తిరువనంతపురం: ఒక వ్యక్తి తన స్నేహితుడి వద్ద రూ.1,000 అప్పుగా తీసుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఎలాంటి సంప్రదింపులు లేకపోవడంతో ఆ డబ్బు తిరిగి ఇవ్వలేకపోయాడు. 35 ఏళ్ల తర్వాత స్నేహితుడి అడ్రస్ తెలుసుకుని అతడి ఇంటికి వెళ్లి వడ్డీతో సహా తిరిగి చెల్లించాడు. (Kerala Man Returns Money) కేరళకు చెందిన ఇస్మాయిల్ 1991లో సౌదీ అరేబియాలోని అబ్కైక్లో పని చేశాడు. లచ్చన్నతో పాటు మరో ముగ్గురితో కలిసి అతడు నివసించాడు. సుమారు ఐదేళ్లు వారంతా కలిసి ఉన్నారు.
కాగా, సహోద్యోగి, స్నేహితుడైన లచ్చన్న నుంచి ఇస్మాయిల్ 120 సౌదీ రియాల్స్ (నాడు రూ.1,000 విలువ) అప్పుగా తీసుకున్నాడు. తనకు వీలైనప్పుడు ఆ డబ్బు తిరిగి చెల్లిస్తానని అతడు మాట ఇచ్చాడు. ఆ తర్వాత కొంత కాలానికి లచ్చన్న భారత్‌కు తిరిగి వచ్చాడు. అప్పట్లో మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా అందుబాటులో లేకపోవడంతో వారిద్దరి మధ్య సంబంధం తెగిపోయింది. కొంత కాలానికి ఇస్మాయిల్ కూడా కేరళకు తిరిగి చేరుకున్నాడు.
మరోవైపు లచ్చన్న నుంచి ఇస్మాయిల్ తీసుకున్న వెయ్యి పెద్ద మొత్తం కానప్పటికీ ఇచ్చిన మాట మేరకు తిరిగి ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అయితే లచ్చన్న వివరాలు తెలియకపోవడంతో వెంటనే సాధ్యం కాలేదు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురికి లచ్చన్న చెందినవాడన్న విషయం మాత్రమే ఇస్మాయిల్‌కు గుర్తుంది. దీంతో ధర్మపురి గురించి ఆన్లైన్లో సమాచారం తెలుసుకున్నాడు. ఆ ఊరికి చేరుకున్న తర్వాత లచ్చన్న గురించి స్థానికులను ఆరా తీశాడు.

Ismail Meets Lachanna Family
చివరకు జూలై 9న ఇస్మాయిల్ అన్వేషణ ఫలించింది. లచ్చన్న ఇంటి అడ్రస్ తెలుసుకుని అక్కడకు వెళ్లాడు. లచ్చన్న గల్ఫ్ దేశంలో పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్నాడు. వారి మొబైల్ ఫోన్ నుంచి వాట్పాప్ కాల్లో తన పాత స్నేహితుడితో ఇస్మాయిల్ మాట్లాడాడు. అంతేగాక 35 ఏళ్ల కిందట తీసుకున్న రూ.1000కి వడ్డీతో కలిపి మొత్తం రూ.25,000 లచ్చన్న కుటుంబానికి అందజేశాడు.
అయితే ఇస్మాయిల్ చాలా నిజాయితీపరుడని, మంచి మనసున్న మనిషని లచ్చన్న కొనియాడాడు. 35 ఏళ్ల కిందట తన నుంచి అప్పుగా తీసుకున్న సుమారు వెయ్యికి వడ్డీ కలిపి రూ.25,000 తిరిగి ఇవ్వడం పట్ల ఆశ్చర్యపోయినట్లు చెప్పాడు. ఇన్ని ఏళ్ల తర్వాత కూడా మాట నిలబెట్టుకున్నందుకు ఇస్మాయిల్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు. తమ మధ్య ఉన్న స్నేహ బంధానికి ఇది నిదర్శమని లచ్చన్న ప్రశంసించాడు.