Wildfire : వాతావరణ మార్పులవల్ల అమెరికా (USA), కెనడా (Canada) లలో కార్చిచ్చులు కొనసాగుతున్నాయి. వాషింగ్టన్ (Washington) రాష్ట్ర పరిధిలోని అటవీ ప్రాంతంలో అగ్నికీలలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. మంటలవల్ల 4.50 లక్షల ఎకరాల నేలపై చెట్లు కాలి బూడిదయ్యాయి. ఆ మంటలు సమీప నగరాలకు కూడా వ్యాపిస్తుండడంతో.. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి నాలుగు వేల మంది అగ్నిమాపక సిబ్బంది కృషి చేస్తున్నారు.
తూర్పు వాషింగ్టన్లో సుమారు 2.30 లక్షల మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం మూడు వేల ఎకరాల్లో అగ్నికీలలు చురుగ్గా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. బలమైన గాలులు వీస్తుండడంవల్ల మంటలను అదుపు చేయడం సవాల్‌గా మారింది. శనివారం మధ్యాహ్నం అగ్నికీలలు చెలరేగాయని అధికారులు తెలిపారు. వాషింగ్టన్‌లోని సుమారు 4 వేల నివాసాలకు ముప్పు పొంచి ఉందన్నారు. స్పోకేన్ ప్రాంతంలో మంటలు విస్తరిస్తుండడంతో.. 200 ఇళ్లు, పలు ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులను ఖాళీ చేయించినట్లు మేయర్ లిసా బ్రౌన్ తెలిపారు.
ఐదు కోట్ల మందికిపైగా అమెరికన్లపై కార్చిచ్చు ప్రభావం ఉంటుందన్నారు. అగ్నికీలలు వేగంగా విస్తరిస్తుండడంతో తూర్పు వాషింగ్టన్ సహా పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అక్కడి జాతీయ వాతావరణ కేంద్రం రెడ్ ఫ్లాగ్ హెచ్చరికను జారీచేసింది.