీ నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. 750 ఎకరాల భూమి ఉండగా 600 ఎకరాలను ఇప్పటికే రియల్ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లుగా మార్చి ప్రజలకు విక్రయించారు. మిగిలిన 150 ఎకరాలు రైతుల ఆధీనంలో ఉన్నది. ఈ భూములన్నింటిని సర్కార్ నిషేధిత జాబితాలోకి చేర్చింది. నాదర్గుల్లో సర్వేనంబర్లు 597, 599, 615, 616, 617, 618 తమ పట్టా భూములను ప్రభుత్వం ఇటీవల నిషేధిత జాబితాలో చేర్చించిందని.. తహసీల్దార్, ఆర్డీవో అవి పట్టా భూములని నిర్ధారించినా తొలగించటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బడంగ్పేట్, సెప్టెంబర్12: బాలాపూర్ మండలంలోని ప్రైవేట్ భూమి 22ఏలో ఉన్నట్లయితే సరిదిద్దుతామని తహసీల్దార్ ఇందిరాదేవి తెలిపారు. ప్రభుత్వ భూమిని మాత్రమే 22ఏలో చేర్చామని, ఎక్కడైనా పొరపాటు జరిగితే సరిచేస్తున్నామన్నారు. ప్రైవేట్ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేయకపోతే సబ్‌రిజిస్ట్రార్‌తో మాట్లాడి రిజిస్ట్రేషన్ చేయిస్తామని తెలిపారు. గతంలో 22ఏలో ఉన్న వాటిని యథావిధిగా కొనసాగిస్తున్నామన్నారు. యూఎల్సీ, ఎండోమెంట్, వక్ఫ్‌భూమి, అసైన్డ్ భూమి,భూదాన్ తదితర ప్రభుత్వ భూమిని 22ఏలో చేర్చినట్లు తెలిపారు. ప్రభుత్వ భూమిని అనుసరించి కొన్ని ప్రైవేట్ సర్వే నంబర్లలో ఉన్న భూమిని ఎక్కడైనా 22ఏలో చేర్చినట్లు గుర్తిస్తే అధికారులను సంప్రదిస్తే సరిచేస్తామన్నారు. ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు.మండలంలో అనుమానాలు ఏమైనా ఉంటే తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదులు చేయాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆస్తులను 22 ఏ నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురి చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ పెత్తనం ఏమిటి.. ప్రభుత్వ భూముల దోపిడే కాకుండా ప్రజల ఆస్తులను గుంజుకునేలలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేసింది. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ప్రజల ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలగించే వరకు బీఆర్ఎస్ బాధితుల తరపున నిలుస్తుంది. ప్రజల ఆస్తులను నిషేదిత జాబితాలో చేర్చి ప్రజల ఆస్తులను అమ్ముకోకుండా చేసిన పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదే. – కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
22ఏ నిషేధిత జాబితాలో చేర్చి ప్రజల ఆస్తుల అనిశ్చితికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైంది. నిషేధిత జాబితాలో ప్రజల ఆస్తులు చేరినందున వారికి విక్రయించే అవకాశం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది. ప్రభుత్వం తొలగించినట్లు చెప్పిన ఇంకా ఆస్తులు నిషేధిత జాబితాలోనే ఉన్నాయి. మల్కాజిగిరి నియోజకవర్గంలోని యాప్రాల్ జూపల్లి హోమ్స్‌లో 3 వందల మందికి చెందిన ఇండ్లు నిషేధిత జాబితాలోనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం బాధితుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తుంది.
– మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి