S Jai Shanker : భారత్, రష్యా (India-Russia) మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతున్నాయని భారత విదేశాంగ మంత్రి (Indian Foreign Minister) ఎస్ జైశంకర్ (S Jaishanker) అన్నారు. ఈ ఏడాది సుమారు 70 వేల మంది నైపుణ్యం కలిగిన భారతీయ కార్మికులకు తమ దేశంలో ఉపాధి కల్పించేందుకు రష్యా అంగీకరించిందని చెప్పారు. ముఖ్యంగా నిర్మాణ, లాజిస్టిక్స్ రంగాల్లో ఈ నియామకాలు జరుగనున్నాయి. ఈ కీలక విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్వయంగా వెల్లడించారు. పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సమావేశంలో ఆయన ఈ వివరాలు తెలిపారు.
భారత్-రష్యా సంబంధాలపై జరిగిన ఈ సమావేశానికి జైశంకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, కనెక్టివిటీ, సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలు వంటి పలు అంశాల్లో ఇరుదేశాలు కలిసి పనిచేస్తున్నాయని వివరించారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత సమతుల్యంగా విస్తరించాలని ఇరుదేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయని, ఇందులో భాగంగా ఏడు కీలక రంగాల్లో రష్యాకు భారత ఎగుమతులు పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్, ఆహార ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తులు, ఇంజినీరింగ్ వస్తువులు, రసాయనాలు, టెక్స్టైల్స్ రంగాల్లో ఈ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇంధన సహకారంపై మాట్లాడుతూ.. బహుళ వనరుల నుంచి ఇంధన సరఫరాలను కొనసాగించడం ద్వారా భారత వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని జైశంకర్ స్పష్టంచేశారు. చెన్నై-వ్లాదివోస్టాక్ కారిడార్, అంతర్జాతీయ నార్త్-సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, నార్తర్న్ సీ రూట్ వంటి కనెక్టివిటీ ప్రాజెక్టులపైనా సమావేశంలో చర్చించారు.
భారత్-యురేషియన్ ఎకనామిక్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఇదే సమయంలో ఉక్రెయిన్ సంక్షోభంపై భారత్ దౌత్యపరమైన ప్రయత్నాలను జైశంకర్ కమిటీకి వివరించారు. చర్చలు, శాంతియుత పరిష్కారానికి భారత్ ఎల్లప్పుడూ మద్దతిస్తుందని పునరుద్ఘాటించారు. రష్యా సైన్యంలో సహాయక విధుల పేరుతో చిక్కుకున్న భారతీయ పౌరుల విడుదల కోసం చేస్తున్న ప్రయత్నాలను కూడా ఆయన సభ్యులకు తెలియజేశారు.
ఇప్పటివరకు సుమారు 140 మందిని సురక్షితంగా విడిపించామని, మరో 55 మంది ఆచూకీ కోసం రష్యా అధికారులతో చర్చిస్తున్నామని తెలిపారు.