హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ద్రవ్యోల్బణం ఇప్పటికీ ఆందోళనకర స్థాయిలోనే ఉన్నది. నిరుడు జూన్‌లో మైనస్ 0.93 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది జూన్‌లో ఏకంగా 6.36 శాతానికి ఎగబాకింది. ఆ తర్వాత స్వల్పంగా తగ్గి జూలైలో 6.32 శాతానికి, ఆగస్టులో 6.27 శాతానికి చేరింది. ఇది జాతీయ సగటు (4.82 శాతం) కంటే 1.45% అధికం. దీంతో 50 లక్షలకుపైగా జనాభాను కలిగి ఉండి ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న ప్రధాన రాష్ర్టాల్లో తెలంగాణ వరుసగా ఏడో నెలలోనూ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్ (5.55%), ఆంధ్రప్రదేశ్ (5.53%), ఒడిశా (5.52%), రాజస్థాన్ (5.24%), కర్ణాటక (5.23%) ఉన్నాయి.
జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) తాజాగా విడుదల చేసిన ప్రాథమిక వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) గణాంకాల ప్రకారం తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో గత నెల ద్రవ్యోల్బణం 6.79 శాతంగా నమోదైంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా గ్రామీణ ద్రవ్యోల్బణం 5.23 శాతం మాత్రమే ఉన్నది. పట్టణ ప్రాంతాల్లోనూ పరిస్థితి భిన్నంగా ఏమీలేదు. ఆగస్టులో జాతీయ సగటు అర్బన్ ద్రవ్యోల్బణం 4.31 శాతంగా, తెలంగాణలో 5.88 శాతంగా నమోదైంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ధరల పెరుగుదల అధికంగా ఉన్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఆహార ధరలపై ప్రభావం
జాతీయ స్థాయిలో గత నెల ఆహార ద్రవ్యోల్బణం 5.95 శాతంగా నమోదైంది. మొత్తంగా తెలంగాణలో రిటైల్ ద్రవ్యోల్బణం జాతీయ సగటు కంటే చాలా అధికంగా ఉండటంతో ధరల పెరుగుదల మరింత ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నది. ముఖ్యంగా రాష్ట్రంలో ఆహారం, రోజువారీ వినియోగ వస్తువుల ధరలు పెరగడం కుటుంబాలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. నిరుటితో పోలిస్తే ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్నది. రాష్ట్రంలో నిరుడు జూన్‌లో ద్రవ్యోల్బణం మైనస్ 0.93 శాతానికి పడిపోయింది. ఆ తర్వాత కూడా కొన్ని నెలలపాటు ప్రతికూల రేట్లు నమోదయ్యాయి. అప్పట్లో ఆహారం, కూరగాయల ధరలు తగ్గడం, అనుకూలమైన బేస్ ఎఫెక్ట్, హైదరాబాద్ వెలుపల గ్రామీణ వినియోగం బలహీనంగా ఉండటం వంటి అంశాలు ప్రతికూల ద్రవ్యోల్బణానికి కారణాలుగా పేర్కొన్నారు. దీర్ఘకాలంపాటు ధరల తగ్గుదల వినియోగ డిమాండ్‌ను బలహీనపరచడంతోపాటు పెట్టుబడులు, రాష్ట్ర పన్ను ఆదాయాలపైనా ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఆర్థికవేత్తలు హెచ్చరించారు.
2026లో ఒకసారిగా పెరిగిన ధరలు
ఈ ఏడాది రాష్ట్ర పరిస్థితి వేగంగా మారిపోయింది. రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 5.81 శాతానికి, మేలో 6.15 శాతం, జూన్ లో 6.36 శాతానికి పెరిగింది. ఆ తర్వాత స్వల్పంగా తగ్గి జూలైలో 6.32 శాతానికి, ఆగస్టులో 6.27 శాతానికి చేరింది. ప్రస్తుత గణాంకాలను గత సంవత్సరాల గణాంకాలతో పోల్చేటప్పుడు కొత్త సీపీఐ సిరీస్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నది.
2026-27లో తెలంగాణ రిటైల్ ద్రవ్యోల్బణం
నెల : ద్రవ్యోల్బణం
ఏప్రిల్ : 5.81%
మే : 6.15%
జూన్ : 6.36%
జూలై : 6.32%
ఆగస్టు : 6.27%
ఆగస్టులో ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న రాష్ర్టాలు
రాష్ట్రం : ద్రవ్యోల్బణం
తెలంగాణ : 6.27%
తమిళనాడు : 5.92%
మధ్యప్రదేశ్ : 5.55%
ఆంధ్రప్రదేశ్ : 5.53%
ఒడిశా : 5.52%
రాజస్థాన్ : 5.24%
కర్ణాటక : 5.23%