ముఖ్యమంత్రికి , రియల్ ఎస్టేట్ వ్యాపారికి తేడా ఉండాలి. ముఖ్యమంత్రికి తన సొంత ప్రయోజనాల కన్నా రాష్ట్ర భవిష్యత్తు, ప్రయోజనాలు ముఖ్యం కావాలి. రియల్ ఎస్టేట్ ఏజెంట్‌కు తన వెంచర్ అమ్మకాలు పూర్తయ్యాయా? లాభం వచ్చిందా లేదా? అనేది ముఖ్యం. ప్లాట్ కొన్నవాడు నిండా మునిగినా, రోడ్డునపడ్డా బ్రోకర్‌కు సంబంధం లేదు. తన కమీషన్ తనకు ముట్టిందా లేదా? అనేదే అతనికి ముఖ్యం. కానీ ఒక ముఖ్యమంత్రే రియల్ ఎస్టేట్ మధ్యవర్తి తరహాలో ఆలోచన చేస్తే అది రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం.
చాలా రోజుల క్రితం జీపీఆర్ పేరుతో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఉండేది. ఆ సంస్థ యజమాని జి.పున్నారావు. మాయమాటలు చెప్పి ఒకే ప్లాట్ నలుగురికి, ఐదుగురికి అమ్మేవాడు. బాధితులు ఫిర్యాదు చేయడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను జైలులో ఉన్నప్పుడు ఆ రియల్ ఎస్టేట్ సంస్థ డైరెక్టర్లు మాట్లాడుకున్న మాటలు వినే అవకాశం లభించింది. వీళ్లు పేరుకు డైరెక్టర్లు. కానీ నిజానికి ప్లాట్లు అమ్మే ఏజెంట్లు. కొనుగోలుదారులకు నమ్మకం కలిగించేందుకు డైరెక్టర్ అనే పేరు తగిలించుకుంటారు. ఓ రోజు వీళ్లు కస్టమర్లను ఎలా మోసగించారో ఏజెంట్లు అందరూ తమ గొప్పతనం చెప్పకొంటున్నారు. అమెరికాలో ఉండే కస్టమర్ ప్లాట్ కొన్నాడు, వచ్చి చూసుకుంటాను అంటే, ఏజెంట్ ‘మీ కెందుకు సార్.. నేను చూసుకుంటాను’ అని భరోసా ఇచ్చాడట. ఇలా ఒక్కొక్కరు ఎలా మోసాలు చేశారో చెప్పుకొంటున్నారు. విచిత్రం ఏమంటే జీ.పున్నారావును అరెస్ట్ చేసి జైలుకు పంపినా, సంస్థ ప్లాట్లను ఏజెంట్లు అమ్ముతూనే ఉన్నారు. తమ చేతుల్లో మోసపోతున్న జనం అమాయకత్వం, తాము మోసం చేస్తున్న తీరును చెప్పుకొంటూ ఏజెంట్లు నవ్వుతున్నారు. ఇప్పుడు సరిగ్గా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనా తీరు ఇలానే ఉన్నది. గతంలో ఓ టీవీ ఇంటర్వ్యూలో రేవంత్ ఇలా చెప్పారు. ‘తాము మోసం చేయడానికి, అబద్దాలు చెప్పడానికి ప్రజలు అవకాశం ఇస్తున్నారు, మేం అదే చేస్తున్నాం’ అని. ‘రాజనీతిజ్ఞుడు వచ్చే తరం గురించి ఆలోచిస్తే, రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు’ అని ఓ నానుడి. రేవంత్ కనీసం రాజకీయ నాయకుడిగా అలోచించి నిర్ణయాలు తీసుకున్నా బాగుండేది.
రేవంత్ వచ్చే ఎన్నికల గురించి కూడా ఆలోచించడం లేదు. ఎలాగైనా బోల్తా కొట్టించి ప్లాట్ అమ్మేసుకోని జేబులు నింపుకోవాలి అనే రియల్ ఎస్టేట్ ఏజెంట్ మనస్తత్వంతోనే వ్యవహరిస్తున్నారు. నా లుగు కాలాలపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండాలి, పేరు తెచ్చుకోవాలి, ప్లాట్ కొన్నవారు ఆనందించాలి అని కోరుకొనే రియల్ ఎస్టేట్ వ్యాపారులూ ఉంటారు.
కానీ రేవంత్ అలా ఆలోచించడంలేదు. ఇప్పటికిప్పుడు తన పెట్టుబడికి ఎన్ని రేట్లు ఆదాయం వస్తుంది అనే ట్రేడర్లానే వ్యవహరిస్తున్నారు. రియల్ ఎస్టేట్ అంటే లక్షల రూపాయలతో భూమి కొని, ప్రజలను బకరాలను చేసి కోట్లకు అమ్ముకోవడమే రియల్ ఎస్టేట్ వ్యాపారం అని అసెంబ్లీలో ఓ కాంగ్రెస్ సభ్యుడిని చూపిస్తూ రేవంత్‌రెడ్డి చెప్పారు. మరోవైపు రేవంత్‌రెడ్డి పాలనలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరిస్థితి అధ్వానంగా మారింది. గతంలో ఇతర రాష్ర్టాల్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగా లేనపుడు కూడా హైదరాబాద్‌లో లాభసాటిగా ఉండేది. కానీ ఇప్పుడు ఇతర రాష్ర్టాల్లో కన్నా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువగా దెబ్బతిన్నది . రంగారెడ్డి జిల్లా కందుకూరుకు చెందిన ప్రముఖ రియల్డర్ బాణాల రాంరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన 280 ఎకరాల భారీ ప్రాజెక్ట్ చేపట్టగా వివాదాలు, రాజకీయ సమస్యలు, అనేక ఒత్తిళ్లు ఎదురుకావడమే కారణం. చాలామంది పరిస్థితి ఇలాగే ఉన్నదని రియల్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టింది.
రైతులకు రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందించింది. ఆ పథకాలు సత్ఫలితాలు ఇచ్చాయి. అన్నదాతల ఆత్మహత్యలు నిలిచిపోయాయి. కానీ కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో 2026 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో ఇండ్ల అమ్మకాలు 13 శాతం తగ్గిపోయాయి. ఇప్పుడు దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే అమ్ముడుపోని ఇండ్లు అత్యధికంగా హైదరాబాద్‌లోనే ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో వ్యాపారులు 800కు పైగా ప్రాజెక్టులకు అనుమతులు పొందారు. వీటిల్లో 5.3 లక్షల ఫ్లాట్లలో 80 వేలకు పైగా అమ్ముడుపోకుండా ఉన్నాయి. ‘నేను రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చాను, రియల్ ఎస్టేట్ గురించి నాకు చెబుతారా’ అని రేవంత్‌రెడ్డి అంటున్నారు. రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చిన వ్యక్తి అయినందున, కనీసం ఆ ఒక్క రంగమైనా బాగుందా అంటే అదీ లేదు. రేవంత్‌రెడ్డి పాలనలో ఒక్క కాంగ్రెస్ అధిష్టానం తప్ప, అందరూ సంక్షోభంలోనే ఉన్నారు. మరోవైపు సెక్షన్ 22ఏ నిషేధిత భూముల జాబితా వల్ల కాంగ్రెస్ నాయకుల జేబులు నిండుతాయి కావొచ్చు. బాధితులు మాత్రం రోడ్డున పడుతున్నారు.
కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే అంశంలోనూ దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్ వెనుకబడి ఉన్నది. 2026లో తొలి త్రైమాసికంలో హైదరాబాద్‌లో కొత్త ప్రాజెక్టుల ప్రారంభంలో 46 శాతం పడిపోయింది. అమ్ముడుపోని ఇండ్లు కూడా హైదరాబాద్‌లోనే అత్యధికంగా ఉన్నాయి.
బీఆర్ఎస్ హయాంలో దేశంలోని అన్ని నగరాల కన్నా హైదరాబాద్‌లోనే హౌసింగ్ మార్కెట్ మొదటి స్థానంలో నిలిచినట్టు గణాంకాలు చెప్తున్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత స్తబ్ధత ఆవరించింది. సంక్షోభాన్ని ఎదుర్కోవడం గురించి ఆలోచించాల్సిన అధికారపక్షం పాలనకు పాతరేసి, చావు డప్పు ప్రాక్టీస్ చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నది. రాష్ట్ర భవిష్యత్తు ఇలా ఉంటుందని సంకేతమిస్తూపా చావు డప్పు కొడుతున్నారేమో!