హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 2: మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు ఎస్. జీవన్‌కుమార్ రచించిన ‘వీధి బతుకులు విస్థాపనలు’, ‘సజీవ స్మృతులు’ పుస్తకాలను ఆవిష్కరించారు. హనుమకొండలోని ప్రెస్‌క్లబ్ సెమినార్ హాల్లో ఆదివారం పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన వక్త కల్పన కన్నభీరన్ మాట్లాడుతూ.. జీవన్‌కుమార్ రచించిన రెండు పుస్తకాల్లోని హక్కుల సమస్యలన్నీ రాజ్యాంగ స్ఫూర్తిని విస్తృత పరిధిలో వ్యాఖ్యానించినట్లు ఉన్నాయని తెలిపారు.
గత దశాబ్దకాలంగా దేశంలో రాజ్యాంగ సంస్థలన్నీ తమ స్వతంత్రతను కోల్పోతున్నాయని కల్పన కన్నభీరన్ అన్నారు. విశ్వవిద్యాలయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఒక పథకం ప్రకారం కుల సమస్య, సామాజిక అణచివేత, స్త్రీలపై వివక్ష, మైనార్టీ మతస్థుల సమస్యలు.. వంటి అంశాలపైన పరిశోధనలకు అనుమతులు ఇవ్వడం లేదని ఆమె వాపోయారు. హిందూ రాజులు, హిందూ మతం గొప్పతనంపై మాత్రమే పరిశోధనలు కొనసాగాలని ఆంక్షలు విధిస్తున్నారని ఆమె విచారం వ్యక్తం చేశారు.
ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత మాట్లాడుతూ.. జీవన్‌కుమార్ 30 ఏళ్ల మానవ హక్కుల కార్యచరణలో భాగంగా రాసిన సమస్యలు ఇప్పటికైనా పరిష్కారమైతే బాగుండునని అభిప్రాయపడ్డారు. సామాజిక సమస్యలను ప్రస్తావించే మాలాంటి వాళ్లపై అసభ్యకరమైన ట్రోల్స్ చేస్తున్నారని సుజాత వెల్లడించారు. అనంతరం రచయిత జీవన్‌కుమార్ సమావేశంలో తన అనుభవాలను పంచుకున్నారు. సామాజిక హక్కుల రంగాల్లో పనిచేసి అమరులైన వారి కుటుంబ సభ్యులు ‘సజీవస్మృతులు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, డాక్టర్ తిరుపతయ్యలు, వేమన వసంతలక్ష్మి, కాత్యాయని విద్మహే, దేవులపల్లి అమర్, కవయిత్రి విమల, మెట్టు రవీందర్‌లు, కే అనురాధ పాల్గొన్నారు.