హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 12(నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లక్షలాది మంది సామాన్య, మధ్యతరగతి ప్రజల నెత్తిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షల పిడుగులు కురిపించింది. శాసనసభా వేదికగా రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి రంగారెడ్డి, మేడ్చల్-మలాజిగిరి, సంగారెడ్డి జిల్లాలకు చెందిన జాబితాను వెల్లడించి, జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. రెకల కష్టం ధారబోసి దశాబ్దాల క్రితమే కొనుగోలు చేసిన ఇండ్లు, ప్లాట్లు, అపార్ట్మెంట్లపై ఒకసారిగా ప్రభుత్వం వివాదాస్పద, నిషేధిత భూములని ముద్ర వేయడంతో వేలాది కుటుంబాలు దికుతోచని స్థితిలోకి నెట్టబడ్డాయి. గతంలో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా సజావుగా కొనసాగిన రిజిస్ట్రేషన్లు, బ్యాంక్ రుణాలు, రెవెన్యూ లావాదేవీలను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటున్నదో సమాధానం చెప్పాలని ప్రజలు నిలదీస్తున్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికే దిగజారిపోగా, సామాన్యుడి ఆస్తి విలువ క్షణాల్లో ఆవిరైపోతున్నది.
కేసీఆర్ పాలనలో ఎంతో పారదర్శకంగా నడిచిన రెవెన్యూ వ్యవస్థను దెబ్బతీస్తూ, తాము తెచ్చిన ‘భూభారతి’ సరైన ఫలితాలు ఇవ్వకపోవడంతోనే ప్రభుత్వం ఈ రకమైన వివాదాలను సృష్టిస్తున్నదని స్పష్టమవుతున్నది. ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ఆంక్షల పరిధిలోకి నెట్టిన నివాస ప్రాంతాల డాటా చూస్తే కాంగ్రెస్ మారు పాలన నగరవాసులకు ఎంతటి గుబులు పుట్టిస్తున్నదో స్పష్టమవుతున్నది. రియల్ ఎస్టేట్ రంగం కేంద్రీకృతమైన హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాలను ప్రధాన లక్ష్యంగా చేసుకొని తీసుకువచ్చినట్టుగా ఉన్న నిషేధిత జాబితా అంశంపై ఐదు నెలలుగా తీవ్ర ఆందోళన కొనసాగుతూనే ఉన్నది. ఈ క్రమంలో సర్కారు చేసిన తప్పిదాలతో వేలాది మంది బాధితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ, తమ ఆస్తులను కాపాడుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. వందలాది మంది బాధితులు తమ ఆస్తులను నిషేధిత జాబితా నుంచి విడిపించాలని అధికారుల చుట్టూ ఇప్పటికీ తిరుగుతున్నారు. కానీ సర్కారు సమస్యకు పరిష్కారం చూపకుండా… 22ఏపై తీసుకునే చర్యలను ప్రస్తావించకుండా, కాలనీ వారీగా జాబితా వెల్లడించి వివాదానికి ఆజ్యం పోసింది.
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలలోని నిషేధిత జాబితాలో పెట్టినట్టుగా కాలనీల వివరాలను అసెంబ్లీ వేదికగా వెల్లడించడంతో మంటలు చెలరేగుతున్నాయి. సర్కార్ చేసిన తప్పిదానికి పరిష్కారం చూపాల్సిన చట్టసభల్లో తమ ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టినట్టుగా ప్రకటించడంపై ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఏకంగా 10,395 ఇండ్లను ఒక్క మేడ్చల్ జిల్లాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టినట్టుగా పేర్కొన్నది. ఇందులో మేడ్చల్ లోని దేవేందర్‌నగర్‌లో 1,080 ఇండ్లు, రేణుకానగర్, వినోభానగర్, తారకరామనగర్, శ్రీ సాయిరామ్‌నగర్, కృష్ణ హిల్స్, కాకతీయనగర్ సహా ఇతర 18 కాలనీల్లోని 5,118 ఇండ్లకు కాంగ్రెస్ సంకెళ్లు వేసింది. ఇక ఉప్పల్ పరిధిలోని బీజేఆర్నగర్, లక్ష్మీనరసింహకాలనీలోని 1,623 ఇండ్లు, జైపురి కాలనీలోని 574 ఇండ్లు చికుల్లో పడ్డాయి. కుత్బుల్లాపూర్ పరిధిలోని గణేశ్‌నగర్ కాలనీ 1,000, కనకదుర్గానగర్ 1,000 ఇండ్లు రెవెన్యూ ఆంక్షలతో నలిగిపోతున్నాయి.
ఏండ్ల తరబడి ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజలను యూఎల్సీ పేరిట ముంచేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో మేడ్చల్ జిల్లాలోనే దాదాపు 4,530 ఇండ్లను యూఎల్సీ పేరిట క్రయవిక్రయాలకు తావులేకుండా చేసి, ఇన్నాళ్లు తమ ఆస్తులేనని భావించిన వారికి నిండా ముంచే ఉప్పెనలా మార్చింది.
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమం పకనపెట్టి కేవలం గత ప్రభుత్వంపై బురదజల్లడమే ధ్యేయంగా పెట్టుకున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధరణి పోర్టల్ ద్వారా సామాన్యుడి భూమికి పూర్తి భద్రత కల్పించి, దళారీ వ్యవస్థను రూపుమాపిన ఘనత గత ప్రభుత్వానిది. కానీ, భూభారతి అని సరికొత్త పేర్లు పెట్టి, రికార్డులను గందరగోళంలోకి నెట్టి, చివరకు ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నగరంలోని దశాబ్దాల కాలనీలను 22-ఏ కింద వేయడం ముమ్మాటికీ ప్రజాద్రోహమే అవుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.

అసెంబ్లీ సాక్షిగా మంత్రి పొంగులేటి 22ఏ పేరిట అబద్ధాలను వల్లె వేశారు. సర్కార్ కేవలం ప్రభుత్వ భూములనే నిషేధిత జాబితాలో పెట్టలేదు. ఆ పేరిట వేలాది ప్రభుత్వ భూములను నిషేధించి, రిజిస్ట్రేషన్లు కాకుండా చేసింది. నిజానికి సర్కార్ భూములను కాపాడాలనే చిత్తశుద్ధి ఉంటే, మరీ హెచ్ఎండీఏ అనుమతులతో వేసిన లే అవుట్‌లోని ప్లాట్లను ఎలా నిషేధించారో దానికి మంత్రి సమాధానం చెప్పాలి. ఎప్పుడో వేసిన జీపీ లే అవుట్లలోని వేలాది ప్లాట్ల భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చిన అధికారులపై చర్చలు తీసుకుంటారా? లేక నిషేధిత జాబితా పేరిట అబద్ధాలు చెబుతున్న మంత్రి పొంగులేటి రాజీనామా చేస్తారా అనేది స్పష్టం చేయాలి.