కోదాడ, జూలై 16 : బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అప్పటి కలెక్టర్, ఆర్డీఓ సమక్షంలో పారదర్శకంగా ఎంపిక చేసిన 565 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మౌలిక వసతులు కల్పించి తక్షణమే లబ్ధిదారులకు కేటాయించాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం ఇదే అంశంపై పార్టీ శ్రేణులతో కలిసి ఆర్డీఓ సూర్యనారాయణకు ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరెంట్, డ్రైనేజీ పైప్లైన్లు తదితర మౌలిక వసతులు కల్పించి తక్షణమే లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించాలన్నారు. బడుగు బలహీన వర్గాలకు సొంత ఇల్లు అనేది కలగానే మిగిలిపోకుండా గౌరవప్రదంగా జీవించేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని అమలు చేసి వేలాది కుటుంబాలకు ఆశ్రయం కల్పించారన్నారు. లబ్ధిదారులను ఎంపిక చేసి మూడు సంవత్సరాల కావస్తున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే అధికార పార్టీ నేతలు తాత్సారం చేస్తున్నారని విమర్శించారు.
రాజకీయాల కోసం నిరుపేదలకు అన్యాయం చేయటం సమంజసం కాదన్నారు. ఇప్పటికే కొంతమంది లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్లలోకి వెళ్లిన నేపథ్యంలో పోలీసులు బలవంతంగా ఖాళీ చేయించడం బాధాకరమన్నారు. మౌలిక వసతుల పేరుతో కాలయాపన చేస్తుండటంతో లబ్ధిదారులు అద్దెలు చెల్లించలేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మౌలిక వసతులు కల్పించి గృహ ప్రవేశాలు చేయించాలని ఆలస్యం చేయకుండా సానుకూల నిర్ణయం తీసుకోవాలని, అలా కాని పక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు నయీమ్, సీనియర్ నాయకుడు పైడిమరి సత్యబాబు, కౌన్సిలర్ చీమ నరేష్, ఉపేందర్ గౌడ్, భాగ్యమ్మ, గొర్రె రాజేష్, తుమ్మలపల్లి భాస్కర్, చలిగంటి వెంకట్, పట్టణ నాయకులు పాల్గొన్నారు.