ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయంలో ఏటా రూ.18 కోట్ల విరాళాలు చోరీ అవుతున్నాయని ఆరోపించారు. (Raj Thackeray) అయోధ్యలోని రామమందిరంలో రూ. 1,400 కోట్లు అపహరణకు గురయ్యాయని ఆయన అన్నారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. శనివారం పార్టీ విద్యార్థి విభాగం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్ ఠాక్రే మాట్లాడారు. ఈ రోజుల్లో ఆలయాలు కూడా సురక్షితంగా లేవని అన్నారు. ‘నిరాశకు గురైన యువత ఆలయాలను సందర్శిస్తుంటారు. కానీ అవినీతి నుంచి ఆలయాలు కూడా తప్పించుకోలేకపోతున్నాయి’ అని విమర్శించారు.
కాగా, ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయం గురించి రాజ్ ఠాక్రే ప్రస్తావించారు. ట్రస్టీల అప్రమత్తత కారణంగానే విరాళాల పెట్టె నుంచి డబ్బు కాజేసిన కొందరు ఉద్యోగులు పట్టుబడ్డారని తెలిపారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు ఎనిమిది మంది ట్రస్టీలు రాసిన లేఖను ఆయన చదివి వినిపించారు. దొంగతనం బయటపడకముందు ఆలయానికి వచ్చే వారపు విరాళాల ఆదాయం రూ. 50 లక్షల కంటే తక్కువగా ఉండేదని, ఆ తర్వాత అది రూ. 1.5 కోట్లకు పెరిగిందని ఆయన తెలిపారు. ‘ప్రతి ఏటా రూ. 18 కోట్లు అపహరణకు గురవుతున్నాయి’ అని రాజ్ ఠాక్రే ఆరోపించారు.
మరోవైపు విరాళాల చోరీ కేసులో తొమ్మిది మంది ఉద్యోగులు అరెస్టైనట్లు సిద్ధి వినాయక ఆలయ ట్రస్ట్ చైర్మన్, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నేత సదా సర్వంకర్ తెలిపారు. అవసరమైన చోటల్లా కేసులు నమోదు చేసినట్లు మీడియాతో అన్నారు. ట్రస్ట్ తీసుకున్న చర్యల వల్ల విరాళాలు పెరిగాయని చెప్పారు. ఆలయ ఆదాయం రెండేళ్ల క్రితం ఉన్న రూ. 114 కోట్ల నుంచి రూ.182 కోట్లకు పెరిగిందని వివరించారు.