Spam Calls : అనవసర స్పామ్ కాల్స్ (Spam Calls) తో మీరు విసిగిపోయారా..? మీరు బిజీగా ఉన్న సమయంలో స్పామ్ కాల్స్ డిస్టర్బ్ చేస్తున్నాయి. ఇకపై ఆ సమస్య ఉండదు. ఎందుకంటే ఈ స్పామ్ కాల్స్‌తో విసిగిపోతున్న మొబైల్ వినియోగదారుల (Mobile Users) కు ఊరటనిచ్చేలా టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందకపోయినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత సాయంతో స్పామ్ కాల్స్‌కు అడ్డుకట్ట వేయాలని టెలికామ్ సంస్థల (Telecom Companies) ను ఆదేశించింది.
ఈ మేరకు ‘టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్’ లో నూతన నిబంధనలను పొందుపరిచింది. కొత్త నిబంధనల ప్రకారం.. టెలికామ్ కంపెనీలు తమ ఏఐ లేదా మెషీన్ లెర్నింగ్ వ్యవస్థల ద్వారా ఏదైనా కాల్‌ను స్పామ్‌గా గుర్తిస్తే.. ఆ సమాచారాన్ని రెండు గంటల్లోపు సంబంధిత ఆపరేటర్‌కు నివేదించాలి. సదరు ఆపరేటర్ ఒక వర్కింగ్ డే వ్యవధిలో ఆ నంబర్‌కు సంబంధించిన కేవైసీ వివరాలను సేకరించి, ఇతర టెలికామ్ సంస్థలతో పంచుకోవాలి. గడిచిన 10 రోజుల్లో ఒకే వ్యక్తి లేదా సంస్థకు చెందిన ఐదు కంటే ఎక్కువ నెంబర్లు స్పామ్‌గా నమోదైతే అన్ని టెలికామ్ సంస్థలు సమన్వయంతో కఠిన చర్యలు చేపడతాయి.
స్పామర్లపై కఠిన చర్యలను కూడా ట్రాయ్ ప్రతిపాదించింది. ఏఐ విశ్లేషణలో మొదటిసారి స్పామర్‌గా నిర్ధారణ అయితే సదరు వ్యక్తి పేరిట ఉన్న అన్ని కనెక్షన్లపై 15 రోజులపాటు అవుట్గోయింగ్ సేవలను నిలిపివేస్తారు. నిబంధనలను అతిక్రమిస్తూ మళ్లీ అదే తప్పు చేస్తే ఆ నెంబర్లను ఏడాదిపాటు బ్లాక్‌లిస్ట్‌లో ఉంచుతారు. అటువంటి వారికి ఏ టెలికామ్ సంస్థ కూడా కొత్త కనెక్షన్లను జారీ చేయదు. వినియోగదారుల సౌలభ్యం కోసం మరికొన్ని మార్పులను కూడా ట్రాయ్ సూచించింది.