కాశీబుగ్గ, మార్చి 2 : వరంగల్లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రధాన కార్యాలయం వద్ద సోమవారం ఉదయం 8 గంటలకు అడ్తి వ్యాపారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పోలీసులు వేధింపులు మానుకోవాలని నినదించారు. దీంతో మార్కెట్లో రెండు గంటల పాటు వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు నిలిచిపోగా, ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చాంబర్ పరిధిలోని సూర్యతేజ అడ్తి వ్యాపారి కొడిమల్ల కుమారస్వామి జయశంకర్భూపాలపల్లి జిల్లా గిద్దెముత్తారం గ్రామానికి చెందిన రాజునాయక్కు రూ.50 వేలు వ్యవసాయ పెట్టుబడికి అప్పుగా ఇచ్చాడు.
దీంతో అతడు సూర్యతేజ అడ్తిద్వారా ఒకసారి 8 బస్తాలు, మరో మూడుసార్లు 7, 5, 3 బస్తాల చొప్పున విక్రయించాడు. ఇటీవల భూపాలపల్లి జిల్ల్లా పరిధిలో మిర్చి బస్తాలను రాజునాయక్ చోరీ చేసి అమ్మినట్లు తేలడంతో అతడిపై కేసు నమోదు కాగా పోలీసుల విచారణలో సూర్యతేజ అడ్తి ద్వారా అమ్మినట్లు వెల్లడైంది. దీంతో పోలీసులు సంబంధిత అడ్తి వ్యాపారిని వేధింపులకు గురి చేస్తున్నారని రవీందర్రెడ్డి తెలిపారు. దీనిపై తాను డీఎంవో, మార్కెట్ సెక్రటరీ పోలీసులకు ఫోన్ చేసినా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. తాము లైసెన్స్ తీసుకొని వ్యాపారం చేస్తున్నామని, రైతుల సరుకును మార్కెట్ అధికారులు నిర్ధారిస్తే తాము సులువుగా విక్రయిస్తామన్నారు. రైతులు తెచ్చిన సరుకు అసలుదా? లేక దొంగదా? అనేది తాము నిర్ధారించలేమన్నారు.
పోలీసుల వేధింపుల నుంచి అడ్తి వ్యాపారులను రక్షించాలని ఆయన కోరారు. దీనిపై జిల్లా మార్కెటింగ్ అధికారి కలకోట సురేఖ, ఎనుమాముల మార్కెట్ కార్యదర్శి మల్లేశం స్పందించి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీభాయి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన వారు సంబంధిత పోలీసు అధికారిపై చర్యలు తీసుకొని మార్కెట్ బైలా ప్రకారం అడ్తి వ్యాపారికి ఎలాంటి సంబంధం లేకుండా చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం ఉదయం 10 గంటలకు వ్యాపారులు ధరలు నిర్ణయించి కాంటాలు నిర్వహించారు. దీంతో రెండు గంటలకు పైగా కాంటాలు ఆలస్యం కావడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు.