న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: అంతర్జాతీయ జలాల్లో భారత నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకను పాకిస్థానీ నౌకాదళ నౌక ఢీకొంది. ఈ ఘటన దరిమిలా ఢిల్లీలోని అత్యున్నత దౌత్యాధికారిని భారత ప్రభుత్వం పిలిపించింది. కాగా భారత యుద్ధనౌకకు ఎలాంటి నిర్మాణపరమైన నష్టం జరగడం గానీ నౌకలోని సిబ్బంది గాయపడడం గానీ జరగలేదు. పాక్ నౌకాదళాల ఆమోదయోగ్యం కాని, వృత్తివిరుద్ధ ప్రవర్తన కారణంగానే ఈ ఘటన జరిగినట్టు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో విమర్శించింది.
అరేబియా సముద్రంలో ఇది రెండో ఘటన.ఏడెన్ గల్ఫ్ సమీపంలో సముద్రపు దొంగల నిరోధక, నిఘా మిషన్ల కోసం మోహరించిన భారత నౌకాదళ ఆస్తులకు పాక్ యుద్ధ నౌకలు అత్యంత సమీపంలో ప్రమాదకరమైన విన్యాసాలకు ప్రయత్నించినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. భారత యుద్ధనౌక సాధారణ నిఘా విధుల్లో ఉండగా పీఎన్ఎస్ హువైన్ అనే ఆఫ్షోర్ గస్తీ నౌక దానిని వెంబడించింది. ప్రమాద సంకేతాలను తెలియచేయడానికి ఉపయోగించే చానల్ 16(సముద్ర రేడియో చానెల్) ద్వారా పదేపదే హెచ్చరికలు జారీచేసినట్టు వర్గాలు తెలిపాయి.
అయినప్పటికీ పాకిస్థానీ నౌక అకస్మాత్తుగా వేగం పెంచి భారత యుద్ధనౌక ముందు భాగాన్ని కుడి వైపు నుంచి నేరుగా ఢీకొట్టింది. చివరికి పాక్ నౌక ముందు భాగం భారత యుద్ధనౌకను తాకిందని వర్గాలు వివరించాయి. భారత్ వైపు ఎటువంటి నిర్మాణాత్మక నష్టం గానీ, గాయాలు గానీ, సామర్థ్య లోపం గానీ తెలియరాలేదు. ఈ ఘటన తర్వాత భారత యుద్ధనౌక తన కార్యకలాపాలను కొనసాగించింది అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.