Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని, బాలాఘాట్ జిల్లాలో దారుణం జరిగింది. గుడిసెలో నిద్రిస్తున్న ఒక మహిళను పులి లాక్కెళ్లి, తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనలో మహిళ మరణించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని, బాలాఘాట్ జిల్లా, ఖాపా రేంజ్ పరిధి, పర్రాపూర్ బైగోటోలా గ్రామంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. ఈ ప్రదేశం కన్హా నేషనల్ పార్క్ పరిధిలో ఉంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో సుగ్ని బాయ్ దుర్వే అనే 30 ఏళ్ల మహిళ తన కుటుంబంతో కలిసి గుడిసెలో ఉంటోంది. ఈ గుడిసెకు తలుపు లేదు. ఈ క్రమంలో రాత్రి గుడిసెలోకి పులి చొరబడింది.
నిద్రిస్తున్న సుగ్ని తలను నోట కరుచుకుని పులి వెళ్లిపోయింది. ఈ క్రమంలో బాధిత మహిళ అరుపులు విన్న కుటుంబ సభ్యులు లేచారు. చుట్టుపక్కల వారిని సాయం కోసం గట్టిగా అరిచారు. దీంతో అప్రమత్తమైన వారు మహిళను రక్షించేందుకు ప్రయత్నించారు. టార్చ్‌లు, కర్రలతో రాత్రి పూట ఆ మహిళను ఎత్తుకెళ్లిన పులి కోసం గాలించారు. ఆలోపే ఆ మహిళ తల భాగం నోట్లో పెట్టుకున్న పులి, ఆమెను 300 మీటర్ల దూరంలోని అటవీ ప్రాంతానికి లాక్కెళ్లింది. అందరూ వెంబడించడంతో కొద్దిసేపటి తర్వాత ఆమెను విడిచిపెట్టి, పులి అడవిలోకి వెళ్లిపోయింది. వెంటనే బాధిత మహిళను స్థానికులు బిహార్‌లోని ఒక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సుగ్నికి తీవ్రగాయాలు కావడంతో అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై బాధిత మహిళ కుటుంబంతోపాటు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలోని నివాస స్థలాల్లోకి పులులు, చిరుతలు తరచూ వస్తూ, దాడి చేస్తున్నాయని స్థానికులు ఆరోపించారు. మహిళ ఉంటున్న గుడిసెకు తలుపులు లేకపోవడం కూడా ఒక కారణమని చెబుతున్నారు. ప్రభుత్వం ఆమెకు ఇల్లు మంజూరు చేయకపోవడం వల్ల కూడా ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు. దీనిపై ఫారెస్టు అధికారులు, పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరణించిన మహిళ కుటుంబానికి నష్టపరిహారం అందిస్తామని అధికారులు తెలిపారు. పులిని త్వరలోనే బంధిస్తామని చెప్పారు.