‘100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామన్నాం. కానీ ఏ వంద రోజుల్లో చేస్తామో మేము చెప్పామా? ఐదేండ్లు కాదు.. 25 ఏండ్లు మేమే అధికారంలో ఉంటాం. ఎప్పుడో ఒకప్పుడు వాటిని అమలు చేస్తాం..’ రాష్ట్ర ముఖ్యమంత్రి అంతరంగంలో ఉన్నట్టుగా ఈ మాటలను పలికింది ఎవరో కాదు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి పాత్రలో తనదైన శైలిలో బీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పలికిన వ్యంగ్యోక్తులు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని చెప్పి 1,000 రోజులైనా వాటిల్లో ఏ ఒక్కటీ సక్రమంగా అమలు చేయకపోవడంపై ప్రతిపక్ష సభ్యుల పాత్రలో ఉన్నవారు అడిగిన ప్రశ్నలకు తలసాని ఇచ్చిన వ్యంగ్య సమాధానాలివి.
హైదరాబాద్, సెప్టెంబర్12 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్ వేదికగా శనివారం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ అసెంబ్లీ సాక్షిగా అధికార, విపక్ష సభ్యులుగా విడిపోయిన బీఆర్ఎస్ నేతలు నిండు అసెంబ్లీని తలపించేలా సభ నిర్వహించారు. అసెంబ్లీ అంటేనే మాటల తూటాలు.. వాదోపవాదాలు.. పాయింట్ ఆఫ్ ఆర్డర్లు.. ఆవేశపూరిత ఉపన్యాసాలు.. పరస్పర ఆరోపణలు.. సస్పెన్షన్ల పర్వాలే గుర్తొస్తాయి. కానీ ఈ ‘మాక్ అసెంబ్లీ’ మాత్రం ఒక అద్భుతమైన రాజకీయ ప్రహసనాన్ని తలపించింది. అసలైన శాసనసభను అచ్చుగుద్దినట్టు రీక్రియేట్ చేశారు. సభామధ్యలో పరిచిన పచ్చటి కార్పెట్, ఎదురుగా చెకతో చేసిన సుందరమైన పోడియంలు, వాటిపై రాజసంగా ఏర్పాటుచేసిన మంత్రులు, విపక్ష సభ్యుల నేమ్ బోర్డులు, మైకులు, వెనుక స్పీకర్ కోసం రూపొందించిన భారీ పీఠం అచ్చం అసెంబ్లీ వాతావరణాన్నే ఆవిషరించాయి.
అకడ సాగింది అసలైన చట్టసభ కాదు కానీ, రేవంత్ సరార్ మూడేండ్ల వైఫల్యాలు, కాళేశ్వరం మరమ్మతుల కపట నాటకం, కృష్ణా-గోదావరి జలాల తాకట్టు, 22-ఏ దందాలు, ఆరు గ్యారెంటీలు-420 హామీల అమలు నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తూ బీఆర్ఎస్ నేతలు నిర్వహించిన ఈ ‘మాక్ అసెంబ్లీ’ వ్యంగ్య నాటకం రక్తి కట్టించింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆహార్యాన్ని, యాసను, బాడీ లాంగ్వేజ్‌ను మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అద్భుతంగా అనుకరించగా, తలకు ఆకుపచ్చ వస్త్రంతో మిలిటరీ తరహా టోపీ చుట్టుకొని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పాత్రను అనుకరించిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ‘ప్రిపేరై రాలేదు’ అన్న మాటను పదే పదే పలికి నవ్వులు పండించారు.
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాత్రను మాజీ మంత్రి గంగుల కమలాకర్ తనదైన శైలిలో ‘మైనింగ్ అంటే మై ఎర్నింగ్.. చర్చలు, సెటిల్మెంట్లు’ అని పేరడీ చేయగా.. సభాపతి స్థానంలో స్పీకర్‌గా కొనింటి మాణిక్‌రావు గంభీరంగా ఆసీనులై ‘మీరు ముఖ్యమంత్రి మీద మాట్లాడితే మైక్ ఇవ్వను’ అంటూ సభ్యులను బెదిరించడంతో ఎదురుగా కూర్చొన్న కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి తదితరులు పొట్టచెకలయ్యేలా నవ్వుతూ కనిపించారు. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రస్తావన, పండబెట్టి తొకుతా, మూడుకాకపోతే 300 కేసులు పెడతాం.. అనే డైలాగులు మాక్ అసెంబ్లీని పీక్స్‌కు తీసుకెళ్లింది.

బాండ్‌పేపర్‌పై రాసిచ్చినం
పోడియం వద్ద మైక్ పట్టుకుని సీఎం పాత్రధారి తలసాని శ్రీనివాసయాదవ్ రంగప్రవేశం చేశారు. రేవంత్‌రెడ్డి తరహాలోనే నిలబడి ఆవేశంగా ప్రసంగం మొదలుపెట్టారు.. ‘మాకు అధికారమిచ్చింది.. ఆరు గ్యారెంటీలు మేము వంద రోజుల్లో చేస్తామని చెప్పినందుకే.. బాండ్ పేపర్ల మీద వంద రోజులనే రాసిచ్చినం కదా అధ్యక్షా! ఏ వంద రోజుల్లో చేస్తామో! చెప్పలే కదా అధ్యక్షా!’అని అనగానే సభలో నవ్వుల కేరింతలు మిన్నంటాయి. సీఎం పాత్రధారి అకడితో ఆగలేదు. ఢిల్లీ పర్యటనలు, గ్రూపు రాజకీయాల తలనొప్పులను ఏకరువు పెట్టారు..‘ఈడ మాకున్న ఇబ్బందులు మాకున్నాయి.ఢిల్లీ వాళ్లతో ఇబ్బందులూ ఉన్నాయి. మా వాళ్లతోని మా ఇబ్బందులు మాకున్నాయి. ఈడ పకన మా ఉత్తమన్న కూర్చుండు. అక్కడ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూర్చుండ్రు’ అధ్యక్షా! ఐదేండ్లు కాదు.. 25 ఏండ్లు మేమే ఉంటాం. ఎప్పుడో ఒకప్పుడు చేస్తాం’ అనడంతో ఎదురుగా కూర్చున్న కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి నవ్వు ఆపుకోలేక తలలు పట్టుకున్నారు.
ఆన్సర్ చెప్పమంటే ఎట్లా?
విపక్ష బెంచీల నుంచి సభ్యుడు జగదీశ్‌రెడ్డి నిలబడి.. నీళ్ల సబ్జెక్టు మాట్లాడి నిలదీయబోతుంటే! సీఎం తలసాని మరింత దూకుడు పెంచారు. ‘జగదీశ్‌రెడ్డి గారూ..! మీరు సబ్జెక్టు కాకుండా ఏదైనా మాట్లాడండి. మీరు సబ్జెక్టు మాట్లాడి దాని మీద ఆన్సర్ చెప్పమంటే ఎట్లా? సబ్జెక్టు కాకుండా ఏదైనా మాట్లాడుకో! మీ పార్టీ విషయం మాట్లాడుతావా? నీ ఇంటి విషయం మాట్లాడతావా? మీ ఇష్టం. మా ఇందిరాగాంధీ కట్టిందని నేను ఇంత వివరంగా చెప్పినంక కూడా మళ్లీ వచ్చి అదే చెప్తే ఎట్లా! మీరు మాట్లాడండి. లేదంటే నీ కార్యకర్తల విషయం మాట్లాడుకో! అది వదిలిపెట్టి. నేను సమస్యల విషయమే మాట్లాడుతా అంటే మరి మేమెందుకున్నాం ఈడ?’ అనడంతో.. పక్కన కూర్చున్న హరీశ్‌రావు ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుని పగలబడి నవ్వగా, ఎమ్మెల్యేలంతా బల్లలు చరిచారు.
పండబెట్టి తొక్కుతా!
విపక్ష సభ్యుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి లేచి.. ‘రాత్రికి రాత్రే వేలాది భూములను 22ఏ కింద నిషేధిత జాబితాలో పెట్టిండ్రు. అధ్యక్షా! మా నియోజకవర్గంలోనే సుమారు 30 వేల ఇండ్లు 22ఏ జాబితాలో పెట్టిండ్రు. మంత్రులు, అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిషారం కాలేదు. ముఖ్యమంత్రితో మాట్లాడుదామంటే..‘తొకుకుంటూ వచ్చా’ అని అంటున్నరు.. ప్రజలను మాత్రం తొకొద్దు’ అధ్యక్షా! అనే పంచ్‌తో కూడిన విజ్ఞప్తితో ముఖ్యమంత్రికి, రెవెన్యూ మంత్రికి ఇద్దరికీ ఒకేసారి కోపం వచ్చింది. సీఎం తలసాని లేచి ‘పండబెట్టి తొక్కుతా’ అనడంతో సభలో మళ్లీ నవ్వులు విరిశాయి.
నా ఒక్కనికే వాటా ఉన్నదా అధ్యక్షా!
రెవెన్యూ మంత్రి పొంగులేటి పాత్రలో గంగుల కమలాకర్ మైకు అందుకున్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాత్రధారి గడ్డానికి చేయి ఆనించి వింటుండగా, గంగుల తనదైన యాసతో విరుచుకుపడ్డారు. పొంగులేటి పాత్రధారి గంగుల మాట్లాడుతూ.. ‘మా ప్రభుత్వం రావడానికి మేము సంచులు మోయలేదా అధ్యక్షా! మేము కట్టలు కట్టలేదా! మరి ఇవన్నీ ఎట్లా సంపాదించుకోవాలి? విపక్ష సభ్యులు చాలామంది కూడా 22ఏ గురించి మాట్లాడిండ్రు. ఇక కేటీఆర్, హరీశ్‌రావు అయితే రాష్ట్రమంతా తిరుగుతుండ్రు అధ్యక్షా.. రాష్ట్రమంతా తిరిగి పొంగులేటినే టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుండ్రు. నా ఒకనికే ఉందా అధ్యక్షా వాటా? ఎవరికీ లేవా అధ్యక్షా అందులో వాటాలు?’ అనే సంభాషణలకు కేటీఆర్ పకకు ఒరిగి నవ్వగా..గంగుల మరింత ఉత్సాహంగా కొనసాగించారు.
‘నేను చేసింది తప్పు కాదు అధ్యక్షా.. మా ప్రభుత్వం చేసింది తప్పు కాదు. మహానుభావుడు బ్రిటీష్ పాలనలో ఉన్న ఎడ్వర్డ్ 1908లో తెచ్చిన చట్టం అధ్యక్షా! వాస్తవంగా అప్పుడు భూములన్నీ ప్రభుత్వ భూములే అధ్యక్షా.. వీళ్లకు భూములు ఎక్కడివి అధ్యక్షా? ఉన్న భూములన్నీ ప్రభుత్వ భూములే. అది మేము చెప్పలే, ఎడ్వర్డ్ గారు తెచ్చిన బ్రిటీష్ చట్టం అధ్యక్షా! దాంట్లో భాగంగా అన్నీ ప్రభుత్వ భూములే! గదే మేము 22ఏలో పెట్టినం. అయినా అధ్యక్షా! మేము పిలిచినం, ఒకొకరితో మాట్లాడినం.. ఎంక్వైరీ చేసినం.. సెటిల్మెంట్లు అయితలేవా? ఈ హైదరాబాద్ నగరంలో వేల ఎకరాలు పెద్ద పెద్ద కంపెనీల సెటిల్మెంట్ చేసినం. సెటిల్మెంట్ చేయనోళ్లు మాపైకి వచ్చిండ్రు. సెటిల్మెంట్లు చేసుకోలేనోళ్లంతా హరీశ్ రావు దగ్గరికే వెళ్లిపోతుండ్రు.’
30శాతం కమీషన్: రన్నింగ్ కామెంటరీ
పొంగులేటి పాత్రధారి గంగుల మాట్లాడుతున్న సమయంలో విపక్ష బెంచీల నుంచి 30% కమీషన్లు అంటూ కౌశిక్‌రెడ్డి రన్నింగ్ కామెంట్ చేశారు. దానికి గంగుల చిర్రుబుర్రులాడుతూ.. ‘కౌశిక్‌రెడ్డి గారు మాట్లాడినంత కాదు అధ్యక్షా. ఆయన 30 శాతం అని చాలా అబ్నార్మల్గా మాట్లాడుతుండ్రు. ఇయ్యొచ్చు.. ఎంతో కొంత ఇచ్చుకొని పోతారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో 30% కాదు అధ్యక్షా.! మేము దానికి వ్యతిరేకం. మేము ఎవరి ఇండ్లు కూలగొట్టలేదు. ధనికుల ఇండ్ల పకకు ఉన్న ఎస్సీ, ఎస్టీల ఇండ్లు, వెలుగుమట్ల పేదల ఇండ్లు మాత్రమే కూలగొట్టినం.. అది వాస్తవం అధ్యక్షా.. అంతేగానీ 22ఏ కింత ఎవ్వరి ఇండ్లు కూలగొట్టలేదు అధ్యక్షా!’ అనడంతో సభలో సభ్యులతో చప్పట్లు మోగాయి.

3 కాకుంటే 300 కేసులు పెడ్తం
విపక్ష మహిళా సభ్యురాలు సబితాఇంద్రారెడ్డి ప్రభుత్వంపై ఘూటుగా విరుచుకుపడ్డారు ‘ తెలంగాణలో ప్రజాపాలన పేరిట భయానక పాలన నడుస్తున్నది. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు రక్షణ కరువైంది. ప్రస్తుత అరాచక పరిస్థితులను చూస్తుంటే తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉన్నదా? అనే అనుమానం కలుగుతున్నది.రాఖీ కట్టించుకున్న రెండు రోజుల్లోనే బీసీ మహిళా మంత్రి గొంతు పిసికారు. కేసీఆర్ ఇంటిపై దాడికి ఎస్కార్ట్‌తో ఎలా పంపిస్తారు. ఈ ఘటనకు బాధ్యతగా సీఎం క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. మరో విపక్ష మహిళా సభ్యురాలు సునీతాలక్ష్మారెడ్డి లేచి.. ‘మాపై జరిగిన దాడి.. యావత్తు తెలంగాణ మహిళా సమాజంపై జరిగిన దాడి.. కాంగ్రెస్ మహిళా డిక్లరేషన్ పేరిట కొండంతా హామీలిచ్చి దగా చేసింది. మహిళలను కోటిశ్వరులను చేస్తామని మోసం చేసింది. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉన్నదా? అని విరుచుకుపడ్డారు.
సీఎం పాత్రలో ఉన్న తలసాని వివరణ ఇస్తూ.. ‘గౌరవ మా సబితక, సునీతక అసలు మేమేం చేస్తలేనట్టు.. వాళ్లిప్పుడు చెప్పిన దాంట్లో కేసులే పెట్టనట్టు మాట్లాడుతున్నరు. మొన్ననే కదా అధ్యక్షా! హరీశ్‌రావు, కేటీఆర్ మీద కేసులు పెట్టింది? విచిత్రంగా ఉంది అధ్యక్షా! అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ బయట కొన్ని వందలాది మంది సమక్షంలో వాళ్లమీద కేసులు పెట్టలేదా అధ్యక్షా? నేను హోమ్‌మంత్రిగా, సీఎంగా పనిచేస్తలేనట్టు..’ అని ఇంకేదో మాట్లాడబోతుండగా.. ‘ఒక కేసే, మూడు ఎఫ్ఐఆర్లు’ అంటూ సభ్యులు రన్నింగ్ కామెంట్రీ చేస్తూ సీఎంకు అడ్డుతగిలారు. ‘అరె మూడు కాకపోతే 300 చేస్తాం’ అంటూ సీఎం చిందులు తొక్కారు.
మళ్లీ సబ్జెక్ట్‌లోకి వచ్చిన సీఎం..‘సబితక.. మీరంటే గౌరవం అకా. మా సునీతక అంటే గౌరవం. మళ్లీ మీరివన్నీ అడుగుతారనే మిమ్మల్ని సస్పెండ్ చేసింది! మా ప్లాన్ ఏమో వేరే, మీరు అనుకుంటున్నది ఇంకోటి. మేము ఆల్రెడీ ప్లాన్ ప్రకారమే మిమ్మల్ని హౌస్‌లోకి రాకుండా చేసినం. ఊరికే మాట్లాడితే ఆడ ఊర్లళ్లకు పోయి బంగారం బంగారం అంటారు. ప్రధానమంత్రికి పోయి చెప్పండి ఎందుకు కొనొద్దన్నరో! రెండు రోజులు మీరే అంటారు ఇప్పుడు ‘దొంగలు పడి ఎత్తుకపోతున్నారు అని’.. మరి ఇచ్చిన బంగారం ఎత్తుకపోతే మళ్లీ ఎవరు కొనియ్యాలే’ అని అనడంతో సభ్యులు కడుపుబ్బా నివ్విండ్రు.
‘ఆ బీసీ మంత్రి బిడ్డ, భర్త అంటే నేనేం చేయాలి అధ్యక్షా? ఏకంగా ముఖ్యమంత్రినైన నా గురించి మాట్లాడితే ఊకోవాల్నా? ఇప్పుడు క్యాబినెట్లో వేరేవాళ్లు లేరా అధ్యక్షా? వాళ్లను మాట్లాడకుండా నా గురించే మాట్లాడింది! అందుకే ఢిల్లీకి పోయి తొకనా? ఢిల్లీకి పోయి మూడు రోజులు ఆడ ఉండి తొకే వచ్చిన కదా నేను!’ అనడంతో సభలో నవ్వులు చిందాయి.
విద్యుత్తుపై చర్చ.. పవర్ కట్
విపక్ష సభ్యుడు వేముల ప్రశాంత్‌రెడ్డి వంతు వచ్చింది. ‘రైతులు విద్యుత్తు కోసం ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్షా! పరిశ్రమలకు పవర్ హాలిడే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ హయాంలో 24 గంటల విద్యుత్తు అందించారు. విద్యుత్తు రంగంపై కేసీఆర్ ప్రభుత్వం భారీగా ఖర్చు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ రాష్ట్రాన్ని చీకటి రోజుల్లోకి తీసుకెళ్తున్నది.. అంటుండగానే సభలో కరెంటు పోయింది. దీంతో సభ్యులు ముఖ్యమంత్రి దిక్కు చూస్తూ..‘సేమ్.. సేమ్’ అంటూ రన్నింగ్ కామెంట్రీ చేశారు.

సబ్జెక్టు ప్రిపేరై రాలే..
ఆకుపచ్చ రుమాలును మిలిటరీ టోపీలా చుట్టుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పాత్రధారి పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేతిలో కాగితాలు పట్టుకొని లేచారు.‘సబ్జెక్ట్ ప్రిపేరై సభకు రాలేదు. మిలిటరీలో పనిచేసి వచ్చిన. నా డిసిప్లిన్ నాకున్నది అధ్యక్షా! ఇవాళ కాళేశ్వరం దగ్గర ఎకడెకడ ఇసుక తోడాలో మా ఆదిత్యానాథ్ దాస్ గారు, మా ముఖ్యమంత్రి గారు ఎట్లజెప్తే అట్లనే మొత్తం కూడా అన్ని రిజర్వాయర్ల దగ్గర కూడా ఇసుక తోడే కార్యక్రమం చాలా డిసిప్లిన్‌గా చేస్తున్నం అధ్యక్షా! మా ఆదిత్యానాథ్‌దాస్ గారు, మా ముఖ్యమంత్రి గారు చెప్పింది డిసిప్లేన్‌గా చేసినమా? లేదా? అది ముఖ్యం అధ్యక్షా! I want to make it very clear.
నాకు ప్రిపరేషన్ ఉండకపోవచ్చు.. మా ముఖ్యమంత్రికి డెడికేషన్ ఉండకపోవచ్చు! కానీ మా అడ్వైజర్ ఆదిత్యానాథ్ దాస్ గారు ఎకడ సంతకం పెట్టమంటే ఆడ పెడుతాం.. మా చంద్రబాబు గారి డైరెక్షన్లో ఏం చేయమంటే అది చేస్తాం అధ్యక్షా? మా ప్రభుత్వం ఎట్ల వచ్చింది అధ్యక్షా? చంద్రబాబు గారి సపోర్టు వల్లే కదా. వారి సోషల్ మీడియానే కదా. వారి పైసలే కదా.. ఇయ్యాల ఏమన్నా అవసరముంటే కూడా మోదీ దగ్గరకు పోయి మాట్లాడి మమ్మల్ని రక్షించేది వారే కదా? వాళ్లను వదిలిపెట్టి మీరు చెప్పింది మేము చేయమంటారా? ఎట్టి పరిస్థితుల్లో చేయం’ అంటూ ఉత్తమ్‌లా పల్లా హావభావాలు పలికారు.
ఆ వెంటనే నీళ్ల లెకలపై విరుచుకుపడుతూ..
బీఆర్ఎస్ వాళ్లు ఎప్పుడూ క్యూసెకులు.. టీఎంసీలు అని వెంట పడుతురు.. ఇదేందధ్యక్షా? బ్యాంకు చెకులంటే నాకు అర్థమైతది. కానీ క్యూసెకులు ఇవన్నీ నాకర్థం కావు అధ్యక్షా! ఊ అంటే కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్, ఆ బేసిన్ ఈ బేసిన్.. ఈ బాసన్లేంది? బేసిన్లేంది? సీడబ్ల్యూసీ సమావేశం అంటే కాంగ్రెస్ సమావేశం అనుకున్నా.. సెంట్రల్ వాటర్ కమిషన్ అని తెలియదు’ అని కాంగ్రెస్‌పై పంచ్ వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చంద్రబాబు కారణమంటూ మరో రాజకీయ వ్యంగ్యాన్ని జోడించారు. ‘కర్ణాటకలో 40 శాతం కమిషన్ అయితే.. తెలంగాణలో 30 శాతం తీసుకొంటే తప్పేంటి?’ అని అనడంతో చేతుల్లో ముఖం పెట్టుకొని హరీశ్‌రావు పగలబడి నవ్వడం కనిపించింది.
భూముల ధర పెంచాలి.. పంచాలి
విపక్ష సభ్యుడు కేపీ వివేకానంద, చింతా ప్రభాకర్ తదితరులు పరిశ్రమల ప్రస్తావన తేవండంతో సీఎం పాత్రలో ఉన్న తలసాని లేచి మైకు అందుకున్నారు. ‘అదే ఐటీ ఇండస్ట్రీ పెడితే ఏమొస్తది? ఆ ఇండస్ట్రీస్ పెడితే ఏం వస్తదో తెలుసా అధ్యక్షా? పకన కోకాపేట్, శంకరపల్లి, లింగంపల్లి, గండిపేట్‌లో అడుగండి అధ్యక్షా నా గురించి! రియల్ ఎస్టేట్ నేనెంత గొప్పగా చేసిన్నో? ఆ విలువైన భూములను వదిలిపెట్టి, నా దందా బంద్ చేసి, ఆయనేమో ఐటీ అంటడు.
ఇండస్ట్రీస్ అంటడేంది అధ్యక్షా ఇది? ఎకడికి పోతున్నం మనం? ఇంత పెద్ద వ్యాపారాన్ని వదిలిపెట్టి.. కావాలంటే నా గురించి గండిపేట, నార్సింగిలో అడుగండి అధ్యక్షా! నేనెంత పెద్ద బిజినెస్ చేసినో.. ఇవన్నీ వదిలిపెట్టి నేనేదో సమాజసేవ చేద్దామని ఈడికొస్తే మళ్లా పాత కథ.. ఆ మాత్రం తెలువకపోతే ఎట్లా అధ్యక్షా? దయచేసి భూముల ధరలు ఎట్లా పెంచాలి? ఆ భూములను ఏ విధంగా పంచాలి? ఆ భూములను ఏ విధంగా మావాళ్లకియ్యాలనే విషయం మాట్లాడుమనండి! ఇండస్ట్రీ, ఐటీ ఎవరికి కావాలధ్యక్షా ఇవన్నీ?’ అని అనడంతో సభలో డెసుల మీద దరువులు, కరతాళ ధ్వనులు మిన్నంటాయి.
పాత్రధారులకు అభినందనలు
స్పీకర్ సభను టీ విరామం కోసం వాయిదా వేయగానే అసలైన ఆత్మీయ దృశ్యం ఆవిష్కృతమైంది. నాటకం ఆగిపోయి సభ్యులంతా తమ తమ డెసుల వద్ద నుంచి లేచి హాలు మధ్యలోకి వచ్చారు. సీఎం పాత్రను రక్తికట్టించిన తలసాని శ్రీనివాసయాదవ్ నవ్వుకుంటూ ముందుకు రాగానే కేటీఆర్ ఎదురెళ్లి రెండు చేతులు పట్టుకొని నవ్వుతూ షేక్‌హ్యాండ్ ఇచ్చి భుజం తట్టారు. పకనే ఉన్న హరీశ్ రావు, జగదీశ్‌రెడ్డి, విపక్ష సభ్యుడు అనిల్‌జాదవ్, బాల సుమన్, దాసోజు శ్రవణ్ ముఖాల్లో చిరునవ్వులు విరిశాయి.
మిలిటరీ టోపీతో అలరించిన పల్లాను, 22ఏ పంచ్‌లతో అదరగొట్టిన గంగుల కమలాకర్‌ను ఇతర ఎమ్మెల్యేలు చుట్టుముట్టి చేతులు కలిపి అభినందించారు. కొందరు నాయకులు తమ స్మార్ట్ఫోన్లతో ఆ క్షణాలను రికార్డ్ చేస్తూ, సెల్ఫీలు తీసుకుంటూ సంబురపడ్డారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూనే, పరస్పరం హాస్యభరిత వాతావరణంలో మునిగిపోయిన ఈ ‘టీ బ్రేక్’ సన్నివేశం మాక్ అసెంబ్లీకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఉద్యోగాలిస్తానన్న రాహుల్‌ను అడగండి
విపక్ష బెంచీల నుంచి సభ్యులు డాక్టర్ సంజయ్ లేచి కాగితం చూపిస్తూ..‘దాశరథి ఎకడ పుట్టారు అంటే నిజామాబాద్ అంటారు.. విమానం ఎకడ తయారవుతుంది అంటే దిల్‌సుఖ్‌నగర్‌లో అంటారు.. అన్నిటికంటే విచిత్రం ఏమిటో చెప్తా అధ్యక్షా! ముఖ్యమంత్రి గారు ఇప్పటికి మూడుసార్లు భాక్రానంగల్ తెలంగాణలో ఉన్నదన్నారు. రెండు లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రే ఇలా ఉంటే ఉద్యోగాలెలా వస్తాయి అధ్యక్షా?.. అని ఇంకేదో మాట్లాడబోతుండగానే.. స్పీకర్ కొనింటి మాణిక్‌రావు బెల్ మోగిస్తూ.. ‘మీరు ముఖ్యమంత్రి మీద మాట్లాడితే మైక్ ఇవ్వను’ అని మైక్ కట్ చేయటంతో సభలో నవ్వులు విరిశాయి. సంజయ్ ఉద్యోగాల మాట ఎత్తడంతో సీఎం పాత్రధారి తలసానికి కోపమొచ్చింది. సీరియస్‌గా లేచి.. ‘అశోక్‌నగర్‌లో నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని చెప్పింది నేనా అధ్యక్షా? ఎన్నికల ముందు ఉద్యోగాలిస్తామని చెప్పింది నేనా? మా రాహుల్‌గాంధీ చెప్పిండు.. ఆయనను పోయి అడగండి’ అనడంతోనే సభ్యులంతా ఒక్కసారిగా గొల్లున నవ్వారు.
ఏరోప్లేన్ దిల్‌సుఖ్‌నగర్‌లో తయారైతది
సీఎం పాత్రధారి ఏరోస్పేస్ కంపెనీల వివాదంపై మాట్లాడుతూ..‘ఏరోస్పేస్.. ఏరోప్లేన్ ఏడ తయారైతది అంటే దిల్సుఖ్నగర్ల? మనకాడ కాకపోతే ఏడైతది? మీ ఇంటికాడ అయితదా? మీ కోరుట్లల అయితదా? నాకున్న పరిజ్ఞానంతోనే మావాళ్లు చెప్పిన అంశాలనే నేను చెప్తున్న అధ్యక్షా! హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకొని నేనేదో నేర్చుకొని మీకేదో నేర్పిద్దామంటే? ఇక మళ్లీ నా పాత భాషనే పేగులు మెడల.. ఇగ అవి స్టార్ట్ చేయాల్నా మళ్లీ? అని సీఎం అనగానే.. సభ్యులు ‘వద్దు..వద్దు’ అంటూ గట్టిగా అరవడంతో సీఎం శాంతించారు.

ప్రజా సమస్యలపై రాజీలేని పోరు.. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 12(నమస్తే తెలంగాణ): ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. శాసనసభ నుంచి అన్యాయంగా తమ సభ్యులను పాలకపక్షం సస్పెండ్ చేసి తమ గొంతు నొకే ప్రయత్నం చేసిందని ఎక్స్ వేదికగా విమర్శించారు. సభలో మాట్లాడే అవకాశం నిరాకరించినప్పటికీ శనివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన ‘మాక్ అసెంబ్లీ’ ద్వారా తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజాగళాన్ని సమర్థవంతంగా వినిపించారని పేరొన్నారు.
మాక్ అసెంబ్లీలో ఉత్సాహంగా పాల్గొన్న బీఆర్ఎస్ శాసనసభ్యులు, నాయకుల పోరాట పటిమను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోని వైఫల్యాలను, ప్రజావ్యతిరేక విధానాలను ఈ వేదిక ద్వారా సమర్థవంతంగా ఎండగట్టిన తీరును ఆయన కొనియాడారు. సస్పెన్షన్లతో తమ పోరాటాన్ని ఆపలేరని, ప్రజాసంక్షేమం, హకుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అగ్రభాగాన నిలబడి పోరాడుతుందని స్పష్టంచేశారు.