PM Modi : దేశంలో పెరిగిపోతున్న మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ పేరుతో సాగే 100 వారాల జాతీయస్థాయి కార్యక్రమాన్ని ఆదివారం ప్రధాని మోదీ న్యూఢిల్లీలో ప్రారంభించారు. దేశ యువత మాదకద్రవ్యాల వినియోగాన్ని వీడాలని, డ్రగ్ ఫ్రీ ఇండియా నిర్మాణంలో పాలుపంచుకోవాలని యువతను మోదీ కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రతివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తామని ప్రధాని అన్నారు.
దేశాభివృద్ధికి, లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు మానసికంగా, శారీరకంగా ధృడత్వం కలిగిన యువత అవసరమని మోదీ అభిప్రాయపడ్డారు. ‘జన్ భాగిదారి’ పేరుతో మొదట 100 వారాల ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తారు. పలు స్పోర్ట్ ఈవెంట్లు, వాకథాన్స్, మెడిటేషన్ క్యాంపులు, సాంస్కృతిక కార్యక్రమాలు, వీధి నాటకాలు, చర్చలు, ఆర్ట్ కాంపిటీషన్స్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ వంటివి నిర్వహిస్తారు. డ్రగ్స్ వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాల్ని వివరిస్తారు. వ్యక్తులు, కుటుంబాలు, సమాజం, దేశం అంతా కలిసి సంయుక్తంగా డ్రగ్స్ మహమ్మారిని ఎదుర్కోవాలని మోదీ పిలుపునిచ్చారు. డ్రగ్స్ వినియోగం విషయంలో అప్రమత్తంగా, బాధ్యతగా ఉండాలని మోదీ కోరారు. డ్రగ్స్ రహిత భారత దేశం కోసం రాబోయే 100 ఆదివారాలు, 100 కీలక నిర్ణయాలు, చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల తాత్కాలిక శక్తి లభిస్తుందని, కానీ, వీటివల్ల కెరీర్లు, కుటుంబాలు నాశనం అవుతాయని ఆయన పేర్కొన్నారు.
డ్రగ్స్‌కు బానిసై కోరుకుంటున్న వారిపై వివక్ష చూపకూడదని, వారికి తగిన గౌరవం ఇచ్చి, జీవితంలో ఎదిగేందుకు ఇంకో అవకాశం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. కుటుంబ సభ్యులు ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలుగా మారితే, సమాజం ఏమనుకుంటుందో అనే భ్రమతో ఆ విషయాన్ని దాచిపెట్టకూడదని కూడా ప్రధాని సూచించారు. దీని బదులు వారికి వైద్య సహాయం అందించి, ఆ అలవాటు నుంచి బయటపడేలా చేయాలని కోరారు. డ్రగ్స్ సరఫరా చేసే వారి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిరంతరం కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని వెల్లడించారు.