సంగీత సామ్రాజ్ఞి, భారతరత్న ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవిత కథతో రూపొందిస్తున్న ‘భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి’ చిత్రం బుధవారం చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు అగ్ర నటుడు కమల్‌హాసన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి టైటిల్ పాత్రధారిణి రష్మిక మందన్నపై క్లాప్‌నిచ్చారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేష్, బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా కమల్‌హాసన్ మాట్లాడుతూ ‘తన సంగీతంతో దేశాన్ని ఏకం చేసిన మహోన్నత కళాకారిణి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి. ఆమె సంగీతమే మనకు గొప్ప సందేశం.
అమ్మ ఆలపించిన సుప్రభాతం, లలిత సహస్రనామం, రంగపుర విహార పాటలు వింటే మనసు పులకించిపోతుంది. మహాత్మాగాంధీ కూడా ఎం.ఎస్.సుబ్బులక్ష్మి అభిమానే’ అన్నారు. ఈ సినిమా ద్వారా ఈతరం వారికి గొప్ప సందేశాన్ని ఇవ్వబోతున్నామని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెలిపారు. ఈ సినిమా కోసం దర్శకుడు ఏడాది కాలంగా పరిశోధన చేశారని, దక్షిణ భారతదేశంలోని నాలుగు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని అల్లు అరవింద్ చెప్పారు. ఇంత గొప్ప పాత్రను పోషించే అవకాశం రావడంతో మనసు కృతజ్ఞతతో నిండిపోయిందని కథానాయిక రష్మిక మందన్న పేర్కొన్నది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్నందిస్తున్నారు.