Singeetham Srinivasa Rao | భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు నేడు అంతిమ వీడ్కోలు పలకనున్నారు. 94 ఏళ్ల సింగీతం వయోభారంతో అనారోగ్యానికి గురై శనివారం రాత్రి చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతితో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.సింగీతం శ్రీనివాసరావు పార్థివదేహాన్ని చెన్నైలోని విరుగంబాక్కంలోని ఆయన నివాసంలో ప్రజలు, కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. అభిమానులు, సహచరులు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. సింగీతం చివరి చూపు కోసం పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివస్తున్నారు.
సింగీతం శ్రీనివాసరావు అంత్యక్రియలను ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చెన్నై నెసపాక్కం శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు అంత్యక్రియలకు హాజరై ఆయనకు తుది నివాళులు అర్పించనున్నారు.సింగీతం శ్రీనివాసరావు మృతిపై పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పించారు. ముఖ్యంగా కమల్ హాసన్, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు సింగీతం మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
సింగీతం దర్శకత్వంలో ఎన్నో విభిన్న చిత్రాలు తెరకెక్కాయి. ఆయన సినిమాల్లో ప్రయోగాత్మకత, హాస్యం, భావోద్వేగం, వైవిధ్యమైన కథన శైలి ప్రధానంగా కనిపించేవి. అందుకే ఆయనను తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన దర్శకుడిగా సినీ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి.దర్శకుడిగానే కాకుండా రచయితగా, సృజనాత్మక ఆలోచనాపరుడిగా సింగీతం శ్రీనివాసరావు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో ఆయన పనిచేశారు. ‘పుష్పక విమానం’, ‘ఆదిత్య 369’ వంటి ప్రయోగాత్మక చిత్రాలతో పాటు ఎన్నో విజయవంతమైన సినిమాలను ఆయన ప్రేక్షకులకు అందించారు. సాధారణ కథలను కూడా తనదైన శైలిలో కొత్తగా చెప్పడం, సాంకేతికంగా సరికొత్త ప్రయోగాలు చేయడం సింగీతం ప్రత్యేకతగా నిలిచింది.వయసు మీద పడినా సినిమా పట్ల ఆయన ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. చివరి దశలోనూ కొత్త కథలు చెప్పాలనే తపనతో కొనసాగారు. ఆయన చివరి దర్శకత్వ చిత్రం ‘సింగ్ గీతం’ కూడా సినిమాపై ఆయనకున్న అచంచలమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచింది.