నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 12: కరెంటియ్యక పంటలెండబెడుతున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిరంతరాయంగా ఇవ్వాల్సిన కరెంటు కనీసం ఏడు గంటలు కూడా వస్తలేదని మండిపడుతున్నారు. ఓ వైపు వర్షాలు లేక.. మరోవైపు కరెంట్ రాక పంటలు ఎండుతుండటంతో చేసిన అప్పులు కూడా తీరేట్టు లేవని ఆవేదన చెందారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి కరెంట్ కష్టాలు కొనితెచ్చుకున్నామని రైతులు వాపోయారు. సర్కార్ తీరును నిరసిస్తూ శనివారం కూడా రైతులు రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కారు. సబ్స్టేషన్లను ముట్టడించారు. ధర్నాలు, రాస్తారోకోలతో నిరసన తెలిపారు. ఖమ్మంజిల్లా వేంసూరు మండలం కందుకూరులో సబ్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు.
రైతుల ఆందోళనకు మద్దతుగా సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ర్యాలీ, ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మళ్లీ విద్యుత్తు కోతలు మొదలయ్యాయని ఆరోపించారు. రైతుల విద్యుత్తు అవసరాలపై ముందస్తు ప్రణాళిక లేకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. అప్రకటిత కోతలను నిరసిస్తూ రైతులు సూర్యాపేట మండలం ఎర్కారం సబ్‌స్టేషన్‌ను ముట్టడించి సూర్యాపేట-జనగాం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ జీడీ భిక్షం వారి ఆందోళనకు మద్దతు పలికి మాట్లాడారు. రైతులు పెద్ద ఎత్తున సబ్‌స్టేషన్ ముట్టడించి రాస్తారోకో చేపట్టడంతో సుమారు 5 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా తురపల్లి సబ్‌స్టేషన్‌ను బీఆర్ఎస్ నాయకులతో కలిసి రైతులు ముట్టడించారు. అంతకుముందు భారీ ర్యాలీ తీశారు.
వ్యవసాయరంగానికి 24 గంటల విద్యుత్తు అందించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా జక్కాపూర్‌లో సిద్దిపేట-సిరిసిల్ల రహదారిపై, లక్ష్మీదేవిపల్లి స్టేజీ వద్ద సిద్దిపేట-ముస్తాబాద్ రహదారిపై లక్ష్మీదేవిపల్లి, బంజేరుపల్లి, కోదండరావుపల్లి, ఇబ్రహీంపూర్ రైతులు రాస్తారోకో నిర్వహించారు. మాటిండ్లలో సబ్‌స్టేషన్ ఎదుట మాటిండ్ల, శేఖర్‌రావుపేట గ్రామాల రైతులు ధర్నా చేశారు. నంగునూరు మండలం కొండంరాజుపల్లి సబ్‌స్టేషన్ ఎదుట రైతులు, బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. గట్లమల్యాల, కొండంరాజుపల్లి, ఘనపూర్, ఖాతా గ్రామాల రైతులు తరలివచ్చి సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 40 నిమిషాలు వేచి చూసినా ఏఈ రాకపోవడంతో ఆగ్రహించిన రైతులు సబ్‌స్టేషన్ ఆపరేటర్ నరేశ్‌ను కార్యాలయ గదిలో నిర్బంధించారు. తొగుట మండలం తుక్కాపూర్‌లోని విద్యుత్ ఏఈ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు.
రోజుకు 9 గంటల విద్యుత్తు కూడా సక్రమంగా రావడం లేదని, బోరు మోటర్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. విద్యుత్తు కోతలు, లోవోల్టేజీ సమస్యను పరిష్కరించాలని వనపర్తి జిల్లా నాచహళ్లి వద్ద పెబ్బేరు ప్రధాన రహదారిపై కిష్టగిరి, పెద్దగూడెం తండా, సవాయిగూడెం గ్రామాల రైతులు రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి కరెంట్ కష్టాల కొనితెచ్చుకున్నామని రైతులు వాపోయారు. పంటలు ఎండిపోకుండా అంతరాయం లేని విద్యుత్తు సరఫరా అందించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం నేరళ్లపల్లిలోని సబ్‌స్టేషన్‌ను రైతులు ముట్టడించారు. మహబూబ్‌నగర్ జిల్లా కౌకుంట్ల మండలం పేరూర్ సబ్‌స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. లోవోల్టేజీతో మోటర్లు కాలిపోతున్నాయని, పంటలు ఎండిపోయే దుస్థితి తలెత్తిందని అధికారులను నిలదీశారు.
పంటలకు సాగు నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపుల శివారులోని కెనాల్ వంతెనపై వంతడుపుల, రంగంపేట, తెనుగువాణిపల్లి, వల్లంపట్ల గ్రామాల రైతులు శనివారం ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రైతుల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్, బీబీపేట, గాంధారి, నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో రైతులు ధర్నాలు నిర్వహించారు. నిజాంసాగర్ మండలం మంగ్లూర్ సబ్‌స్టేషన్‌ను అన్నదాతలు ముట్టడించారు. అనంతరం సంగారెడ్డి-అకోలా-నాందేడ్ 161 జాతీయ రహదారిపై బైఠాయించారు. బీబీపేట మండల కేంద్రంలో రైతులు, బీఆర్ఎస్ నేతలు సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఏడీ సుదర్శన్‌రెడ్డిని ఆఫీస్ రూమ్‌లో నిర్బంధించారు. అక్కడి నుంచి ప్రధాన చౌరస్తాకు చేరుకొని ధర్నా చేశారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. గాంధారి మండలంలోనూ కరెంట్ కోతలను నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూ రికార్డుల మోత మోగిస్తున్నది. కానీ, విద్యుత్తు ఉత్పత్తి మాత్రం నేలచూపులు చూస్తున్నది. థర్మల్ ప్లాంట్లు పూర్తిగా నడవడం లేదు. టీజీ జెన్కోకు చెందిన ఉత్పత్తి కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు, యూనిట్ల నిలిపివేతలు గుదిబండగా మారాయి. క్లిష్ట సమయంలో కీలక యూనిట్లు తరచూ మొరాయించడంతో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) పాతాళానికి చేరింది. రాష్ట్రంలో అతిపెద్దదైన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)లో ఈ నెల 1 నుంచి 11వరకు పీఎల్ఎఫ్ 38.96% మాత్రమే. అంటే ఈ ప్లాంట్ కేవలం మూడో వంతు సామర్థ్యంతో పనిచేస్తున్నది. సాంకేతిక సమస్యలతో పలు విద్యుత్తు ఉత్పత్తి యూనిట్లు నిలిచిపోవడంతో గ్రిడ్ నిర్వహణ సమస్యగా మారుతున్నది.
కొత్తగూడెంలోని కేటీపీఎస్ స్టేజ్-7లో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. సెప్టెంబర్‌లో అక్కడ పీఎల్ఎఫ్ కేవలం 16.98 శాతానికే పరిమితమైంది. 800 మోగావాట్ల సామర్థ్యం గల ఈ ప్లాంట్ ఇంత తకువ పీఎల్‌ఎఫ్‌తో నడవడంపై విద్యుత్తు ఇంజినీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్)లో సాంకేతిక సమస్యలు ఉత్పత్తికి అవరోధంగా మారాయి. యూనిట్-3లో ఎలక్ట్రికల్ ప్రొటెక్షన్ సమస్య, యూనిట్-4లో బాయిలర్ ట్యూబ్ లీకేజీ సమస్య తలెత్తడంతో సెప్టెంబర్ 9 నుంచి ఈ రెండు యూనిట్లు నిలిచిపోయాయి. రాష్ట్రంలో మొత్తం థర్మల్ పవర్ ప్లాంట్ల సామర్థ్యం 7,180 మోగావాట్లుగా ఉన్నప్పటికీ ఈ ప్లాంట్ల నుంచి రోజుకు సగటున 100 మిలియన్ యూనిట్ల విద్యుత్తు మాత్రమే అందుతున్నది. ప్రస్తుతం విద్యుత్తు అధికారులు నడవని ప్లాంట్లను పక్కనపెట్టి నడుస్తున్న ప్లాంట్లల్లో ఉత్పత్తిని పెంచాలని చూస్తున్నారు. ప్లాంట్లవారీగా టార్గెట్లు పెట్టి ఉత్పత్తి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా మూడు, నాలుగు మిలియన్ యూనిట్లకు మించి ఉత్పత్తి పెరుగడంలేదు. ఇప్పటికే రాష్ట్రంలో రోజువారీ విద్యుత్తు వినియోగం 300 మిలియన్ యూనిట్లు దాటింది. ఇందులో సగానికిపైగా విద్యుత్తును బయటి నుంచి కొనుగోలు చేస్తున్నారు.

యాదాద్రి జిల్లా తురపల్లి సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలుపుతున్న రైతులు, బీఆర్ఎస్ నాయకులు

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మంగ్లూర్ సబ్‌స్టేషన్ ముందు బైఠాయించిన రైతులు, బీఆర్ఎస్ నేతలు

సూర్యాపేట మండలం ఎర్కారం సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన రైతులు, బీఆర్ఎస్ నాయకులు

కోతలు లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని కోరుతూ వనపర్తి జిల్లా నాచహళ్లి వద్ద పెబ్బేరు రహదారిపై బైఠాయించిన రైతులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపుల కుడి కాలువ వంతెనపై ధర్నా చేస్తున్న రైతులు

నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం నేరళ్లపల్లి సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన కర్షకులు

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కొండంరాజుపల్లి సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌ను బంధించి నిరసన తెలుపుతున్న రైతులు